అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనం

  • కేజ్రివాల్ నోరు మెదపలేకపోతున్నారు
  • కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆప్ పార్టీ ఢిల్లీ మోడల్ అంటే ఇదేనా.. ? లిక్కర్ పాలసీ అద్భుతమైనదైతే ఎందుకు వెనక్కు తీసుకున్నారని నిలదీశారు.
‘‘అసలు మద్యం కాంట్రాక్టులు కేటాయించే ముందు ఆప్ నేత కేజ్రీవాల్ ఎవరిని అడిగారు.. ? ఇంతకు ముందు ఆరోగ్యశాఖ మంత్రి అరెస్టయి 3 నెలలు జైలులో ఉన్నారు.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నిందితుడిగా మొదటివరుసలో నిల్చుకున్నారు.. అవినీతిపై సమాధానం చెప్పమంటూ కేజ్రివాల్ కు 24 గంటల గడువిస్తూ సవాల్ విసిరితే ఇంత వరకు జవాబివ్వలేకపోయారు..రాబోయే రోజుల్లో ఆప్ పార్టీ నేతల అవనీతి అంతా బయటకు వస్తుంది..’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.