- బ్యాంకులు ఇబ్బందుల్లో పడితే.. డిపాజిటర్లకు రూ. 5 లక్షల తక్షణ రిలీఫ్
- డీఐసీజీసీ సవరణ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బ్యాంకులు ఇబ్బందులపాలైనప్పుడు డిపాజిటర్లకు రూ. 5 లక్షల మొత్తాన్ని అందించేందుకు ఈ సవరణను ప్రతిపాదించారు. బ్యాంకులు మారటోరియం కిందకు వచ్చిన 90 రోజుల లోపు ఈ రూ. 5 లక్షల మొత్తాన్ని డిపాజిటర్లు వెనక్కి తీసుకునే వెసులుబాటు దీని వల్ల కలుగుతుంది. కిందటేడాది పీఎంసీ బ్యాంకు సమస్యలలో పడినప్పుడు డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ను రూ. 5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. డిపాజిటర్లను కాపాడేందుకే ఈ చర్య తీసుకున్నారు. పీఎంసీ బ్యాంకు తర్వాత యెస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కూడా ఇబ్బందులలో పడటంతో వాటిపైనా మారటోరియం విధించిన విషయం తెలిసిందే. డీఐసీజీసీ చట్టానికి సవరణ తేనున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్లోనే ప్రకటించారు. ఈ సవరణ బిల్లును పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో తేనున్నామని నిర్మలా సీతారామన్ బుధవారం కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియాకు వెల్లడించారు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే బ్యాంకులు కష్టాలపాలైనా, డిపాజిటర్లకు తక్షణ రిలీఫ్ దొరుకుతుంది.