అసహనం పెరిగితే ప్రజలకు ఇంకింత దూరం : పొలిటికల్​ ఎనలిస్ట్​

అసహనం పెరిగితే ప్రజలకు ఇంకింత దూరం :  పొలిటికల్​ ఎనలిస్ట్​

అహంకారం ఓడినపుడు అసహనం పెరగడం సహజమా? అంటే అవుననే అనిపిస్తున్నది.  ప్రజలు కోరుకున్న తీర్పుపై సోషల్ మీడియాలో కొందరు తమ అసహనాన్ని  వెళ్లగక్కడం కనిపించింది. సోషల్​ మీడియాను అన్ని పార్టీలూ సద్వినియోగంకన్నా దుర్వినియోగమే ఎక్కువ చేస్తున్నాయనడంలో రెండో అభిప్రాయం అక్కరలేదు. కానీ, పదేండ్లుగా  అధికార పార్టీ పెంచి పోషించిన సోషల్​ మీడియా బ్యాచ్​లే ఇయ్యాల బీఆర్​ఎస్​ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి! కేసీఆర్ లేని తెలంగాణ ఏమవుతుందో? కేటీఆర్ లేని ఐటీ రంగాన్ని  హైదరాబాద్​లో ఊహించుకుంటేనే భయమేస్తుంది!  ఇక ఢిల్లీకి గులామీ యాత్రలు మొదలైనాయి! ఇలాంటి రాతలు చూస్తుంటే, పదేండ్లలో సారు పాలక భజన బృందాలను ఎలా పోషించారో అర్థమైంది. హైదరాబాద్​ నగరం అభివృద్ధికి ఓటేస్తే, గ్రామీణ ప్రజలు తమకు తామే నోట్లో మట్టికొట్టుకున్నారు అనేదాక సోషల్ మీడియాలో రాసిన ఆ బ్యాచ్​లు ఎవరిని చూసుకొని పల్లె తెలంగాణను నిందిస్తున్నాయో అర్థంకావట్లేదు! బహుశా ప్రజాతీర్పును తప్పుపట్టే సంస్కృతిని మరెక్కడా చూసి ఉండం. కానీ, ఇయ్యాల తెలంగాణలో చూడాల్సి వస్తోంది. ఓటర్లనే నిందించేలా రాతలు గుప్పించిన ఆ బ్యాచ్​లను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది.

ఇన్నాళ్లు తనను గెలిపించిన ప్రజలకు కేసీఆర్​  కనీసం ధన్యవాదాలు చెప్పిన దాఖలా లేదు! కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రికి కూడా శుభాకాంక్షలు తెలిపినట్లు నేను ఈ వ్యాసం రాసేటప్పటికైతే చూడలేదు. ఒకవేళ చెపితే అదొక మంచి సంప్రదాయం.  రాజకీయాల్లో కనీస మర్యాదలు ఉండాలె! ఆవహించిన అసహనంలో  అవి కూడా కొట్టుకపోకూడదు! ఎన్నికల ఫలితాల తర్వాత  ఫాంహౌస్​కు వెళ్లిన పార్టీ నేతలతో కేసీఆర్​ ఇలా స్పష్టంగా చెప్పాడని వార్త చదివాం. 4 నెలలు కొత్త ప్రభుత్వానికి  సమయమిద్దాం . ఆ తర్వాత పరిస్థితులపై మాట్లాడుదాం అని అన్నట్లు చదివాం. నిజంగా అది మంచి పద్దతి. కానీ, సోషల్​ మీడియాలో  జరుగుతున్న  విపరీత అసహనం సంగతి  ఏమిటనేదే చర్చించాల్సిన విషయం.

ఢిల్లీ యాత్రలు సరే, ప్రగతిభవన్​ సంగతి?

ఇక ఢిల్లీ యాత్రలు పెరుగుతాయనేవారు.. తొమ్మిదేండ్ల  ప్రగతిభవన్ అవమానాలను ఎందుకు మర్చిపోతున్నారు? అనేక సార్లు మంత్రులు సైతం ప్రగతిభవన్​ అవమానాలు చవి చూశారని విన్నాం. బహుశా ఢిల్లీ వెళ్లే  నాయకులకు మాత్రం అలాంటి అవమానాలు ఎదురై ఉండకపోవచ్చు! ‘ ప్రగతి భవన్​ లోపలికి అనుమతి లభించే లోపల.. ఢిల్లీకి నాలుగుసార్లు పోయిరావచ్చు’ అనే  తొమ్మిదేండ్ల నానుడిని ఎవరు కాదంటారు?

అసహనం ఎవరిపైన?

అహంకారం, ఇలా అసహనంగా అవతారమెత్తడం మంచి పరిణామం కాదు. ప్రజలను నమ్ముకొని రాజకీయం చేయాలె. అసహనం పెంచుకోవడమంటే ప్రజలను మరింత దూరం చేసుకోవడమే అవుతుంది. మూడు రోజుల్లోనే మాకు విపరీతమైన సింపతీ వచ్చిందని కేటీఆర్​ అంటున్నారు. ‘అయ్యో కేసీఆర్​  సీఎంగా లేడా’ అంటూ మెసేజ్ లు వస్తున్నాయన్నారు. అంటే, తమను ఓడించిన ప్రజలే చింతిస్తున్నట్లు ఆయన చెపుతున్నారు.  వాస్తవానికి కొత్త ప్రభుత్వమే ఏర్పడలేదు. బీఆర్​ఎస్​కు సింపతీ ఎక్కడి నుంచి వస్తున్నదో ఎవరికీ తెలియదు!  ప్రజలు తప్పు చేసి పశ్చాత్తాప పడుతున్నారని చెప్పడం చూస్తే ఆ పార్టీకి  ప్రజాతీర్పు పట్ల ఉన్న గౌరవం ఏపాటిదనుకోవాలె? ఓటమి చెందాక కూడా మాట్లాడే మాటల్లో అసహనం తాండవించడం ఆయనకు శోభనివ్వదు. కానీ, తమ సహజ గుణమే తమ పార్టీ ఓటమికి ప్రధాన  కారణమని ఆయన ఇప్పటికీ  తెలుసులేకపోవడం దురదృష్టకరం!

కేటీఆర్​ పెట్టుబడుల మాయ

కేటీఆర్​ లేకపోతే హైదరాబాద్​లో  ఐటీ రంగం ఏమవుతుందో ఊహించుకోవాలంటేనే భయమేస్తుందని సోషల్​ మీడియాలో రాసిన మహానుభావులూ ఉన్నారు.  నేను లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకునే దానివి అని అడిగినట్లుంది! ఓపిక ఉంటే, పరిశ్రమల శాఖలో ఆర్​టీఐ ద్వారా బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు ఏమిటో తెలుస్తుంది.  తొమ్మిదేండ్లలో 3.3 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, తద్వారా 22.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఐటీ మంత్రి కేటీఆర్​ చెపుతున్నారు. కానీ, పరిశ్రమల శాఖ ఆర్​టీఐకి ఇచ్చిన సమాచారం చూస్తే..  రూ. 2.77 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని, దాంతో 17.82 లక్షల ఉద్యోగాలు లభించవచ్చని చెప్పింది. మంత్రి గారేమో ‘వచ్చాయ’ని చెప్పారు, పరిశ్రమల శాఖ నేమో ‘రావచ్చు’ అని చెప్పడాన్ని అందరూ గమనించాలె. రాని పెట్టుబడులను కూడా వచ్చేసినట్లు, రాని ఉద్యోగాలను కూడా వచ్చేసినట్లుగా  ప్రచారంలో పెట్టి  నేనే అద్భుత మంత్రిని తనకు తానే పొగిడించుకునే ప్రయత్నం నిరంతరం ఆయన చేస్తూనే ఉన్నారు! కాస్త ఇంగ్లీషు భాషలో చెప్పడంతో ఆయనొక అద్భుత ఐటీ మంత్రిగా కొందరు భావిస్తున్న మాట నిజం! కానీ ‘మేడి పండు పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అనే సామెత  వంటివే ఆయన తెచ్చానంటున్న పెట్టుబడులు.

హైదరాబాద్​ అభివృద్ధి  ఎవరున్నా లేకున్నా ఆగేది కాదు

వచ్చిన పెట్టుబడులకు కేటీఆర్​ చెప్పుకుంటున్న పెట్టుబడులకు ఎలాంటి పొంతనలేదు.  పరిశ్రమల శాఖ చూపుతున్న పెట్టుబడులలో  ఇటుక బట్టీలు, వెల్డింగ్​ షాపులు, పిండి గిర్నీలు కూడా ఉన్నాయంటే ఆలోచించండి.  రియల్​ ఎస్టేట్ కంపెనీలు, మైహోం, అపర్ణ వంటి సంస్థలకు ‘రెరా’ ఉండగా, వాటిని కూడా టీఎస్​ఐపాస్​ ద్వారా వచ్చిన పెట్టుబడి కంపెనీలుగా చూపడం మరొక వింత! హైదరాబాద్ అభివృద్ధి కూడా నిరంతరం పెరిగే మన గడ్డం లాంటిదే తప్ప ఎవరున్నా లేకున్నా అది ఆగేది కాదు.  కేటీఆర్​ లేకుంటే అంతకన్నా ఆగేది కాదు! సోషల్​ మీడియా పుక్కిడి ప్రచారాలు చీప్​ పాలి‘ట్రిక్స్’కు పనికొస్తాయి తప్ప, రియాలిటీకి నిలబడలేవు.​ హైదరాబాద్​ ఎవర్​గ్రీన్​ సిటీ బై నేచర్​!  నాట్​ బై ఎనీ పర్సన్​!

శాశ్వత పాలకులనుకున్నారు

తెలంగాణకు శాశ్వత పాలకులం మేమే అనే సైకాలజీలో బీఆర్ఎస్​ యజమానులు పదేండ్లుగా జీవిస్తూ వస్తున్నారు. ఇవాళ ఆ సైకాలజీ నుంచి బయటపడలేకపోతున్నారు. అధికారం దూరమవడం అసంభవం అని అతివిశ్వాసంలో జీవించారు. ఇవాళ హఠాత్తుగా పరాజయం ఎదురయ్యే సరికి జీర్ణించుకోలేకపోవడం సహజ పరిణామం.  ఇదొక ప్రజాపాలన అనే ధోరణి ఎక్కడా కనిపించిన దాఖలా లేదు.  పరిపాలన ప్రజలతో కలిసి నడవలేదు. అంతా మాకే తెలుసు అనే ధోరణి అమాంతం పెరిగింది.  ఏదైనా సమస్య చెప్పుకునేందుకు వస్తే తెలంగాణ పేదోడిని ప్రగతిభవన్ వెక్కిరించింది. ​ సీమాంధ్ర కాంట్రాక్టర్లను, సీమాంధ్ర ఇండస్ట్రియలిస్టులను మాత్రం​ అనుమతించింది, గౌరవించింది. కడుపు మండిన తెలంగాణోడి ఆత్మగౌరవం ప్రగతిభవన్​ గేటు ముందు నిరంతరం అవమానాలకే గురైంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పనితీరును ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉండవచ్చు.  కానీ, కేసీఆర్​ ప్రభుత్వం ప్రశ్నించే అవకాశాలనే నిర్బంధించింది. ఓటమి పై ఆత్మపరిశీలనను గాలికి వదిలేసి, అసహనం పెంచుకుంటే ప్రజలకు మరింత దూరం కావడం ఖాయం.

కాళేశ్వరం కాదు, వానదేవుడే వరం

కేసీఆర్ లేని తెలంగాణ ఏమవుతుందో? అనే మరో ప్రచారం గురించి చెప్పుకుందాం. నిజానికి తొమ్మిదేండ్లుగా తెలంగాణకు కావాల్సినంత వర్షాలు కురిసాయి. నీటికి కొరత లేదు. అది వానదేవుడి వరం తప్ప, కాళేశ్వరం వరం కాదు. ఎక్కడ నీళ్లు కనిపించినా అవి కాళేశ్వరం నీళ్లే అని ప్రచారం చేసుకోవడం మాత్రం పాలకులకు వరమైంది. నిజంగానే కాళేశ్వరం నీళ్లే నిజమైతే.. ఇప్పటికీ తెలంగాణలో సుమారు 25 లక్షలకు పైగా బోరు బావులకు ఉచిత కరెంటు ఎందుకు ఇస్తున్నట్లో చెప్పాలె.  కాళేశ్వరం కట్టాక కూడా మనం బోర్ల తెలంగాణగానే ఎందుకు బతుకుతున్నాం?

కరెంట్ లభ్యత కేంద్ర ప్రభుత్వాల పుణ్యం

ఇకపోతే కరెంటు విషయానికి వస్తే, నిజంగా తెలంగాణ వచ్చిన నాడు కరెంటు కోతలు భయంకరంగా ఉన్నాయి.  కేంద్రంలో మన్మోహన్​ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో,  మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో కరెంటు కోతలు తగ్గాయి. మార్కెట్లో విద్యుత్​ ఉత్పత్తి పెరిగింది. కావల్సినంత మార్కెట్​లో దొరుకుతున్నది. అది మన తెలంగాణకూ కలిసొచ్చింది. కేసీఆర్​ ప్రభుత్వం కూడా బయట నుంచి విద్యుత్​ను కొనుగోలు చేసి, రాష్ట్రంలో  కోతలు లేకుండా సప్లై చేయగలుగుతున్నది. ఇందులో కేసీఆర్​ ప్రభుత్వం గొప్పతనమేమీ లేదు. పదేండ్లైనా తెలంగాణకు సరిపడా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో కేసీఆర్​ ప్రభుత్వం విఫలమైంది తప్ప సాధించిందేమీ లేదు. యాదాద్రి పవర్​ ప్లాంట్​ పనిచేపట్టారు కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదు. భద్రాద్రి కొంతమేర పూర్తయినా, పాత టెక్నాలజీ యంత్రాలతో ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగి అదొక అనర్థక ప్లాంట్​గా మారింది. మన విద్యుత్​ రంగంలో సాధించిన ఘనకార్యం ఏమీ లేదు. డిస్కంల అప్పులు మాత్రం 40 వేల కోట్లకు చేరాయి. కాళేశ్వరం డిజాస్టర్​పై ఎంత చెప్పినా తక్కువే.  ‘కేసీఆర్​ లేని తెలంగాణ ఏమవుతుందో’ అనే  సోషల్​ మీడియాలో పుక్కిడి ప్రచారాలకు .. తొమ్మిదన్నరేండ్లలో జరిగిన అభూత కల్పనలు, అనర్థాలే జవాబులు కావందామా?

- ‌‌కల్లూరి శ్రీనివాస్​రెడ్డి,
 పొలిటికల్​ ఎనలిస్ట్​