మీటర్ పని చేయకున్నా నల్లా​ బిల్లు కట్టాల్సిందే!

మీటర్ పని చేయకున్నా నల్లా​ బిల్లు కట్టాల్సిందే!
  • మీటర్ పని చేయకుంటే.. నల్లా​ బిల్లు కట్టుడే!
  • ఫ్రీ వాటర్ స్కీమ్ రూల్స్​తో ఇబ్బందులు
  • అధికారుల వద్దకు వెళ్లే దాకా  తెలియట్లేదు
  • ఆధార్ సీడింగ్ పైనా ఇంట్రెస్ట్​ చూపట్లేదు
  • అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం

“ కంచన్​ బాగ్​ ఏరియాకు చెందిన ఓ వినియోగదారుడు ఫ్రీ వాటర్ స్కీమ్ కోసం రెండు నెలల కిందట ఆధార్ సీడింగ్ పూర్తి చేశాడు. అయినా అతనికి వాటర్ బోర్డు సిబ్బంది బిల్లు ఇచ్చి వెళ్లారు. దీంతో ఆందోళన చెందిన అతడు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నల్లా వాటర్ మీటర్ పని చేయట్లేదని తెలిసింది. దీని గురించి తనకు ఇప్పటిదాకా తెలియదని అధికారులు కూడా చెప్పలేదని తెలిపాడు. ’’ 

హైదరాబాద్, వెలుగు: ఫ్రీ వాటర్ స్కీమ్​ వర్తించాలంటే ఒక్క ఆధార్ సీడిం గ్ చేస్తే సరిపోదు. వాటర్​ మీటర్​ పని చేస్తేనే పథకానికి అర్హులవుతారు.   లేదంటే పెండింగ్ బిల్లులను కూడా  చెల్లించాల్సి ఉంటుంది.  వాటర్​ బోర్డు  స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతుండగా వినియోగదారులపై బిల్లుల భారం పడేలా ఉంది. ఈనెల15తో ఫ్రీ వాటర్ స్కీమ్​కు గడువు ముగుస్తుంది.  ఈ స్కీమ్​పై అవగాహన కల్పించడంలో  అధికారుల ఫెయిల్​ అయ్యారు.   గ్రేటర్​లో 9 నెలలుగా  ఫ్రీ వాటర్ స్కీమ్​ ప్రాసెస్​ చేస్తున్నా ఇంకా వినియోగదారులకు  అపోహలు తొలగిపోవడం లేదు. ముందుగా ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని అధికారులు చెప్పి హడావిడిగా నమోదు చేయించారు. ఆ తర్వాత మీటర్ పనిచేస్తుందో లేదో తెలియక వచ్చిన బిల్లులను చూసి వినియోగ దారులు ఆందోళన చెందారు. ఆధార్ సీడింగ్ కు మరోసారి గడువు పెంచినా మీటర్ పనిచేయకుంటే ఒకేసారి 9 నెలల పెండింగ్ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసే అంశం ఇదే. ఇప్పటికిప్పుడు మీటర్ మార్చుకోవడం సాధ్యం కాదని వినియోగదారులు, వాటర్ బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.  అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారోననే దానిపైనే స్పష్టత లేదు.

ఆధార్ సీడింగ్ చేసినా.. 
వాటర్​బోర్డు మార్చిన నిబంధనల మేరకు ఆధార్ సీడింగ్ ఒక్కటి చేస్తేనే సరిపోదు. వాటర్ మీటర్ కూడా పనిచేస్తుండాలి. లేదంటే ఫ్రీ వాటర్ స్కీమ్ వర్తించదు. నెలలుగా గడువు పొడిగిస్తూనే ఉన్నా మీటర్ పై  స్పష్టమైన ఆదేశాలు, అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయగా వినియోగదారులు ఒకేసారి వేలల్లో కట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే  ఆధార్ సీడింగ్ చేసుకుని నల్లాల మీటర్లు పని చేయక వేలల్లో బిల్లులు రావడంతో కొందరు వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. గతంలోనూ భారీగానే వాటర్ బోర్డు అధికారులకు ఇలాంటి ఫిర్యాదులు కూడా అందాయి.

మరోసారి గడువు ఇవ్వాలని..
 కరోనా కారణంగా ఆధార్ సీడింగ్, నల్లా మీటర్లపై అధికారులు పెద్దగా అవగాహన కల్పించలేకపోయారు.  సిటీలో మొత్తం 10.9 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి.  ఇందులో  6 లక్షల నల్లా కనెక్షన్లకు  ఆధార్ లింక్  పూర్తయింది.  ఇందులో సుమారు లక్షన్నర నల్లాలకు మీటర్లు పని చేయట్లేదని సమాచారం. ఇప్పడు ఆధార్ సీడింగ్ చేసుకుని, పని చేయని నల్లా మీటర్ మార్చుకోకుంటే  బిల్లులను మరోసారి జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మీటర్ పెట్టుకునేందుకు  మరోసారి గడువు పెంచి అవకాశమివ్వాలని వాటర్ బోర్డు అధికారులను వినియోగదారులు కోరుతున్నారు. కొత్త మీటర్ ఏర్పాటు చేసుకోవాలంటే కొంత లేట్​అయినా పెండింగ్ బిల్లులు కట్టే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.