కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా: అప్పుల్లో ఉన్న పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటుంటే.. ధనిక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కేంద్రం ఆదేశిస్తే ఇస్తానని ముడిపెడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో నిరసన,సంతకాల సేకరణ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తోడుదొంగల్లా వ్యవహరిస్తూ.. ఈ పంట బీమా పథకాన్ని తొలగించిందని విమర్శించారు.
క్రాపు లోను 50% రాయితీ లోను 25% కేంద్ర ప్రభుత్వం భరిస్తే మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అకాల వర్షంతో రైతులు నష్టపోయారో వారికి ఎకరానికి 15 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్టించింది అని ఆయన గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఇస్తా అని మాట్లాడుతున్నారు.. ఇందుకేనా తెలంగాణ కోరుకున్నదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం మాత్రమే కాకుండా రైతాంగానికి కూడా మేలు జరుగుతుందని అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. రైతులకు రైతు బంధు ఇస్తున్నాం అని చెబుతున్న కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన పథకాలనే అమలు చేస్తూ రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇస్తున్నాడని జీవన్ రెడ్డి తెలిపారు.