సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు... కానీ ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలేనని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదని, వారి నెత్తిమీద రూపాయ పెట్టినా అర్ధ రూపాయకి కూడా ఎవరు కొనరన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని.. ఆయనైనా తానైనా ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో తాను యువత చదువుల కోసం సహాయం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం యువతను మద్యం మత్తులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. కరోనా సమయంలో తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశామన్నారు. మధ్య నిషేధం చేసిన గ్రామాలని పార్టీతో సంబంధం లేకుండా సొంత డబ్బులను ప్రోత్సాహకంగా ఇచ్చానని తెలిపారు.
మునుగోడు ఎన్నికల కోసం తన కుమారుడి కంపెనీపై బురద చల్లే ప్రయత్నం చెయ్యడమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ని హోల్డ్ చేయించిన మూర్కుడు సీఎం కేసీఆర్ అని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచారం సమయంలో కావాలనే టీఆర్ఎస్ వాళ్ళు కొంత మందికి మద్యం తాగించి తనపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. గత వారం రోజులుగా తాను జ్వరంతో బాధపడుతుంటే సీఎం కేసీఆర్ దాన్ని సింపతీ కోసమని టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారని చెప్పారు. రాష్టంలో అరాచక పాలన, దుర్మార్గపు పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి మనిషో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు.