ఎంపీ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్

ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మళ్లీ ఎన్నడూ హిందూత్వం గురించి  మాట్లాడబోనని  చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పొన్నం ప్రభాకర్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో మాట్లాడిన బండి సంజయ్.. తనను ఆడిపోసుకోవడమే కేటీఆర్, పొన్నం ప్రభాకర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.తాను హామీలు అమలుపై ప్రశ్నిస్తే  దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.ఏం తప్పు చేశానని తనను  అరెస్ట్ చేస్తారో చెప్పాలన్నారు. 

పొన్నం ప్రభాకర్ తల్లిపై  తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు బండి సంజయ్.  పొన్నం తన తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అని పొన్నం అన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. 

ALSO READ :- శివరాత్రి రోజు జాగరణ.. ఉపవాసం ఎందుకు చేయాలి..

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 697 కోట్లు మోదీ ప్రభుత్వం వెచ్చించిందన్నారు.  ప్రజలపక్షాన పోరాడితే తనపై వందకు పైగా కేసులు పెట్టి జైలుకు పంపారని చెప్పారు. పొన్నం ప్రభాకర్ ఏనాడైనా  మీప్రజల కోసం కొట్లాడారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అమలు చేయాల్సిందే..మేనిఫేస్టోలో తెలిపిన 423 హామీలను అమలు చేయాల్సిందేనని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా హాీలను అమలు చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేసీఆర్ పదేళ్లలో 5లక్షల కోట్ల అప్పు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే 10 వేల కోట్ల అప్పు చేసిందన్నారు.