పెద్ద చెరువులో రోడ్డు ఉందని తేలితే తొలగిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్​

పెద్ద చెరువులో రోడ్డు ఉందని తేలితే తొలగిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్​

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అబ్దుల్లాపూర్​మెట్​ మండలం కుంట్లూరు పెద్ద చెరువు స్థలంలో రోడ్డు నిర్మాణంపై హైడ్రా చేస్తున్న సర్వే రెండో రోజైన బుధవారం కొనసాగింది. కుంట్లూరు సర్వే నంబర్185లోని పెద్ద చెరువు స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేసుకున్నారని గ్రామస్తుడు వెంకట్ రెడ్డి చేయడంతో,  ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే తీరును హైడ్రా కమిషనర్ రంగనాథ్​బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ చెరువు స్థలంలో నుంచి రోడ్డు వేసినట్టు తేలితే తొలగించాల్సి ఉంటుందని, పట్టా భూమి సరిహద్దు నుంచి రోడ్డు వేసుకోవాలని సూచించారు. 

సర్వే నంబర్185లో పెద్ద చెరువు 95.20 ఎకరాల్లో ఉందని రికార్డులు చెబుతున్నాయి. అయితే మున్సిపల్ నిధులతో ఈ సర్వే నంబర్​లో రోడ్డు నిర్మాణం కోసం తీర్మానం చేయగా, నిధులు కేటాయించారని తెలియడంతో పెద్ద అంబర్​పేట​మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీందర్ రెడ్డిపై రంగనాథ్​ఆగ్రహం వ్యక్తం చేశారు. 185 సర్వే నంబర్​చెరువు భూమి అని స్పష్టంగా తెలుస్తుండగా రోడ్డు నిర్మాణానికి నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. 

తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ బానోత్ దూదియ, హైడ్రా తహసీల్దార్ హేమమాలిని ఆయన వెంట ఉన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ లీడర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ భర్త విజయశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ.. కొందరు కావాలనే హైడ్రాకు ఫిర్యాదులు చేశారని, తాము చెరువు భూమి గజం కూడా కబ్జా చేయలేదన్నారు. గతంలో తమకు ఉన్న రోడ్డును పక్క పట్టాదారులతో కలిసి వెడల్పు చేసుకున్నామన్నారు.  అలాగే హిమాయత్ నగర్ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కొందరు మట్టి పోస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి, సమీప నిర్మాణాలను పరిశీలించారు. మట్టిపోస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.