పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ నరేంద్ర పుతిన్ అవుతారని అన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, ఇక దేశంలో ఎన్నికలు ఉండవన్నారు. నరేంద్ర మోడీ ‘నరేంద్ర పుతిన్’ అయిపోతారన్నారు.
బీజేపీ నేతలు మోడీని ‘రాజు’గా పరిణించడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటేనే, దేశం సురక్షితంగా ఉంటుందని మాన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
మే నెలలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా.. సివిల్ సర్వెంట్ల నియామకం, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు తరువాత కేంద్రం బదిలీలు, నియామకాలపై కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ మధ్య ఘర్షణ మొదలైంది. ఆరు నెలల్లో ఆర్ఢినెన్సును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలి. అయితే ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది.
రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిపక్షాల సాయం కోరుతున్నారు. అందులో భాగంగా 2023జూన్ 11 ఆదివారం రోజున ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వహించింది. ఈ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , ఢిల్లీ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్, ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.