మెట్ పల్లి, వెలుగు: ఆర్టీఏ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై వాహనాలు నడిపిస్తే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారి రంజిత్ పేర్కొన్నారు. గురువారం మెట్ పల్లి శివారులో ఆయన వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ పామూరు నుంచి జగిత్యాలకు నడిపిస్తున్న ప్రైవేటు బస్సును సీజ్‌చేశారు. కోరుట్ల, జగిత్యాల డిపో మేనేజర్లు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఆయన వెంట రవాణా శాఖ అధికారులు వెంకటరమణ, వంశీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా అకౌంటింగ్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీతోపాటు అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గురువారం అకౌంటింగ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకౌంటింగ్ లెక్చరర్లను సన్మానించారు. కార్యక్రమంలో వివేకానంద కాలేజీ ప్రిన్సిపల్ డా.చంద శ్రీనివాస్, అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
‘విద్యలో నైపుణ్యం సంపాదించాలి’
కరీంనగర్ టౌన్, వెలుగు: వ్యాపార రంగానికి తగినట్టుగా స్టూడెంట్లు విద్యలో నైపుణ్యాన్ని సంపాదించాలని కిమ్స్ కాలేజీ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. గురువారం స్థానిక కిమ్స్ కాలేజీలో నిర్వహించిన ఎంబీఏ విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాపారంలో రాణించడానికి మేనేజ్ మెంట్ వి ద్య ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ శ్వేత, లెక్చరర్లు అరవింద్ రెడ్డి, సుమలత, అనిల్, సందీప్, రజిత, స్టూడెంట్లు పాల్గొన్నారు.
అల్ఫోర్స్ స్కూల్లో బాలల దినోత్సవం
కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు వ్యాస రచన పోటీలునిర్వహించి, విజేతలకు చైర్మన్ నరేందర్ రెడ్డి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశనుంచే ప్రతిభ పోటీలు నిర్వహించాలన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
టన్నెల్ పనుల్లో వేగం పెంచాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి
కోనరావుపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం సిరిసిల్ల పట్టణం రగుడు మిడ్‌మానేరు బ్యాక్ వాటర్ నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల్లో భాగంగా చేపట్టిన మల్కపేట రిజర్వాయర్, సర్జ్‌పూల్ పంప్ హౌస్, కంట్రోల్ రూం, టన్నెల్ పనులను ఈఈ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. మొదట రగుడు టన్నెల్ లో నీరు ప్రవేశించే మార్గాన్ని పరీక్షించి మల్కపేట రిజర్వాయర్ బండ్ 5, బండ్ 4 వద్ద కు చేరుకుని పనుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈఈలు సత్యనారాయణ, కిషోర్, వినోద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
వేలం సజావుగా జరగాలి
అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్
కరీంనగర్ సిటీ, వెలుగు: అంగారక టౌన్ షిప్ ద్వారా నిర్వహించనున్న వేలం సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆమె మాట్లాడారు. ప్లాట్ల వేలంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, వేలం జరిగే చోట ఫ్లెక్సీలు, పెద్ద స్క్రీన్ ప్రొజెక్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్‌డెస్క్ లను, బ్యాంకు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాట్లను చదును చేసి బౌడరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో సుడా సీపీఓ విద్యాసాగర్, పీడీ రవీందర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్, స్వగృహ ఏఈ చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం తూకాల్లో కోతలు పెడితే చర్యలు
జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్
జమ్మికుంట, వెలుగు : ఈ సీజన్ లో ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయిని, నిబంధనల పేరిట ధాన్యం తూకాల్లో కోతలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మిల్లర్లను హెచ్చరించారు. గురువారం జమ్మికుంటలో రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మద్దతు ధరతో ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని మిల్లర్లు మిల్లుల్లోకి దిగుమతి చేసుకోవాలన్నారు. మిల్లర్లు సహకరించకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయన్నారు. అనంతరం మిల్లర్లు మాట్లాడుతూ గత సీజన్లో దించుకున్న ధాన్యం మర పట్టించిన బియ్యాన్ని నిబంధనల పేరుతో సకాలంలో అధికారులు దిగుమతి చేసుకోలేదని, ఫలితంగా ధాన్యం, బియ్యం తడిచిపోయిందని అన్నారు. రంగు మారడం వల్ల నష్టపోతన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి సురేశ్‌కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు
కేయూ మాజీ వీసీ లింగమూర్తి
కరీంనగర్ టౌన్,వెలుగు: డెబ్భై ఐదేళ్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు జరిగాయని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి అన్నారు. గురువారం స్థానిక శాతవాహన యూనివర్సిటీలో ‘75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాల అంతరాలను గుర్తించాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే ఆర్థిక స్వాతంత్ర్యమని అన్నారు.కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ చైర్మన్ప్రొఫెసర్ ఇంద్ర కాంత్, రిజిస్ట్రార్ ఎం. వరప్రసాద్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ జాఫర్ పాల్గొన్నారు.
అడగకముందే అభివృద్ధి పనులు
కొత్తపల్లి, వెలుగు : అడగకముందే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం బద్ధిపల్లిలో రూ.1.25 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటే భయంగా ఉండేదని, ఏ గ్రామంలో కూడా సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ కుటుంబాలు బాగుండాలని, బీడు భూములన్నీ సస్యశ్యామలం కావాలని కోరారు. వరద కాలువకు తూము ఏర్పాటుచేసి నాగులమల్యాల, బావుపేట, బద్దిపల్లి, కమాన్‌పూర్, ఎలగందల్ చెరువులను నింపి బీడువారిన పొలాలను సాగులోకి తీసుకొచ్చామన్నారు. ఎంపీపీ శ్రీలత-, ఏఎంసీ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ రాజశేఖర్, సర్పంచులు మధు, సంపత్, ప్రసాద్, ఎంపీటీసీలు లీడర్లు పాల్గొన్నారు.
ఎంసీహెచ్ ముందు బాధితుల ఆందోళన
జగిత్యాల, వెలుగు : మాత శిశు సంరక్షణ కేంద్రంలో సరైన చికిత్స అందికపోవడంతోనే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం పోలస గ్రామానికి చెందిన కొండ్ర రమ్య(21) భర్త మనోహర్ కు రెండేళ్ల కూతురు ఉంది. రెండో కాన్పు కోసం రమ్య జగిత్యాల మాత శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) లో నవంబర్2న చేరింది. మరుసటి రోజు డాక్టర్లు సిజేరియన్ చేయగా కొడుకు జన్మించాడు. డెలివరీ తర్వాత రమ్య వాంతులు, జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడింది. డాక్టర్లు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి మూడు రోజులకు ఇంటి పంపించారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్యు సిబ్బందికి మోర పెట్టుకున్నా పట్టించుకోలేదని సూపరింటెండెంట్ రాములు కు ఫిర్యాదు చేశారు.
మీడియా సహకారం ఎప్పుడూ ఉండాలి
ఎల్లారెడ్డి పేట, వెలుగు: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం పోలీసులకు ఎల్లప్పుడూ ఉండాలని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, రిపోర్టర్లు కలిసి పనిచేస్తే సమాజాన్ని మంచిమార్గంలో తీసుకెళ్లవచ్చన్నారు. క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్లు, చాలా కేసులు మీడియా ద్వారా పరిష్కారమయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మజీద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య , జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి పాల్గొన్నారు.
ఈడీ, ఐటీ దాడులు బీజేపీ కుట్ర
జగిత్యాల, వెలుగు: కరీంనగర్లో ఈడీ, ఐటీ దాడులు బీజేపీ కుట్రలో భాగమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను కూల్చేసిందని, మరికొన్ని చోట్ల ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు చేసిన విఫలమయ్యాని ఆరోపించారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ రాష్ట్రానికి వచ్చే నిధులు, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూల్స్, ఐటీఐఆర్ ప్రాజెక్టు లు రాకుండా చేస్తున్నారని, ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఆస్పత్రుల్లో సేవలు గణనీయంగా పెరిగాయి
వేములవాడ, వెలుగు: వైద్య శాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్పత్రుల్లో సేవలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వేములవాడలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. గతంలో రాష్ట్రంలోని ఏరియా ఆస్పత్రుల్లో ఏడాదికి 78 లక్షల 50 వేల మంది ఓపీ సేవలు పొందేవారని, ప్రస్తుతం కోటీ 36 లక్షల చేరిందన్నారు. గతంలో 67 వేల ఆపరేషన్లు జరిగితే ఇపుడు రెండు లక్షల పైగా చేశామన్నారు. వారి వెంట వైద్యాధికారులు ఉన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
కోనరావుపేట,వెలుగు: రైతులు పండించిన పంటను దళారులను అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. గురువారం కోనరావుపేట మండలం మరిమడ్ల అహమ్మద్ హుస్సేన్ పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు. అనంతరం సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించి కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ రేణుక, జడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.