- ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థను వెనుకేసుకొస్తున్న తీరుపై విమర్శలు
- గోదావరికి రికార్డు వరద వచ్చినా తట్టుకున్న దేవాదుల పంప్‌హౌజ్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు ఇటీవల వచ్చిన వరదల్లో మునిగిపోయాయి. 29 బాహుబలి మోటార్లు ఇంకా నీళ్ల కిందే ఉన్నాయి. ‘మేము బాగానే కట్టాం, కానీ గత 200 ఏండ్లలో గోదావరికి ఎన్నడూ రానంత వరద రావడం వల్లే మునిగిపోయాయి’ అని రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రచారం చేస్తున్నారు. ఇదే గోదావరిపై 18 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామం దగ్గర కట్టిన పంప్హౌజ్మాత్రం ఇటీవలి గోదావరి వరదకు మునగలేదు.
భూగర్భంలో అమర్చిన పది మోటార్లపై ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. అన్నారం పంప్‌హౌజ్13 లక్షల క్యుసెక్కుల వరదకు, కన్నెపల్లి పంప్‌హౌజ్28 లక్షల క్యుసెక్కుల వరద తాకిడికే మునిగిపోయాయి. దేవాదుల పంప్హౌజ్మాత్రం 29.50 లక్షల క్యుసెక్కుల వరద ను కూడా తట్టుకొని నిలబడింది. అంటే అప్పటి ఇంజినీర్ల పనితనం ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవచ్చు. 14 ఏండ్లుగా దేవాదుల పంప్‌హౌజ్ మోటార్లు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మోటార్లు ఆన్ చేస్తే వాటర్ లిఫ్ట్ చేస్తాయి. అదే కన్నెపల్లి, అన్నారంలో ఏర్పాటు చేసిన మోటార్లు మూడేండ్లకే నీళ్లలో మునిగిపోవడానికి ఇంజినీర్ల తప్పిదం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు, కాంట్రాక్ట్ సంస్థ నాసిరకంగా చేపట్టిన పనులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.
మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణ శైలి ఒక్కటే..!
దేవాదుల ఎత్తిపోతల స్కీంకు 2000 సంవత్సరంలో అంకురార్పణ జరిగినప్పటికీ 2004‒08 మధ్య పనులు జరిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 5.61 లక్షల ఎకరాలకు సాగునీరు, వరంగల్ సిటీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏటా 36 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసేలా ఫస్ట్ ఫేజ్‌లో గోదావరి నదిపై దేవాదుల పంప్‌హౌజ్ కట్టారు. 130 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 10 మోటార్లను అమర్చి 2008 నుంచి వాటర్ లిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఈ పంప్‌హౌజ్ నిర్మాణ శైలి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కన్నెపల్లి, అన్నారం వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఒక్క తీరుగానే ఉంది. గోదావరి నదికి కేవలం 300 మీటర్ల దూరంలోనే దేవాదుల పంప్‌హౌజ్ కట్టగా.. కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు గోదావరి తీరానికి 500 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే నిర్మించారు. మూడు చోట్ల కూడా గోదావరి నీటి మట్టానికి అనుగుణంగా సొరంగం మాదిరిగా భూమిని తవ్వి కింది భాగంలో మోటార్లను అమర్చారు. గోదావరి నది ముందుభాగంలో హెడ్ రెగ్యులరేటర్ నిర్మించి గేట్లు అమర్చడం, ఫోర్ బే నిర్మాణం, మోటార్లు మునిగిపోకుండా ఫోర్ బేసిమెంట్ గోడ సిమెంట్ కాంక్రీట్‌తో కట్టడం వంటి పనులు సేమ్ టు సేమ్ చేశారు.
కోట్లకు పడగలెత్తిన కొందరు ఇంజినీర్లు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించిన కొందరు ప్రభుత్వ ఇంజినీర్లు కోట్లకు పడగలెత్తారు. పునాదులు తవ్వినప్పటినుంచి పనులు పూర్తి కావడానికి మూడేండ్ల సమయం పట్టగా కాంట్రాక్ట్ సంస్థలు భారీ నజరానాలతో ఇంజినీర్లను సంతృప్తి పరిచినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏఈ నుంచి మొదలుకొని డీఈఈ, ఈఈలు, ఎస్‌ఈలు, చీఫ్ ఇంజినీర్లలో చాలామంది రోజూ ఎంత పని జరిగింది? హైదరాబాద్‌కు ఏం రిపోర్ట్ పంపించాలి అనే ధ్యాస తప్ప పనుల నాణ్యత విషయంలో జోక్యం చేసుకునేవారు కాదంటున్నారు. దీనివల్లే వందల ఏండ్లు సేవలందించాల్సిన ప్రాజెక్టులు మూడేండ్లకే నీట మునిగి వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని చెప్తున్నారు.
లోపం ఎక్కడ జరిగింది?
కాళేశ్వరం పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నాసిరకం పనులు, ప్రభుత్వ ఇంజినీర్ల వైఫల్యం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు నీట మునిగినట్లు పలువురు ఇంజినీరింగ్నిపుణులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోదావరి తీరంలో జల్లారం వాగు వరద నీటిని అంచనా వేయకుండా ఫ్లడ్ రిజర్వాయర్ లెవెల్స్సరిగ్గా చూసుకోకుండా అన్నారం పంప్‌హౌజ్‌ను నిర్మించడం వల్లే రూ.600 కోట్ల విలువ చేసే 12 మోటార్లు నీట మునిగాయని అంటున్నారు.
భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద కాంట్రాక్ట్ సంస్థ నాసిరకం పనుల వల్ల కన్నెపల్లి పంప్‌హౌజ్ ఫోర్ బేస్‌బెంట్ గోడ పగిలి సుమారు రూ.680 కోట్ల విలువ చేసే సామర్థ్యం గల 17 బాహుబలి మోటార్లు నీటమునిగాయి. మొత్తం 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 29 మోటార్లు కొద్ది రోజులుగా నీటిలోనే ఉండిపోయాయి. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తప్పు ఒప్పుకోకపోగా గోదావరి వరదలపై రుద్దడం సరైంది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే కనీసం 15 ఏండ్ల ముందు ఇదే గోదావరి నది తీరంలోనే కట్టిన దేవాదుల పంప్‌హౌజ్ నీట మునగకుండా 29.50 లక్షల క్యుసెక్కుల వరద తాకిడి తట్టుకొని నిలబడితే.. దీనికంటే తక్కువ స్థాయిలో వచ్చిన వరద నీటిలో అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు నీట మునగడానికి పనుల్లో క్వాలిటీ లేకపోవడమే కారణమంటున్నారు.