- గతేడాది బురుజు కూలితే నేటికీ మరమ్మత్తులు చేయలే
- ఇప్పుడు సద్దలగుమ్మి, కోట బురుజులకు పర్రెలు
- ఇండ్లు ఖాళీ చేయాలని తొమ్మిదిమందికి నోటీసులు
జనగామ, వెలుగు: సర్దార్సర్వాయ్పాపన్న కోట డేంజర్లో ఉంది. రిపేర్లు లేక శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో అనే భయాన్ని కలిగిస్తోంది. గత వానాకాలం సీజన్లో ఒక వైపున్న కోట బురుజు కుప్పకూలింది. దీని మరమ్మతులునేటికీ మొదలు కాలేదు. ఇప్పుడు సద్దలగుమ్మితో పాటు మరో వైపున్న కోట బురుజుకు పగుళ్లు వచ్చాయి. వీటి ఎడం పెరుగుతూ వస్తోంది. దీంతో సమీపంలోని ఇండ్లవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో ఉన్న సర్వాయ్ పాపన్న కోట తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. చారిత్రక కట్టడంపై సర్కారు మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. గతేడాది అక్టోబర్ 15న కోట బురుజు కూలితే నేటి వరకు రిపేర్లు స్టార్ట్ చేయలేదు. కోట కూలిన తెల్లారి ఖిలాషాపూర్ వచ్చిన రాష్ర్ట ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘పాపన్న కోటను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలే.. 50 ఏండ్ల కిందే మరమ్మతులు చేయాల్సి ఉండే.. ఆంధ్రా పాలకులు తెలంగాణ వీరుల చరిత్రను పట్టించుకోలే’ అని అన్నారు. అంతేకాదు ‘కుట్రతో తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు ఒక్క పైసా ఖర్చు చేయలే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగనే సీఎం కేసీఆర్ వీరులను చరిత్ర పుటల్లో నిలుపుతున్నడు.. ఖిలాషాపూర్, జాఫర్గఢ్తదితర కోటలకు నాలుగైదు కోట్లు మరమ్మతుల కోసం మంజూరు చేసిండు.. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అన్నారు. ఇవేవీ కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పర్రెల ఎడం పెరుగుతోంది
సర్వాయి పాపన్న ధాన్యాగారంగా, ఆయుధ నిల్వల కోసం వాడుకున్నట్లు భావించే సద్దలగుమ్మి కట్టడం పర్రెలు పట్టింది. దీనికి తోడు కోటకు మరో వైపున్న కోట బురుజుకు పగుళ్లు వచ్చాయి. వానకాలం సీజన్ స్టార్ట్ అయింది. సద్దల గుమ్మి, కోట బురుజు పర్రెల ఎడం క్రమంగా పెరుగుతూ వస్తోంది. వానలు ఎక్కువైతే కూలిపోయే ప్రమాదం ఉంది. కోట భాగం ఒకవైపు కూలే ప్రమాదం ఉందని.. వెంటనే ఇండ్లు ఖాళీ చేయాలని సమీపంలో ఉన్న 9 కుటుంబాలకు రెవెన్యూ ఆఫీసర్లు వారం కింద నోటీసులు ఇచ్చారు. ఇందులో ఇద్దరివి ఖాళీ ప్లేసులు కాగా మిగిలిన వారివి ఇండ్లు ఉన్నాయి. సర్కారు స్కూల్లో ఉండాలని ఆఫీసర్లు చెప్పగా అందుకు బాధితులు ససేమిరా అన్నారు. నీళ్లు, బాత్రూమ్ వంటి కనీస సౌలతులు లేకుండా ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక ఆఫీసర్లు నోటీసులను గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద అంటించి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే గతేడాది కోట బురుజు కూలగా జిట్టె వెంకటయ్య, వీరస్వామి, చిన్న వీరస్వామిలకు చెందిన మూడిండ్లు నేలమట్టం కాగా ఆవుల మల్లమ్మ ఇల్లు కొంత దెబ్బతిన్నది. బాధిత కుటుంబాలు అదే గ్రామంలోని ఎస్సీ బాయ్స్‌హాస్టల్‌లో తలదాచుకుంటున్నారు. వీరిని హాస్టల్నుంచి ఖాళీ చేయాలని రఘునాథపల్లి ప్రొబెషనరీ ఎస్సై ప్రియదర్శిని మంగళవారం తీవ్ర ఒత్తిడి చేయగా వారు ససేమిరా అన్నారు.
మంత్రి రావాల్నట
కూలిన కోట బురుజు మరమ్మతుల కోసం రూ. 1.26 కోట్లను సర్కారు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించిన టెండర్, అగ్రిమెంట్నెల క్రితం పూర్తయ్యాయి. కానీ వీటిని ప్రారంభించేందుకు టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రావాల్నట.. ఆయన కొబ్బరికాయ కొడితేనే పనులు స్టార్ట్ కావాలని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో మరమ్మతు పనులు ప్రారంభం కావడం లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్నిర్లక్ష్యం వల్ల కోట శిథిలావస్థకు చేరిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పలుసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 2017 ఏప్రిల్‌లో పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్జిల్లాలోనిపెంబర్తి, పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, ఖిలాషాపూర్, జఫర్ఘడ్లను టూరిజం సర్క్యూట్‌గా చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. రూ 40 కోట్లను మంజూరు చేశారు. వీటిలో రూ 4.50 కోట్లు ఖిలాషాపూర్ కోట డెవలప్మెంట్ కు అప్పట్లో కేటాయించారు. కోట పగుళ్లకు మరమ్మతులు చేసే క్రమంలో గోడ రంధ్రాలను మూసివేశారు. ఫలితంగా వాన నీళ్లు బయటకు వెళ్లకుండా గోడలోనే ఇంకిపోతున్నాయి. దీంతోనే కోటకు పగుళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఖాళీ చేయమంటే ఎటు పోవాలె
సద్దల గుమ్మి కట్టడం పగుళ్లు పట్టింది. అది ఎప్పుడు కూలుతదో తెల్వది. ఆఫీసర్లు వారం కింద ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు ఇయ్యడానికి వచ్చిండ్రు. సర్కారు బడిలో ఉండమన్నరు. అక్కడ సౌలతులు లేవు. ఎట్లుండాలె. కోటకు రిపేర్లు ఎందుకు జేత్తలేరు.
- కావటి కోమలమ్మ, ఖిలాషాపూర్
రిపేర్లు ఇంకెప్పుడు చేస్తరు
పోయిన వానాకాలం కోటు బురుజు కూలి మా ఇంటికి రోడ్డు బంద్అయింది. గిప్పటి వరకు రిపేర్లు జేత్తలేరు. గీ మధ్య ఇసుక తెచ్చి పోసిన్రు. మంత్రి సారు వచ్చి కొబ్బరికాయ కొడితేనే రిపేర్లు జేత్తరని అంటున్రు. గిప్పుడు వానలు రావట్టే.. కోట పర్రెలు పెరుగవట్టె. గిట్లైతే ఎట్లా.
- జిట్టె నర్సయ్య, ఖిలాషాపూర్