కడెం ప్రాజెక్టు గేట్లు ఆపరేట్​ చేస్తే మోటార్లు కాలిపోయే ఛాన్స్​

కడెం, వెలుగు: ఇటీవల వర్షాలతో వచ్చిన వరదల కారణంగా ప్రమాదపుటంచుకు చేరుకున్న కడెం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వరద ఉధృతి కారణంగా ఒక దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనన్న అనుమానాలు కూడా తలెత్తాయి. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడం, దిగువకు కేవలం 2 లక్షల క్యూసెక్కులను మాత్రమే వదలడంతో ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తు వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. భవిష్యత్​లో ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్టు ఆధునీకరణ అంశాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఇందులో భాగంగా హైలెవెల్​ టెక్నికల్​ టీంను కడెంకు పంపింది. సోమవారం ఈ టీం ప్రాజెక్టును సందర్శించి ఆధునీకరణకు అవసరమయ్యే చర్యలను పరిశీలించారు.

కొద్ది రోజుల తర్వాతే ఆపరేట్​చేస్తాం

హైదరాబాద్​కు చెందిన ఈఎన్​సీ విభాగంలోని ఓఅండ్​ఎం ఈఈ విద్యానంద్​, డీఈ కరుణాకర్​, రిటైర్డ్​ ఈఈ సురేందర్​, జేఈ సంగీత్​కడెం ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను, తెగిన కౌంటర్​వేటర్లను, గేట్ల ఆపరేటింగ్​మోటార్లను చూశారు. ఎగువ నుంచి వచ్చిన వరద వివరాలతో పాటు మైసమ్మ ఆలయం వద్ద గండిని పరిశీలించారు. దాదాపు 3గంటల పాటు క్షుణ్ణంగా అబ్జర్వ్​చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గేట్లపై నుంచి నీరు పొంగి ప్రవహించడంతో ప్రస్తుతం గేట్లను ఆపరేట్ చేయలేమన్నారు. ఒకవేళ అలా చేసినట్టయితే తడిసిన మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉందన్నారు.

కొద్ది రోజుల సమయం తీసుకుని ఆపరేట్​చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే ఎన్ని గేట్లు పని చేస్తాయో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్​ స్టోరేజీ స్థాయికి చేరిందని, ఓపెన్​చేసి ఉన్న గేట్లు మూసేంత వరకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని గోదావరిలోకి వదలనున్నట్లు చెప్పారు. తెగిపడిన కౌంటర్​వేటర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్​ చేస్తామన్నారు. వీటికి సంబంధించిన వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. టీం వెంట కలెక్టర్​ ముషారఫ్​ఆలీ ఫారూఖి, ఎస్ఈ సుశీల్​ దేశ్​పాండే, ఈఈ రాజశేఖర్​, ఋడీఈ భోజదాస్​ఉన్నారు.