లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. కవితకు లిక్కర్ స్కాంలో సంబంధం లేకపోతే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్లోని తన ఇంట్లో నిరసన దీక్ష చేపట్టిన బండి సంజయ్..అంతకుముందు జ్యోతినగర్లోని మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
షెడ్యూల్ ప్రకారమే సభ..
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న వరంగల్‌లో ప్రజా సంగ్రా యాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.