కవిత టీఎస్పీఎస్సీ పై మాట్లాడ్డం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ళకు కాంట్రక్టులు ఇచ్చి పెంచి పోషించిందే కేసీఆర్ అని చెప్పారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు.
'మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా' అని మంత్రి సురేఖ అన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారని బీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని అన్నారు.
నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని మంత్రి సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నారనేది లెక్కలు తీయాలా అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలని కవిత మాట్లాడే ముందు వెనకా ముందు చూసుకుని మాట్లాడనాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని కొండా సురేఖ తెలిపారు.