- 1957 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి
- ఈసారి అదే సీన్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ ధీమా
- ఓటమితో బీఆర్ఎస్ డీలా
- క్యాడర్ లేని బీజేపీకి మోదీపైనే ఆశలు
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ పార్టీ పవర్లో ఉంటే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకే మానుకోట ఓటర్లు పట్టం గడ్తున్నారు. 1957 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత, బీజేపీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ పోటీపడ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలాపడగా, ఆ పార్టీ అభ్యర్థి కవిత ఒంటరి పోరు చేస్తున్నారు. ఇక క్యాడర్‌లేని బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాంనాయక్ ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు.
సెంటిమెంట్ కలిసి వచ్చేనా
మహబూబాబాద్ పార్లమెంట్1957లో జనరల్ ఎంపీ సీటుగా ఆవిర్భవించింది. నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ నుంచి ఎంపీని గెలిపిస్తున్నారు. మహబూబాబాద్ జనరల్ సీటుగా ఉన్న 1957, 62లో కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం రావు వరుసగా రెండుసార్లు గెలిచారు. 1965 ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచే ఆర్.సురేందర్ రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్‌గా మారింది. ఎస్టీగా మారిన తర్వాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ గెలుపొంది కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ టైంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత విజయం సాధించగా, మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్‌లో పవర్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
భారీ మెజారిటీపై బలరాంనాయక్ కన్ను
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పినపాక, భద్రాచలం, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్ సుమారు 3లక్షలకు పైగా మెజారిటీ వస్తుందనే ధీమాతో ఉన్నారు. బలరాం నాయక్గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం ఆయనకు అదనపు బలం. ప్రజలకు అందుబాటులో ఉండే ఆయనకు ఆపదలో ఆదుకుంటారనే పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో 365 నేషనల్ హైవే ఏర్పాటు, శాతవాహన రైల్వే హాల్టింగ్, కురవిలో ఏకలవ్య విద్యాలయ నిర్మాణం, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య గోదావరిపై వంతెన సాంక్షన్ చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవికూడా వచ్చే అవకాశముందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
మాలోతు కవిత ఒంటరి పోరాటం
సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి లేకపోవడం ఆమెకు మైనస్. ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా సహకారం దక్కట్లేదు. పార్టీలో అంతర్గత విభేదాలు ఆమెకు సమస్యగా మారాయి. ఎంపీగా ఐదేండ్లు కొనసాగిన కవిత కేంద్రం నుంచి ఎలాంటి నిధులు సాధించలేకపోయారు. ఈ అభివృద్ధి చేశానని చెప్పుకోలేని పరిస్థితి. విభజన హామీగా ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ కూడా నెరవేరలేదు. మహబూబాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని క్యాడర్‌కు అందుబాటులో ఉండడం ఆమెకు కొంతవరకు కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నిస్తేజంలో ఉండడంతో ఫీల్డ్‌లో ఆమెకు ఎంతవరకు సహకారం దక్కుతుందనేది అనుమానమే.
నమో నినాదాన్నే నమ్ముకున్న సీతారాం నాయక్
మహబూబాబాద్‌లో బీజేపీకి చెప్పుకోదగిన క్యాడర్ లేదు. ఆ పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. గెలిచాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని, కేవలం ఎన్నికల టైంలో ప్రత్యక్షం అవుతారనే అపవాదు ఉంది. ఎం పీ గా కొనసాగిన సమయంలోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయకపోవడం ఆయనకు మైనస్. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉంది. అందులోనూ పాత బీజేపీ క్యాడర్ సీతారాంనాయక్‌కు పెద్దగా సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గంలో ప్రచారానికి పేరున్న లీడర్లెవరూ రావడం లేదు. కేవలం ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకొన్న సీతారాంనాయక్, కేంద్ర పథకాలు, హిందుత్వ ఎజెండా తనను గెలిపిస్తాయనే ఆశతో ప్రచారం
కొనసాగిస్తున్నారు.