బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన .. ఈ కాలంలో శ్రీరాముడు ఉండి ఉంటే బీజేపీ ఈడీని, సీబీఐని ఆయన ఇంటికి పంపించేదన్నారు. బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు రావని ఎద్దేవా చేశారు. తన ప్రసంగంలో మాజీ మంత్రి మనీష్ సిసోడియాని కేజ్రీవాల్ గుర్తుచేసుకున్నారు.
ఈరోజు మనం బడ్జెట్‌పై చర్చలు జరుపుతున్నప్పుడు, నాకు మా తమ్ముడు మనీష్ సిసోడియా గుర్తుకు వస్తున్నాడు.. ఇది మా ప్రభుత్వానికి 10 వ బడ్జెట్, గత 9 బడ్జెట్లను మనీష్ సిసోడియా సమర్పించారు. ఈ సారి అతను సభలో లేకపోవడం బాధాకరం. వచ్చే బడ్జెట్ ఆయన సమర్పిస్తారని భావిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇక మొహల్లా క్లినిక్‌ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. కేజ్రీవాల్ స్పీచ్అనంతరం స్పీకర్ సభను మార్చి 15కి వాయిదా వేశారు.