ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటే విపక్షం లేకుండా పోదు :  సీపీఐ నారాయణ

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటే విపక్షం లేకుండా పోదు :  సీపీఐ  నారాయణ

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన  విపక్షం లేకుండా పోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా శనివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో నారాయణ మాట్లాడారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రజలే విపక్షమవుతారన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతోందన్నారు. కేసీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వారు ఇలాగే  చేశారని, కానీ ప్రజలే విపక్షమై ఇతర పార్టీలను గెలిపించారన్నారు. ఏ పార్టీ నుంచి గెలిచారో వారు పార్టీ మారే ముందు పదవికి రాజీనామా చేయాలని, తర్వాతే ఇతర పార్టీలోకి వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే, కాంగ్రెస్ చేస్తోందని ఇది బీజేపీకి పరోక్షంగా ఊతమిచ్చినట్లేనని అన్నారు. బీజేపీ నాలుగు నుంచి ఎనిమిది సీట్లు గెలవడంపై కాంగ్రెస్ ఆలోచన చేయాలన్నారు. బీజేపీకి బలపడడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరాదన్నారు. 

మోదీ గోబెల్స్​ను మించిపోయాడు

అబద్దాలు చెప్పడంలో మోదీ గోబెల్స్ ను మించిపోయాడని, దేశ చర్రితలో ఏ ప్రధాని చెప్పనన్ని అబద్దాలు చెప్పి ఆయన రికార్డును సొంతం చేసుకున్నారని నారాయణ విమర్శించారు. అతి తక్కువ మెజార్టీతో గెలిచిన ప్రధాన మంత్రిగా కూడా మోదీ అపకీర్తిని మూటకట్టుకున్నారన్నారు. మోదీ బిహార్​లో నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుపై ఆధారపడి పాలన సాగించాల్సి వస్తోందన్నారు. రూ.16 లక్షల కోట్లు ఎగవేతకు మోదీ విధానాలే కారణమని, ఎగవేతదారుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా గుజరాతీయులేనని అన్నారు. గతంలో రూ.2.50 లక్షల కోట్లు ఎగవేతకు గురైతే మోదీ పదేండ్ల కాలంలో రూ.16 లక్షల కోట్లకు ఎగవేత సొమ్ము చేరిందన్నారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని, ఇప్పుడు దాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయని ఇది సరైంది కాదన్నారు. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ మధ్యనే ప్రధాన పోటీ ఉందని, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే కమ్యూనిస్టులను ఓడించాలని కాంగ్రెస్ చూడడం సరైంది కాదన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ కె సాబీర్​పాషా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్​రెడ్డి, ఎస్కే జానీమియా పాల్గొన్నారు.