వారిపై కేసులు వాపస్ తీసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయను.. అమిత్ షాకు కేజ్రీవాల్ సవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మురికివాడల్లో నివసిస్తున్న వారిపై నమోదు చేసిన కేసులను విత్ డ్రా చేసుకుని, వారికి పునరావాసం కల్పిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ఆప్  చీఫ్  అర్వింద్  కేజ్రీవాల్  తెలిపారు. ఈ మేరకు తాను సవాల్  విసురుతున్నానని, తన చాలెంజ్ ను అమిత్ షా స్వీకరించాలని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలోని షాకుర్  బస్తీలో మీడియాతో కేజ్రీవాల్  మాట్లాడారు. 

‘‘మురికివాడల వాసులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించాలి. ఏ ప్రదేశంలో నుంచి వారిని ఖాళీ చేయించారో అదే ప్రదేశంలో వారికి ఇండ్లు ఇవ్వాలి. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్  సమర్పించాలి” అని కేజ్రీవాల్  డిమాండ్  చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, నగరంలోని మురికివాడలను కూల్చివేస్తుందని ఆయన ఆరోపించారు. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని స్లమ్  ఏరియాల్లో నివాసం ఉండేవారికి గత ఐదేండ్లలో 4,700 ఇండ్లు మాత్రమే కట్టి ఇచ్చిందని, ఈ లెక్కన అందరికీ ఇండ్లు కట్టివ్వాలంటే కేంద్రానికి కనీసం వెయ్యి సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని 4 లక్షల మంది మురికివాడల వాసులను కేంద్రం మోసం చేసిందని ఫైర్  అయ్యారు. మురికివాడల భూములను స్వాధీనం చేసుకునేందుకే కేంద్రం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.