కేబుల్ బ్రిడ్జ్ పై పార్క్ చేస్తే రూ. 2 వేల జరిమానా

హైదరాబాద్ సిటీలో కేబుల్ బ్రిడ్జి అందరికీ తెలిసిందే.. ఆ బ్రిడ్జిపై వెళుతుంటే ఆ ఫీలింగే వేరు.. ముచ్చటగా ఉంది.. బాగుందని బ్రిడ్జిపై ఆగారా.. మీ పర్సు ఖాళీ అయినట్లే.. ఎందుకు అంటారా.. ఇటీవల కాలంలో బ్రిడ్జిపై కార్లు, బైక్స్ ఆపి ఫొటోలు దిగుతున్నారు. దీని వల్ల ట్రాఫిక్ జాం అవుతుంది. దీన్ని గుర్తించిన సిటీ పోలీసులు.. ఫైన్స్ వేయటం మొదలుపెట్టారు.. ఎంతెంత ఫైన్స్ చేస్తున్నారో తెలిస్తే అమ్మో అంటారు..

కేబుల్ బ్రిడ్జిపై మీరు బండి లేదా కారు ఆపినా.. పార్క్ చేసినా జరిమానాలు వేయనున్నారు పోలీసులు. కనీసం 200 రూపాయల నుంచి గరిష్టంగా 2 వేల రూపాయల వరకు విధించనున్నారు. అక్కడికక్కడి వసూలు చేయనున్నారు. డబ్బులు లేవంటే చలానా పంపిస్తున్నారు. పగలు మాత్రమే కాదు.. ట్రాఫిక్ అస్సలు లేదు కదా అని అర్థరాత్రి పార్క్ చేసిన ఇవే రూల్స్ అంట.. 24 గంటలూ ఇవే నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రాత్రి పూట ఎవరు ఉంటారులే అని లైట్ తీసుకోవద్దు.. బ్రిడ్జిపై నైట్ విజన్ సీసీ కెమెరాలను అమర్చారు.. ఆటోమేటిక్ గా కెమెరాల్లో చూసి ఫైన్స్ వచ్చేస్తాయి మనకు.. 

ఇటీవల అర్థరాత్రులు బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు కూడా చేసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి వచ్చిన వాళ్లంతా బ్రిడ్జ్ పైనే పార్కింగ్ చేస్తున్నారు.  ఆ సమస్యను నివారించేందుకు ట్రాఫిక్ పోలీస్ ఎన్ని సార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. దీంతో ఫైన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు పోలీసులు.. బీ కేర్ ఫుల్..