స్రవంతిని కూడా గెలిపిస్తే.. సమ్మక్క, సారక్కల్లా పోరాడుతం

పాల్వాయి స్రవంతిని కూడా గెలిపించి అసెంబ్లీకి పంపితే.. తామిద్దరం సమ్మక్క, సారక్కల్లా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మునుగోడు అనేది పోరాటాల గడ్డ.. త్యాగాల అడ్డా అని పేర్కొన్నారు. పైసలతో ఓట్లను కొనాలనుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని సీతక్క కోరారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని దామెర గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చని ఆ పార్టీల వాళ్లు.. ఎన్నికల్లో కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెడుతున్నరని  వ్యాఖ్యానించారు.  గుంతలు పడ్డ రోడ్లను వాళ్లు ఎందుకు రిపేర్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడిదారుల లోన్లను మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. పేదల నిత్యావసరాల ధరలు పెరగకుండా ఏమీ చేయలేకపోయిందని కామెంట్ చేశారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆమె రక్తం ధారపోసయినా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది’’ అని ప్రజలను కోరారు. ‘‘ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఓటు లేదు.. ఆయనకు ఓటు వేయాలా ? ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడు. రాజగోపాల్ రెడ్డికి మునుగొడులో ఊరు లేదు... అసెంబ్లీలో నోరు లేదు’’ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘ దామెర గ్రామ సర్పంచ్ యాదగిరిని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలి.  ఒక దళిత యువ సర్పంచ్ నమ్మిన జెండా కోసం నిలబడి అమ్ముడుపోకుండా ఉన్నాడు.తాను పేదరికంలో ఉన్నా.. పార్టీ కోసం  నిలబడటం గొప్పవిషయం’’ అని పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ ను చంపాలని తిరుగుతున్న వాళ్లు నాయకులుగా ఎదిగారంటే.. అది కాంగ్రెస్ పార్టీ చలువేనన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని మండిపడ్డారు.