తెలంగాణ ఉద్యమ ఎజెండానే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో దక్షిణ తెలంగాణ ఆకాంక్షలు నేటికీ తీరడం లేదు. ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులను కడుతోంది. తెలంగాణకు రావాల్సిన వాటాను ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్తూ.. సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మళ్లీ గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఇలాగే కొనసాగితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏపీ అక్రమ ప్రాజెక్టుల పనులను ఆపాలె.
2020లోనే జీవో
కృష్ణానదిలో ఉన్న వాటా కంటే ఏపీ ఎక్కువ నీళ్లు వాడుకునేందుకు ప్రాజెక్టులను విస్తరిస్తోంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ ద్వారా రోజుకు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించే విస్తరణ పనులకు 2020లోనే జీవో నెం 203ను విడుదల చేసింది. అది అలా ఉండగా.. సంగమేశ్వరం రూపంలో మరో గండి కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా పాలమూరు-–రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులకు చుక్క నీరు అందని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కృష్ణా బేసిన్‌లో 536 రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో శ్రీశైలం అతిపెద్దది. వాస్తవానికి శ్రీశైలం జలాశయాన్ని జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు.1964 లో ప్లానింగ్ కమిషన్ శ్రీశైలంను ఒక జల విద్యుత్ ప్రాజెక్టుగా మాత్రమే ఆమోదించింది. 1973లో బచావత్ ట్రిబ్యునల్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. కేవలం రిజర్వాయర్‌లో ఆవిరి నష్టాలకు మాత్రమే 33 టీఎంసీలుగా కేటాయింపులు చేసింది.
ఎన్జీటీ స్టే ఉన్నా..
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచాలని వైఎస్ తీసుకున్న నిర్ణయంపై పి.జనార్ధనరెడ్డి లాంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పట్లో పోతిరెడ్డిపాడు వద్ద అక్రమ ప్రాజెక్టులు నిర్మించటం వల్లే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాలువ పరిధిలోని తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారింది. ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతం పరిధిలోని పంటపొలాలు బీడులుగా మారే ప్రమాదముంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు చేస్తే దక్షిణ తెలంగాణకు చుక్క నీళ్లు కూడా దొరకవు. నీటి కేటాయింపులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక అక్రమ ప్రాజెక్టు పనులను ఆపాలి. ఒక వైపు పోతిరెడ్డిపాడు వివాదం నడుస్తుండగానే మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అనుమతి లేని నిప్పుల వాగు ప్రాజెక్ట్ విస్తరణ పనులను వేగవంతం చేసే దిశగా టెండర్లు పిలిచి పనులు చేసుకుంటూ పోతోంది. బనక చర్ల క్రాస్ రెగ్యులేటరీ, నిప్పుల వాగు ఎస్కేప్ చానల్ అనుమతులు రద్దు చేసి తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాలు రక్షించాలి.
మూడు జిల్లాలపై ప్రభావం..
పోతిరెడ్డిపాడు సామర్థ్యం తొలుత11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక 2006లో దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను ప్రారంభించారు. కృష్ణా నదికి వరదలొచ్చే సమయంలో 30 రోజుల్లో 114 టీఎంసీల నీటిని తరలించేలా పనులు చేపట్టారు. శ్రీశైలం నిండిన తర్వాతే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ డ్యామ్‌కు నీటిని వదులుతారు. కానీ ఓవైపు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు మళ్లిస్తుంటే దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే, అటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు సాగర్ జలాలపై ఆధారపడిన తెలంగాణలోని ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది.
- జటావత్ హనుము, రీసెర్చ్ స్కాలర్, ఓయూ