కేసీఆర్​ ఢిల్లీలో మీటింగ్ పెడ్తే జనం వస్తరా?​

తెలంగాణ ప్రాజెక్టులు, పల్లెలను సందర్శించిన ఇతర రాష్ట్రాల రైతులు సర్కారు నుంచి లభించిన స్వాగతానికి సంతోషించారు. తెలంగాణ ప్రజల ఖర్చుతో తాత్కాలిక వీఐపీ హోదాలో విలాసవంతమైన ఆతిథ్యం పొందారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తోందని కొనియాడారు. రైతులకు ప్రగతిభవన్​లో ఏ లోటు లేకుండా మర్యాదలు చేసిన కేసీఆర్.. రైతులు రాజకీయాల్లోకి రావాలని వారితో నిర్వహించిన భేటీలో ప్రకటించారు. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని కేసీఆర్ ను రైతుల సమావేశం కోరినట్లుగా వార్తలొచ్చాయి. కేసీఆర్‌‌‌‌ గొప్ప రైతు నాయకుడు అంటూ ఇతర రాష్ట్రాల రైతులు పొగిడినట్లుగా.. మరి ఆయన జాతీయ రైతు నాయకుడు కాగలరా?

చరణ్ ​సింగ్​ ఒక్కరే లీడర్​ కాగలిగారు..
కేసీఆర్ ​తన రాజకీయ ఆశయాల కోసం రైతులను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అందులో తప్పేమీ లేకపోవచ్చు. జాతీయ స్థాయిలో రైతులను ఏకం చేసి వారికి నాయకత్వం వహించాలని ఇప్పుడు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగానే చాలా మంది రాజకీయ నాయకులు గతంలో ప్రయత్నించారు. శరద్ పవార్, ప్రకాశ్ సింగ్ బాదల్ లాంటి చాలా మంది ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు. మహారాష్ట్రకు చెందిన గొప్ప వ్యవసాయ నాయకుడు శరద్ జోషి కూడా పెద్దగా సక్సెస్​కాలేకపోయారు. అయితే స్వాతంత్య్రానంతరం ఒకే ఒక్క రైతు నాయకుడు రైతు ఓటు బ్యాంకును సృష్టించడంలో, పొందడంలో విజయం సాధించారు. ఆయనెవరో కాదు ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన చరణ్ సింగ్. ఆయనకు ఉత్తర భారత హిందీ బెల్ట్‌‌‌‌లో గట్టి పట్టు ఉండేది. రైతులు ఆయనను గొప్ప లీడర్​గా గుర్తించారు. యూపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరణ్ సింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ప్రతిపాదించిన ‘కోఆపరేటివ్​ఫార్మింగ్’ను ఆయన బహిరంగంగానే వ్యతిరేకించారు. రైతుల భూమిని లాక్కునే సహకార వ్యవసాయ విధానాన్ని చరణ్​సింగ్​ మొహమాటం లేకుండా వ్యతిరేకించారు. కేసీఆర్ బహుశా తనను తాను రైతు నాయకుడిగానే లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. 1979లో 6 నెలల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ తన జీవితమంతా రైతుల కోసం అంకితం చేశారు. రైతుల కోసం రాజకీయంగా కూడా చాలా సార్లు రిస్క్ తీసుకున్నారు. మరి రైతుల కోసం కేసీఆర్ చేసింది, చేస్తున్నది ఆయనను ఎంత వరకు రైతు నాయకుడిగా నిలబెట్టగలుగుతుందనేది ప్రశ్న. మొన్నటి రైతుల మీటింగ్ తో​తన పేరు రైతు వర్గాల్లో వ్యాపింపజేయగలదని, ఇతర రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును సృష్టించగలదని కేసీఆర్ ఆశించవచ్చు. కానీ రైతులు దాన్ని పట్టించుకుంటారా?

కేసీఆర్​ ఢిల్లీలో మీటింగ్ పెడ్తే జనం వస్తరా?​
కేసీఆర్ ఇప్పటికే అనేక మార్గాల ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ బయటి నేతలెవరూ ఆయనకు పెద్దగా మద్దతివ్వకపోవడంతో జాతీయ పార్టీ ప్రణాళికను వదులుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీహార్​పర్యటన కూడా ఆయనకు తాత్కాలికంగా కొంత పబ్లిసిటీకి ఉపయోగపడొచ్చు కానీ.. దాని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదు. 2014 నుంచే కేసీఆర్‌‌‌‌కు పార్లమెంట్‌‌‌‌లో మంచి సంఖ్యలోనే ఎంపీలు ఉన్నారు. కానీ ఆ ఎంపీలు కేసీఆర్‌‌‌‌ను జాతీయ నాయకుడిగా లాంచ్ చేయడంలో విఫలమయ్యారు. అప్పట్లో చరణ్ సింగ్ ఎంపీలు మాత్రం ఆయనను గొప్ప
 నాయకుడిగా ప్రొజెక్ట్​ చేయగలిగారు. అగ్రి చట్టాల ఆందోళన తర్వాత, పంజాబ్ రైతులు మొన్న మార్చిలో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వారికి ఒక్క శాతం ఓట్లే వచ్చాయన్న విషయం కేసీఆర్​ గుర్తుంచుకోవాలి. సాగు సమస్యలపై రైతులు ఉద్యమించవచ్చు కానీ వారు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా అరుదు. ప్రధాన సమస్యేమిటంటే ఎన్నికలప్పుడు రైతులు కులాలు, మతాల వారీగా చీలిపోతారు. ఆంధ్ర, 
తెలంగాణల్లోనూ అందుకు భిన్న పరిస్థితులేమీ లేకపోవచ్చు. వివిధ రైతు కులాలను ఏకం చేయడంలో చరణ్ సింగ్ విజయం సాధించారు. కేసీఆర్ అలా చేయగలరా? చరణ్ సింగ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మంది సొంతంగా హాజరయ్యేవారు. కానీ కేసీఆర్‌‌‌‌కి ఢిల్లీలో జనం రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల రైతులకు తెలంగాణలో ఆతిథ్యం ఇవ్వడం వల్ల మీడియా కవరేజీని, కొంత పేరు పొందవచ్చు. కేసీఆర్ ఆతిథ్యం వల్లనో, ఆయన వ్యవసాయ విధానాల వల్లనో రైతులు కేసీఆర్ వెంట పడతారని అనుకోవడం 
వాస్తవ దూరమే!.

కేసీఆర్ రైతుబంధు ప్రారంభించిన మాట వాస్తవమే. కానీ ఒక్క రైతు బంధే అన్నదాతల కష్టాలన్నీ తీర్చలేదు కదా!. రుణమాఫీ అలాగే ఉంది, రైతు ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కౌలు రైతులకు రాష్ట్రంలో ఎలాంటి భరోసా లేదు. వరి సాగు, వడ్ల కొనుగోళ్లలో గందరగోళం లాంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి తెలంగాణ రైతులు ఆయన వెనక నిలబడతారని చెప్పలేం. కేసీఆర్​ నుంచి బయటి రైతులతో సమానమైన మర్యాద తాము ఎందుకు పొందలేకపోతున్నామనేది రాష్ట్ర రైతులు గుర్తిస్తారు కదా!. దేశ రైతుల అభిమానాన్ని చూరగొనడానికి కేసీఆర్‌‌‌‌కు ఉన్న ఏకైక మార్గం తెలంగాణ రైతుల కోసం పనిచేయడమే. మరి ఆయన ఇతర రాష్ట్రాల రైతులకు ఆతిథ్యం ఇచ్చినట్లే ఈ రాష్ట్ర రైతులకు అన్ని అంశాల్లో ప్రాధాన్యం ఇస్తారా? ఆయన బయట నాయకులు, రైతులతో కూర్చొని,  వారిని వాడుకొని రాష్ట్రంలో ప్రాభవం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు అది పనిచేస్తుందా?                                                                                                                           - డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్