రక్తనాళాల ఆరోగ్యమే.. మెదడు ఆరోగ్యం..!

రక్తనాళాల ఆరోగ్యమే.. మెదడు ఆరోగ్యం..!

స్టాక్​హోమ్: శరీరంలో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటేనే మెదడు ఆరోగ్యంగా ఉంటుందట. రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటే మెదడుకు త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయని ఈ మేరకు స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు కనుగొన్నారు. అల్జీమర్స్ వల్ల వచ్చే డిమెన్షియా (మతిమరుపు) సమస్యకు ఇటీవల కొత్త మందులు వచ్చినా, అవి అందరికీ ఒకేలా పని చేయడంలేదు. దీనికి కారణం ఏంటో తెలుసుకునేందుకు వీరు ఆరోగ్యవంతమైన 350 మంది పురుషులు, 389 మంది మహిళలకు ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆల్గారిథమ్ ఆధారంగా వారి అసలు వయస్సు, మెదడు ఆరోగ్యాన్ని పరిశీలించారు. అలాగే బ్లడ్ శాంపిల్స్ తీసుకుని లిపిడ్స్, గ్లూకోజ్, ఇతర టెస్టులు చేశారు. వాలంటీర్ల లైఫ్ స్టైల్‎నూ విశ్లేషించారు. దీంతో యావరేజ్‎గా వీరందరి మెదడు 71 ఏండ్ల వయసులో ఉన్నట్టుగా కనిపించింది. కానీ వీరిలో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నవారిలో మాత్రం మెదడు యవ్వనంగా ఉందని గుర్తించారు. మంచి లైఫ్ స్టైల్ పాటిస్తూ, వ్యాయామం చేసేవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ స్థిరంగా ఉంటున్నాయని, తద్వారా మెదడు కూడా యవ్వనంగా ఉంటోందని సైంటిస్టులు వెల్లడించారు.