వరి విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఒకప్పుడు సన్న బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉండేది. మద్దతు ధరకంటే ఎక్కువకు మిల్లర్లు, ధాన్యం వ్యాపారులు పోటీపడి కొనేవారు. కానీ ఇప్పుడు సన్న ధాన్యం అమ్మేందుకు రైతులు తంటాలు పడాల్సి వస్తోంది. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం. బియ్యాన్ని ఒక విలువ లేని వస్తువుగా మార్చడంతో రైతులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే 2012లో వరి మద్దతు ధర రూ.1,000. 2021లో వరికి మద్దతు ధర రూ.1,900 మాత్రమే. ఈ మధ్యకాలంలో వరి పంట ఉత్పత్తి ఖర్చు మూడింతలైంది. కానీ మద్దతు ధరలో మాత్రం పెద్దగా మార్పురాలేదు. 2012లో సన్న రకం బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ.32 ఉంది. అప్పట్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,900 మద్దతు ధర ఉండేది. అప్పట్లో సన్నరకం ధాన్యం కోసం రైస్ మిల్లుల యజమానులు, ధాన్యం వ్యాపారులు రైతుల పొలాల వద్ద పోటీ పడి కొనేవారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల తర్వాత అదే సన్నరకం ధాన్యం.. అదే రూ.1,900 క్వింటాల్‌కు అమ్ముకోవటానికి రైతులు రైస్ మిల్లుల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
సంక్షోభంలో రైతాంగం
సకల జనులు పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు అయినా తెలంగాణలోని రైతాంగం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుబంధు పథకం వల్ల భూముల ధర పెరిగిందనడం సమస్యని పూర్తిగా అర్థం చేసుకోలేక చెబుతున్న మాటలు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతుల్లో 97 శాతం మంది సన్న, చిన్న కారు రైతులు లేదా కౌలు రైతులే. రైతుబంధు, భూముల ధరలు పెరగటం వల్ల భూమిని నమ్ముకొని తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నా కౌలు, చిన్న రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. వరి పంట రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు వరి పంట పండించే విషయంలో, ధాన్యాన్ని సేకరించే విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తూ రైతాంగాన్ని కలవరపరుస్తోంది. 2012లో సన్న రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,800కు రైస్ మిల్లర్లు కొనేలా, సన్నరకం బియ్యాన్ని కిలో రూ.32కు సెక్రటేరియట్ రైతు బజారు, ఇతర ముఖ్యమైన పట్టణ కేంద్రాల్లో అమ్మేలా నాటి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు అదే రకం సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,900 కోసం రైతాంగం రైస్ మిల్లుల ముందు రోజుల తరబడి పడిగాపులు కాయడం ప్రభుత్వ ఆలోచన, ప్రతిస్పందనలో లోపం అనక తప్పదు.
సేకరణలో నష్టం నామమాత్రమే
ధాన్యం సేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం నామమాత్రమే. లెవీ బియ్యం రీసైక్లింగ్ అవుతున్నాయనే వంకతో బియ్యం సేకరణ నిలిపివేసి కొన్నేండ్లుగా ధాన్యాన్ని మాత్రమే కేంద్రం సేకరిస్తోంది. ఈ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెంట్ గా పనిచేస్తూ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి, వాటిని బియ్యంగా మార్చి, దానికి సంబంధించిన ఖర్చులన్నింటిని కేంద్రం నుంచి రాబట్టుకుంటోంది. కిలో రూ.30కు బియ్యం సేకరించి, వాటిని కిలో ఒక్క రూపాయికి పేదలకు పంచుతూ, ఆ పేదలకు పంచిన బియ్యం రీసైక్లింగ్ పేరుతో తిరిగి గోదాములకు చేరుతున్నాయనే వంకతో ధాన్యం సేకరణలో అనేక ఆటంకాలు సృష్టిస్తూ పరోక్షంగా లెవీ బియ్యంలో వచ్చిన నష్టాన్ని రైతాంగం నెత్తిన రుద్దడం దురదృష్టకరం. బహిరంగ మార్కెట్లో కిలో రూ.3 ఉన్నప్పుడు రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే ఇప్పుడు కిలో రూ.30 ఉన్నా కూడా రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం ద్వారా బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని ఒక విలువ లేని వస్తువుగా మార్చారు. కనీస మద్దతు ధర మార్కెట్ కు అనుగుణంగా ఇతర పంటలకు వస్తున్న విధంగా లేకుండా చేసి ధాన్యం రైతుని మద్దతు ధర కోసం పడిగాపులు కాసేలా మార్చి వేసింది.
శ్వేతపత్రం విడుదల చేయాలె
మరే ఇతర పంటల కంటే భిన్నంగా వరి పంట అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తుంది. వరి గడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని డైరీలకు, నూనె తీసిన తవుడు కోళ్ల ఫారాలకు, చేపల చెరువులకు ఫీడ్ కోసం, వంటనూనెల కోసం, పునరుత్పాదక ఇంధనం కోసం ఇలా అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సిరులు కురిపించే, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి కల్పతరువు లాంటి వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం అమ్మకం మీద, తవుడు, నూనె అమ్మకం మీద వస్తున్న ఆదాయం ఎంత? ధాన్యం సేకరణలో ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. 2009లో సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి కొన్ని నెలల తర్వాత ప్రభుత్వం వేలం ద్వారా ఓపెన్ మార్కెట్లో అమ్మి లాభం పొందింది. అదే పద్ధతిని ఇప్పుడూ అనుసరించాలి. సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి కొన్ని నెలల తర్వాత బహిరంగ మార్కెట్లో అమ్మితే రైతాంగానికి మేలు చేసిన వారవుతారు. తద్వారా బహిరంగ మార్కెట్లో ధాన్యానికి పోటీ ఏర్పడి రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే మారిన పరిస్థితుల్లో ఆధార్ కార్డు ఆధారంగా అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నారు. అదే పద్ధతిలో పేద కుటుంబంలోని మహిళల ఖాతాల్లో లెవీ బియ్యం సబ్సిడీని జమ చేయాలి. ధాన్యాన్ని సేకరించే బదులు బియ్యాన్ని సేకరించాలి. తద్వారా ధాన్యం సేకరణలో పోటీ ఏర్పడి గతం మాదిరిగా మద్దతు ధర కంటే కూడా అధిక ధరలను వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్ చెల్లించే అవకాశం ఉంది.
- తూడి దేవేందర్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, సౌతిండియన్ రైస్ మిల్లర్స్ ఫెడరేషన్