నేను ప్రధాని అయ్యుంటే.. ఆమెను దేశం విడిచి వెళ్లిపోమనేవాడిని: యువరాజ్ తండ్రి

నేను ప్రధాని అయ్యుంటే.. ఆమెను దేశం విడిచి వెళ్లిపోమనేవాడిని: యువరాజ్ తండ్రి

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ మహిళా నేత షమా మొహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ స్పంస్పందించారు. దేశ పౌరులై ఉండి మన ఆటగాళ్ల గురించి కానీ, మన దేశ ప్రజల గురించి చెడుగా మాట్లాడకూడదని ఆయన సూచించారు. రోహిత్ శర్మ తన నాయకత్వంలో దేశానికి ప్రపంచకప్(టీ20) సాధించి పెట్టాడని, అటువంటి క్రికెటర్‍ను కించపరిచేలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. 

ఇటువంటి ఘటనలు ఎక్కువగా పాకిస్తాన్‌లో జరుగుతుంటాయన్న యోగరాజ్.. మన దేశంలో వినాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డానని తెలిపారు. తాను దేశ ప్రధాని అయ్యుంటే.. ఆమెను తన సామాను సర్దుకుని దేశం విడిచి వెళ్ళమని చెప్పేవాడినని అన్నారు. 

"నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ దేశంలో నివసిస్తున్నవారు ఎవరైనా మన ఆటగాళ్ల గురించి, మన దేశ ప్రజల గురించి చెడుగా మాట్లాడకూడదు.  రాజకీయ వ్యవస్థలో కూర్చున్న వారు ఎవరైనా మన దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆటగాడి గురించి కించపరిచేలా ప్రకటన చేసినందుకు సిగ్గుపడాలి.."

"ఈ వ్యాఖ్యలతో నేను చాలా బాధపడ్డాను. ఇటువంటివి పాకిస్తాన్‌లో జరుగుతుంటాయి. ఇప్పుడు మన దేశంలో చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. మనం సంస్కారవంతులం, విద్యావంతులం, భారత ప్రజలం.. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎంపీ ఎవరైనా సరే, ఆ మహిళ మన తల్లి లేదా కూతురు లాంటిది. ఆమెను మనం గౌరవిస్తాము. కానీ ఈనాడు ఆ తల్లి వ్యాఖ్యలు.. జన్మనిచ్చిన బిడ్డను చంపడం వంటివి, ఒక సోదరి తన సోదరుడి రాఖీ కట్టిన తర్వాత దానిని పగలగొట్టడం వంటివి, ఒక కూతురు తన తండ్రిని ఇంటి నుండి వెళ్ళగొట్టడం వంటివి. నాకు ఆ విధంగానే అనిపిస్తుంది. ఇటివంటి వారికి మన దేశంలో ఉండే హక్కు లేదు.." అని యోగరాజ్ అన్నారు. 

దేశం విడిచి వెళ్లండి..

 ఇటువంటి వ్యాఖ్యలు సహించరాదని, షామా మొహమ్మద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యోగరాజ్ పిలుపునిచ్చారు.

"దీనిని ఏమాత్రం సహించకూడదు. తక్షణమే చర్యలు తీసుకోవాలి. పౌరులు, రాజకీయ నేతలు ఎవరైనా క్రీడాకారులకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఇలా చేస్తున్న వారు దీనిని రాజకీయ సమస్యగా మార్చడానికి సిగ్గుపడాలి. నేను ప్రధానమంత్రిని అయితే, ఆమెను తన సామాను సర్దుకుని దేశం విడిచి వెళ్ళమని చెప్పేవాడిని.ప్రధానమంత్రి ఆమెను క్షమాపణ చెప్పమని లేదా దేశం విడిచి వెళ్ళమని అడగాలి.." అని యోగరాజ్ అన్నారు.

ఇంతకీ ఈమె ఏమన్నదంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ ప్రదర్శనను ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ మహిళా నేత షామా మొహమ్మద్ తన సోషల్‌ మీడియా ఖాతాలో రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని, అతను బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్‌ అయ్యారని.. సచిన్, ద్రవిడ్‌, గంగూలీ, కోహ్లీ, ధోనీలతో పోల్చితే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని సదరు పోస్టులో పేర్కొన్నారు. ఇది రాజకీయ విమర్శలకు దారితీసింది.