భూముల ఆక్రమణ నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్

భూముల ఆక్రమణ నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: “ ధర్మసాగర్​ మండలం దేవునూరు గుట్టల్లో అటవీ, రైతుల భూములను ఆక్రమించినట్లు సాక్ష్యాలతో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తా.. రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా.. దళితబంధు అమలులో వందలాది మంది పేద దళిత బిడ్డలను మోసగించిన విషయాలపై నేను సాక్ష్యాలతో సహా ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తా.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాలి.. ఇక్కడ ఉండేది నువ్వో నేనో తేల్చుకుందాం.. స్టేషన్​ఘన్​పూర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీస్ ​వేదిక నుంచే మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు సవాల్​ చేస్తున్నా’’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్​ చేశారు. 

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ డివిజన్ ​కేంద్రంలోని క్యాంప్ ​ఆఫీస్​లో ఈనెల 19న సీఎం రేవంత్​రెడ్డి వరంగల్ ​జిల్లా పర్యటన సక్సెస్​ చేసేందుకు కాంగ్రెస్​ శ్రేణులతో ఆదివారం సన్నాహక మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు ఏ మాత్రం ధైర్యం ఉన్నా తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్​ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడైనా భూములను ఆక్రమించినట్లు నిరూపిస్తే పేదలకు పంచిస్తానని ఆయన స్పష్టం చేశారు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎకరం భూమి కబ్జా చేసిన చరిత్ర లేదన్నారు.

బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్​ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్  అవకతవకలపై కేటీఆర్, హరీశ్​రావు కమిషన్​ ముందు హాజరుకాక తప్పదన్నారు.  హనుమకొండలో సీఎం చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యే మహిళాశక్తి సభకు నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి  పదివేల మంది మహిళలను తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు  చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ మారజోడు రాంబాబు, చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్​ శ్రీధర్​రావు, కాంగ్రెస్​ జిల్లా నేతలు  కార్యకర్తలు పాల్గొన్నారు.