- చనిపోకముందు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న లెజండరీ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్ వాలా
న్యూఢిల్లీ: ‘ఒకవేళ నేను ఇన్వెస్టర్ కాకపోయి ఉంటే జర్నలిస్ట్ అయ్యేవాడిని. మీడియా అంటే నాకు ఇష్టం’ .. లెజండరీ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్ వాలా 2015 లో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్న మాటలివి. రాకేశ్ జున్‌జున్ వాలా కిందటేడాది ఆగస్టు 14 న మరణించారు. ఆయన చనిపోయి సోమవారంతో ఏడాది పూర్తికానుంది. ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన స్వభావం. ఫైనాన్స్ నుంచి రాజకీయాల వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించేవారు. తనకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఆయన పాలసీలు నచ్చవని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, అప్పుడున్న గ్లోబల్ లీడర్లలో ఆయన చాలా బెటర్ అని మెచ్చుకున్నారు కూడా.
2010 లో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ ‘హాట్’ గా ఉంటారని కూడా అన్నారు. ఆయన స్థాయిలో ఉన్న వారు నేషనల్ టెలివిజన్ ఛానల్‌లో మహిళా యాక్టర్ హాట్‌గా ఉన్నారని కామెంట్ చేయడం అరుదు. 2021 లో మరో టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త తరం బిజినెస్‌లు ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయని వెల్లడించారు. వాటిని అమ్మడం (షార్ట్ చేయడం) బెటర్ అని సలహా ఇచ్చారు. అదే టైమ్‌లో తమ కంటూ ఒక సొంత స్టైల్‌తో ముందుకెళ్లాలని , జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
జర్నలిస్ట్‌లు అడిగే ప్రశ్నలు ఇబ్బందిగా ఉంటే ముఖం మీదే ఆయన చెప్పేసేవారు. జున్‌జున్ వాలా తెలివి, అనుభవం ఆయన ఇంటర్వ్యూల్లో కనిపిస్తాయి. ‘జీవితంలో ఒక లైన్ చూసినప్పుడు అది చాలా దూరంగా ఉందని ఫీలవుతాం. ఆ లైన్‌ను క్రాస్ చేశాక ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకుంటాం’ అంటూ ఫిలాసిఫికల్‌గా ఆయన మాట్లాడడాన్ని ఇంటర్వ్యూల్లో చూడొచ్చు. తలెత్తుకొని బతకాలని, అదే టైమ్‌లో గ్రౌండ్‌కు దగ్గరలో ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.