సాయం అడిగితే ఎవరూ స్పందించకపోతే చివరకు..

మంచి జీతం, అందమైన జీవితం, గౌరవం, హోదా అన్నీ పొందుతూ హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలోని పోలీసు శిక్షణా కాలేజీలో కలకలం రేపింది.

చందానగర్ లో ఓ మహిళా యువ న్యాయవాది పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లి చేసుకున్న 6 నెలలకే ఓ యువ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.

మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో వేల సంఖ్యలో మహిళలు, యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలోని మహిళల ఆత్మహత్యల రేటు ప్రపంచ సగటు రేటు కంటే రెండింతలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మంది మహిళల్లో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడుతుండగా, భారత్‌‌లో ప్రతి లక్షమందిలో15 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మహిళల ఆత్మహత్యల రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది.

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య  ఎక్కువగానే ఉంటోంది. ఈ రాష్ట్రాల్లో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నప్పటికీ ఎందుకు ఎక్కువ ఆత్మహత్యలు పెరుగుతున్నాయనేదానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. భారత్‌‌లో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల్లో 71.2 శాతం మంది15- నుంచి 39 ఏండ్ల మధ్య వయసు వాళ్లే. వీళ్లలో ఎక్కువ మంది వివాహితలే కావడం గమనార్హం. దేశంలో 2020లో ఆత్మహత్య చేసుకున్న మొత్తం1,53,052 మందిలో మహిళలు 45 వేల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎన్‌‌సీ‌‌ఆర్‌‌బీ గణాంకాల నమోదు ప్రారంభించిన1997 నుంచి ఏటామొత్తం మహిళల్లో 20 వేల మందికి తక్కువ కాకుండా కేవలం గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 
కారణాలు ఏంటి?

భారతదేశంలో మహిళల ఆత్మహత్యలకు సంబంధించి కచ్చితమైన కారణాలను చెప్పే నిర్ధిష్ట, శాస్త్రీయ అధ్యయనాలు ఇప్పటివరకు జరగలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు, సామాజిక వెనుకబాటుతనం, గృహ హింస, ఆర్థికంగా భర్తపై ఆధారపడటం, ఉద్యోగం చేసే అవకాశం రాకపోవడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు, కొత్త ఆశలతో అత్తింటికి వెళ్తే, అవి అనుకున్న స్థాయిలో నెరవేరకపోవడం, తీవ్ర అసంతృప్తి, మానసిక ఒత్తిడి, నిరాశ నిస్పృహలకు లోనుకావడం లాంటి కారణాలు వివాహితలను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మహిళలు ఓపికగానే ఉంటారు. కానీ, ఆ ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది.

ఆమె చదువుకున్న చదువుకు, కన్న కలలకు విలువ దొరక్కపోతే, ఆశలు అలా నెమ్మదిగా ఆవిరైపోతూ ఉంటాయి. దాంతో నిరాశ, నిస్సహాయత, నిరుత్సాహం ఆవరిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం కూడా మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల్లో 30 శాతం మంది గృహ హింసకుగురైన వారేనని ఇటీవల ఓ సర్వేలో తేలింది. అయితే నేటికీ సమాజంలో ఆత్మహత్యల గురించి బహిరంగంగా చర్చ జరగడం లేదు. చాలా కుటుంబాలు ఈ విషయాన్ని దాచి పెట్టి ఉంచాలని చూస్తాయి. దేశంలో నమోదవుతున్న ఆత్మహత్యల సంఖ్య కంటే వాస్తవ ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ సమస్య లోతులను సరైన రీతిలో కొలవటం లేదని మిలియన్ డెత్, లాన్‌‌‌‌సెట్ లాంటి అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనాలో ఎందుకు తక్కువ? 

ఆత్మహత్యల నివారణలో చైనా నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.1990ల్లో చైనాలో మహిళల ఆత్మహత్య రేటు చాలా ఎక్కువగా ఉండేది. 2016 నాటికి అది70 శాతం ఉండగా, దాన్ని 2020 నాటికి 50 శాతానికి తగ్గించడంలో ఆ దేశం విజయం సాధించింది. అక్కడి 25 శాతం మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలించి మెరుగైన ఉపాధి కల్పించడంతో ఆత్మహత్యల రేటు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. 

జీవితంపై సరైన అవగాహన, దృక్పథం ఏర్పరుచుకుంటే మనసు ఆత్మహత్యలవైపు వెళ్లదు. ఆత్మహత్యలను నివారించాలంటే సూసైడ్​కు ప్రయత్నించిన వారిపై దృష్టి పెట్టాలి. కానీ, మన దగ్గర సరైన డేటా లేదు. దేశంలో నిరుడు1,50,000 ఆత్మహత్యలు నమోదైతే, వారి కంటే ఎక్కువ మందే ఆత్మహత్యా యత్నం చేసి ఉండొచ్చు. ప్రభుత్వాలు, పౌర సమాజం ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవట్లేదు. గతంలో 70 నుంచి 80 ఏళ్ల పైబడ్డవారే ఎక్కువగా ప్రాణాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే యువతుల సంఖ్య బాగా పెరుగుతోంది. కొన్ని లక్షణాలను పసిగట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాన్ని ఆపొచ్చు.

ఏకాంతంగా గడిపే వారిని, ఆత్మీయులను, మిత్రులను, చివరకు కుటుంబ సభ్యులను కూడా అకస్మాత్తుగా దూరం పెట్టే వారిని గమనించాలి. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి, వినడానికి సాటి మనిషి ఉంటే ఆత్మహత్య ఆలోచన మారే అవకాశం ఉంటుంది. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యలను తగ్గించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, నిరుడు కూడా దేశంలో ఆత్మహత్యలు10 శాతం పెరిగాయి. జాతీయ స్థాయిలో ఆత్మహత్యల నివారణకు వ్యూహం రచిస్తున్న ఈ సమయంలో సూసైడ్స్ డేటా కూడా సక్రమంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది.

ఎలాంటి సాయం అందకనే..

ఆత్మహత్యను వైద్య పరిభాషలో ‘క్రై ఫర్‌‌ హెల్ప్’గా పరిగణిస్తారు. ఏదైనా సాయం కోసం అర్థించినపుడు ఎవరూ స్పందించనప్పుడు కూడా చివరి పరిష్కారంగా మహిళలు ఆత్మహత్యను ఎంచుకుంటారు. ఒక వ్యక్తి బాధకు గురైనప్పుడు ఎదుటి వారికి చెప్పుకోలేకపోవడం, చెప్పుకున్నా, వారి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడం ఆత్మహత్య ఆలోచనకు బీజం పడేలా చేస్తుంది. చాలా మంది యువతులు తమపై తల్లిదండ్రులు పెద్దగా ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చలేకపోతున్నామనే భావనతోనూ, ఎంత చెప్పినా పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధతోను, ప్రేమను అంగీకరించడం లేదనే విరహవేదనతోను మరికొందరైతే మత్తు పదార్థాలకు బానిసలై విచక్షణ కోల్పోతున్నారు. మనుషుల అవస్థలను సరిగ్గా అవగాహన చేసుకొని చేయూతనిస్తే చాలా వరకు ఈ ఆత్మహత్యలు తగ్గిపోతాయనేది నిపుణుల మాట. - డా. బి. కేశవులు, ఎండీ, సైకియాట్రీ, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం