విశ్వవిద్యాలయాలు జ్ఞానసముపార్జిత కేంద్రాలు. అవి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసి వారి జీవితానికి మార్గ నిర్దేశనం చేస్తాయి. వాటిలో న్యాయ విశ్వవిద్యాలయాల పాత్ర మరింత ప్రత్యేకమైనది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నల్సార్(నేషనల్అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) న్యాయ విశ్వవిద్యాలయం1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ చట్టం ద్వారా స్థాపితమైంది. హైదరాబాద్ లోని బర్కత్ పురాలో ఒక చిన్న ప్రాంగణంలో మొదలైన ఈ విద్యాలయం ప్రస్తుతం శామీర్ పేటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 54 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతోంది. దేశంలో ఉన్న మొత్తం 23 నేషనల్ లా యూనివర్సిటీల్లో నల్సార్ ఒకటి. క్లాట్ద్వారా దేశ విదేశాల నుంచి విద్యార్థులు ఇందులో అడ్మిషన్లు పొందుతారు. ఇలాంటి సుప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం తెలంగాణాలో ఉండటం నిజంగా ఒక వరంలాంటిది. కాగా రాష్ట్ర ప్రభుత్వ చట్టంతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వమే ఏటా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. ఈ మేరకు లోకల్ కోటా కింద రాష్ట్ర స్టూడెంట్లకు నల్సార్ ప్రవేశాల్లో 25 శాతం రిజర్వేషన్ కూడా ఉంది.
రాష్ట్రానికి న్యాయపరమైన సేవలు
నల్సార్ వర్సిటీ లా స్టూడెంట్స్‌కు న్యాయశాస్త్ర విద్యబోధించడంతోపాటు పారిశ్రామిక రంగాల్లో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న ఉద్యోగుల వృత్తిపరమైన లా స్కిల్స్ మెరుగుపరుస్తోంది. నల్సార్ లోని సెంటర్ ఫర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లా విభాగం సేవలను ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గుర్తించింది. అలాగే సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ విభాగం కూడా విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణలోని దాదాపు112 ల్యాండ్, రెవెన్యూ చట్టాల సమీక్షా, సవరణలు చేసి రిడ్రాఫ్టు చేసింది. తెలంగాణ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యాక్ట్, రూల్స్– 2016, తెలంగాణ మున్సిపల్చట్టం 2019, తెలంగాణ బాలల రక్షణ చట్టాలు తదితర చట్టాల రూపకల్పనకు నల్సార్ ఎన్నో సేవలందించింది. ఇందులోని సెంటర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జస్టిస్ ద్వారా ఎప్పటికప్పుడు బాలల హక్కులు, స్త్రీ సంక్షేమ హక్కులకు సంబంధిత పాలసీలు, ముసాయిదాలు, చట్టాలు, వాటిని అమలుపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు, జువైనల్ జస్టిస్ శాఖకు నాలెడ్జ్ పార్ట్నర్ గా ఉంటూ సేవలందిస్తోంది. వీటితోపాటు రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్, న్యాయ వాదులు, సర్పంచులు, పారాలీగల్స్కు న్యాయ చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారులే గాక ఇతర దేశాల ఆఫీసర్లకు నల్సార్ జాతీయ, అంతర్జాతీయ న్యాయచట్టాలపై శిక్షణ ఇస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా నల్సార్‌వర్సిటీ ఎన్నో న్యాయ సేవలు అందిస్తోంది. సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ విభాగం ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ అక్విజిషన్(రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) ముసాయిదా 2016లో, ఆంధ్ర ప్రదేశ్ డాటెడ్ ల్యాండ్(రెగ్యులరైజేషన్ అండ్ కరెక్షన్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్) ముసాయిదా2017లో తోడ్పాటునందించి. స్కిల్ డెవలప్మెంట్ చట్టాల రూపకల్పనలోనూపాలుపంచుకుంది. ఫిబ్రవరి చివరి వారం ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, సర్వే అధికారులకు రెవెన్యూ, సర్వే పద్ధతుల విధివిధానాలు, వాటి అమలుకు ఉపయోగపడే న్యాయచట్టాల గురించి దాదాపు 60 మంది డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వే అధికారులకు శిక్షణ ఇచ్చింది.
తెలంగాణ ప్రొఫెసర్ల ప్రత్యేక కృషి
నల్సార్ లో తెలంగాణ సంబంధిత ఆచార్యులు, ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్న డాక్టర్ వి.బాలకిష్ట రెడ్డి విశేష సేవలందిస్తున్నారు. 2017లో ఐడీఐ(ఇన్స్టిట్యూట్ డీ డ్రాయిట్ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ శాంతి సదస్సులకు 75 ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఇంటర్నేషనల్కోర్టుల జడ్జీలు, న్యాయకోవిదులకు నల్సార్ ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా తరఫున నల్సార్ వేదికగా జరిగిన ఈ సదస్సుకు తెలంగాణ ప్రొఫెసర్బాలకిష్టరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. రా wజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్లో పొందుపరిచిన విధివిధానాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నల్సార్ ను కోరింది. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ డైరెక్టర్ గా ఉన్న ప్రొ. బాలకిష్ట రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ నిపుణుల బృందం మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాలను సందర్శించింది. అక్కడి ప్రజల ఇబ్బందులు, జీవన పరిస్థితులను, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏ మేరకు సాకారమవుతున్నాయనేది క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి రిపోర్టు సమర్పించారు.
వీసీ తెలంగాణ నుంచే ఉండాలె
రాష్ట్ర ప్రభుత్వ చట్టంతో ఏర్పాటై, రాష్ట్ర బడ్జెట్‌ద్వారా కేటాయిస్తున్న నిధులతో నడుస్తున్న నల్సార్వర్సిటీలో లోకల్కోటా కింద ఇప్పటికే విద్యార్థులకు రిజర్వేషన్ఉంది. ఈ మేరకు ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ వ్యక్తే వైస్‌చాన్స్‌లర్‌గా ఉండాలన్న డిమాండ్, ఆశ మొదటి నుంచి ఉంది. ఇప్పటి వరకు వర్సిటీకి ముగ్గురు వీసీలుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత వీసీ 2012 లో నియమితులై.. రెండు టర్మ్‌లు కొనసాగారు. మార్చి నెలాఖరుతో ఆయన పదవి కాలం ముగియగా, మరో నాలుగు నెలల పొడగింపుతో ఆయన జులై 31 వరకు బాధ్యతల్లో ఉంటారు. కొత్తగా రాబోయే వీసీ పట్ల ఇటు నల్సార్ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు ఎన్నో ఆశలతోఎదురుచూస్తున్నారు. గత 25 ఏండ్లుగా తెలంగాణేతరులే నల్సార్ వీసీలుగా కొనసాగటం, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే వివిధ కీలక హోదాల్లో కొనసాగటం కొంత విస్మయానికి గురిచేస్తుంది. తెలంగాణాలో అత్యుత్తమ ప్రతిభ గల ప్రొఫెసర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ ప్రొఫెసర్లుగా అవార్డులు పొంది, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ పేరు ప్రఖ్యాతులున్న ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ వారికీ సముచిత స్థానాలు లభించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సారైనా అటు యూజీసీ, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు, చాన్స్లర్ల ద్వారా నియమించే సెర్చ్ కమిటీ తెలంగాణ ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశం ఇవ్వాలి.
- కే. శివచరణ్అడ్వకేట్, లా రీసెర్చ్ స్కాలర్, నల్సార్ వర్సిటీ, హైదరాబాద్