ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణకు వరం : నరేందర్ రాచమల్ల

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.ప్రజలందరికి ఆహారం లబించాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయానికి ప్రకృతి సహకారంతో పాటు విత్తనాలు పురుగు మందులు, నీరుతో బాటు ఎరువులు తప్పనిసరి. అందుకే  కేంద్ర ప్రభుత్వం దేశంలో మూతపడిన ఐదు యూరియా ఉత్పత్తుల కర్మాగారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,  వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూ. 6,383 కోట్లతో పునఃప్రారంభించి ఇతర దేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే తయారు చేసుకొని రైతుల్లో ఆత్మనిర్భరత  కలిగించాలని తీసుకున్న నిర్ణయం హర్షదాయకం.1970లో రామగుండంలో బొగ్గు ఆధారిత యూరియా తయారీ కేంద్రంగా ఏర్పడి వందలాది మందితో కళకళలాడిన కర్మాగారం నాణ్యతలేని బొగ్గు, విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం వల్ల నష్టాల్లో కూరుకుపోయి 2002 లో మూతబడడంతో కార్మికులంతా వీధిన పడ్డారు.

ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితమే కేంద్రం సుమారు 80శాతం ,రాష్ట్ర ప్రభుత్వం 11శాతం భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి పనులు ప్రారంభించినా .. కరోనా మహమ్మారి వలన ఆలస్యం అయినప్పటికీ ట్రయల్ రన్ పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించింది. ఈ కర్మాగారానికి అవసరమైన గ్యాస్ కోసం కాకినాడ నుండి రామగుండం వరకు 362 కి.మీ గ్యాస్ పైపు లైన్ నిర్మించింది. అమ్మోనియాకు సంబంధించి డెన్మార్క్ దేశానికి చెందిన కంపెనీ, యూరియాకు సంబంధించి సెమీకేబుల్ సంస్థలు పనులు చేపట్టడం, వివిధ కంపెనీల ఒప్పందం స్పష్టత వల్ల యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఫ్యాక్టరీలో 448 మంది, ప్రత్యక్షంగా 2000మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ పునః ప్రారంభం వల్ల మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు లాభం చేకూరనుంది.  కాగా  ఈ ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్ ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడి జాతికి అంకితం చేయడం అభినందనీయం.

- నరేందర్ రాచమల్ల, హనుమకొండ