నిందితుడిని విచారించే విధానంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు

దర్యాప్తు ప్రతి దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే అది దర్యాప్తును ప్రభావితం చేస్తుంది. నిందితుడిని విచారించడంలో దర్యాప్తు సంస్థ తన సొంత పద్ధతిలో దర్యాప్తు చేసుకునే విధంగా దర్యాప్తు సంస్థను వదిలేయాలి. నిందితుడిని అడిగే ప్రశ్నల విధానం, నిందితుడిని విచారించే విధానంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. దర్యాప్తు అధికారి దుర్వినియోగానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ దర్యాప్తును రద్దు చేసే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు చిదంబరం కేసులో స్పష్టం చేసింది. సాధారణ బెయిల్​ మంజూరు చేసే సమయంలో, ముందస్తు బెయిల్​ మంజూరు చేసే సమయంలో, దర్యాప్తు ప్రారంభ దశలో సాక్ష్యాలను పరిశీలించడం కోర్టు పనికాదు. పోలీసుల దర్యాప్తులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. కాగ్నిజబుల్​ నేరాలను దర్యాప్తు చేయడమనేది పోలీసుల ప్రత్యేక హక్కు. అరుదైన కేసుల్లో తప్ప న్యాయవ్యవస్థ పోలీసు దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదు. దర్యాప్తు అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, క్రిమినల్ ​ప్రొసీజర్ ​కోడ్​లోని నిబంధనలను పాటించనప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే జోక్యం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. అయినా కూడా కోర్టులు పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్న సందర్భాలు తరచూ చూస్తున్నం.

సుప్రీం పరిశీలన

నిహారికా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రైవేట్ ​లిమిటెడ్ వర్సెస్​ మహారాష్ట్ర కేసులో కోర్టుల పరిధి గురించి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దర్యాప్తులో కోర్టుల జోక్యం విషయాన్ని మరోసారి పరిశీలించింది. కేసులోని విషయాలకు వస్తే.. అప్పీలుదారుడిని పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. అతని మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్​406, 420, 405, 468, 471, 120 కింద కేసులు పెట్టారు. అతనికి అరెస్ట్​ నుంచి సెషన్స్​ కోర్టు మధ్యంతర రక్షణను ఇచ్చింది. ఈ రక్షణను కోర్టు అనేకసార్లు పొడగించింది. దాదాపు ఏడాది పాటు ఈ రక్షణను కోర్టు ఇచ్చింది. కేసు విచారణలో ఉన్న సమయంలో నిందితులు బొంబాయి హైకోర్టులో సెక్షన్ ​482 క్రిమినల్​ ప్రొసీజర్ ​కోడ్​ ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్​226 ప్రకారం దరఖాస్తును దాఖలు చేసి ఎఫ్ఐఆర్​ను రద్దు చేయాలని కోరారు. ఈ కేసును వాయిదా వేస్తూ నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని నిర్దేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  నిహారికా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​ప్రైవేట్​ లిమిటెడ్ ​వర్సెస్​ స్టేట్​ ఆఫ్ ​మహారాష్ట్ర కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఎఫ్ఐఆర్/ఫిర్యాదులో తదుపరి దర్యాప్తును లేదా విచారణను నిలిపివేయాలని కోరుకోవడం లేదా బలవంతపు చర్యలు లేని స్వభావంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, నిందితులను అరెస్ట్​ చేయకుండా తదుపరి విచారణను నిలిపివేయడం లాంటి ఉత్తర్వులను హైకోర్టులు ఎప్పుడు జారీ చేయాల్సి ఉంటుంది? సెక్షన్​482 క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్, ఆర్టికల్​226 ప్రకారం చర్యలను హైకోర్టులు ఎప్పుడు చేపట్టవచ్చు? ఈ అంశాలను సుప్రీంకోర్టు ఈ కేసులో పరిశీలించింది. 

సమతుల్యత పాటించాలని..

చట్టబద్ధమైన ఫిర్యాదుదారుల హక్కులు, నేరం జరిగిన విధానానికి, ఆ విషయాన్ని తెలిపే ప్రథమ సమాచార నివేదికల మధ్య, దర్యాప్తు సంస్థల అధికారానికి మధ్య, అమాయకుల హక్కులకు మధ్య సమతుల్యతను పాటించాలని సుప్రీంకోర్టు గుర్తించింది. విచారణ సమయంలో, చార్జిషీట్ సమర్పించే వరకు నిందితులను అరెస్ట్ ​చేయకూడదని హైకోర్టులు జారీ చేసే పద్ధతిని సుప్రీంకోర్టు ఈ కేసులో విమర్శించింది. కస్టోడియల్ ఇంటరాగేషన్​ అనేది అవసరం ఉంటుందని, అందుకుని అరెస్ట్ చేయకూడదన్న ఉత్తర్వులు జారీ చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు నిర్ధారించింది. క్రిమినల్​ ప్రొసీజర్ ​కోడ్​లోని నిబంధనల ప్రకారం కాగ్నిజబుల్​ నేరాలను పరిశోధించడానికి పోలీసు అధికారులు చట్టబద్ధమైన హక్కు కలిగి ఉంటారు. ఈ కేసుల్లో దర్యాప్తును కోర్టు నిలువరించలేవు. కాగ్నిజబుల్​ నేరం లేనప్పుడు మాత్రమే దర్యాప్తును కోర్టు నిలిపివేస్తుంది. కేసు దర్యాప్తు దశలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్​ను/ఫిర్యాదును రద్దు చేయాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు, వాటిల్లోని విశ్వసనీయతను, చట్టబద్ధతను న్యాయస్థానాలు పరిశీలించకూడదు. క్రిమినల్ ​ప్రొసీడింగ్స్​ను వెంటనే వదిలివేయకూడదు. ఎఫ్ఐఆర్​రద్దు చేయడమనేది తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారుల అధికార పరిధిలోకి కోర్టులు సాధారణంగా వెళ్లకూడదు. వాళ్ల అధికారాలను కోర్టులు స్వీకరించకూడదు. ఈ రెండు సంస్థలు వాటి పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు ఒక దానికి మరొకటి కాంప్లిమెంటరీగా పనిచేయాలి. అంతేగానీ ఒకదాన్ని మరొకటి అతిక్రమించకూడదు. జోక్యం చేసుకోకపోతే న్యాయం జరగదన్న అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు దర్యాప్తులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టులకు ఉన్న స్వయంసిద్ధ అధికారాలను కోర్టులు తమ ఇష్టానుసారం ఉపయోగించడానికి వీల్లేదు.

ఎఫ్ఐఆర్ ​ఎన్​సైక్లోపీడియా కాదు

ప్రథమ సమాచార నివేదిక అనేది ఎన్​సైక్లోపీడియా కాదు. నేరానికి సంబంధించిన అన్ని అంశాలు అందులో ఉండే అవకాశం లేదు. అందుకని కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఆర్​లోని యోగ్యతలను కోర్టులు విచారించకూడదు. దర్యాప్తు చేసేందుకు పోలీసులకు పూర్తి అవకాశం కల్పించాలి. కేసులో సరైన మెరిట్స్​లేవని దర్యాప్తు అధికారి భావించినప్పుడు అతను అలాంటి నివేదికను కోర్టుకు సమర్పిస్తాడు. కోర్టులు అప్పుడు వాటిని సమీక్షించవచ్చు. క్రిమినల్ ​ప్రొసీజర్ ​కోడ్​లోని సెక్షన్​482 ప్రకారం కోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ వాటిని చాలా జాగరూకతతో కోర్టులు వినియోగించాల్సి ఉంటుంది. కేసులో యోగ్యత లేనప్పుడు ఆ ఎఫ్ఐఆర్​ను రద్దు చేసే అధికారం కూడా కోర్టులు కలిగి ఉంటాయి. నిందితుడు ఎఫ్ఐఆర్​ను రద్దు చేయడానికి దరఖాస్తును దాఖలు చేసినప్పుడు, ఎఫ్ఐఆర్​లోని ఆరోపణల్లో కాగ్నిజబుల్​ నేర సమాచారం ఉందా లేదా అన్నది కోర్టు నిర్ధారించాలి. అందులోని నిజానిజాలను కోర్టు ఆ దశలో నిర్ధారించకూడదు. దర్యాప్తులో కోర్టుల జోక్యం గురించి సుప్రీంకోర్టు ఇంత స్పష్టమైన ఆదేశాలను తరచూ జారీ చేస్తున్నప్పటికీ హైకోర్టులు తరచూ జోక్యం చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మెరిట్​ఉన్న కేసుల్లో జోక్యం చేసుకోకపోతే అమాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సన్నని గీతను కోర్టులు గమనించి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
- డా. మంగారి రాజేందర్,జిల్లా, సెషన్స్ జడ్జి (రిటైర్డ్)