T20 World Cup 2024: ధోని శిష్యుడు వద్దు.. శాంసన్‌ను ఆడించండి: శ్రీశాంత్

T20 World Cup 2024: ధోని శిష్యుడు వద్దు.. శాంసన్‌ను ఆడించండి: శ్రీశాంత్

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‍ల్లో అన్నింటా విజయం సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. తొలిపోరులో ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అనంతరం ఆతిథ్య జట్టు అమెరికాను మట్టికరిపించి హ్యాట్రిక్‌ విజయాలు తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కీలకమైన సూపర్‌-8కు ముందు పసికూన కెనడాతో భారత్‌ తలపడనుంది. 

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని 2007 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడు శ్రీశాంత్.. రోహిత్ శర్మకు సుంచించాడు.దూబే ఇప్పటివరకూ బ్యాటర్‌గా మాత్రమే ఉపయోగించబడినందున సంజూ తుది జట్టులో అనుకూలమైన ఎంపిక అని శ్రీశాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఒక్క అవకాశం..!

ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్ కనపరించినప్పటికీ.. మెగా టోర్నీలో శాంసన్‌ను ఒక్క అవకాశమూ రాలేదు. కీపర్/బ్యాటర్ రిషబ్ పంత్ రీఎంట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో సంజూ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. పోనీ, దూబే స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నా.. ధోని శిష్యుడు బౌలర్‌గా ఉపయోగపడతాడన్న నమ్మకంతో తుది జట్టులో చోటు కల్పిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల్లోదూబే కేవలం బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. ఆరవ బౌలర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్ల కోటా పూర్తి చేస్తుండటంతో.. రెగ్యులర్ బౌలర్లు జడేజా, అక్సర్ పటేల్ పూర్తి ఓవర్లు వేయడం లేదు. ఇలాంటి సమయంలో దూబే స్థానంలో శాంసన్‌ను తీసుకుంటే భారత జట్టుకు అదనపు లాభమని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.  

"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ప్లేయింగ్  XIలో మార్పులు చేయడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక శివమ్ దూబే విషయానికొస్తే, అతను మొదటి రెండు గేమ్‌లలో సరిగ్గా ఆడలేదు. అయినప్పటికీ, అతను బ్యాట్‌తో ఏమి చేయగలడో మనకు తెలుసు. కానీ నా వరకు జట్టులో ఒక మార్పును చూడాలనుకుంటున్నాను. అది సంజూ శాంసన్ జట్టులోకి రావాలి. దూబే బౌలింగ్ చేయకపోతే, సంజుకు అవకాశం ఇవ్వాలి. అతను ఫామ్‌లో ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు.." అని శ్రీశాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.