పథకాలు ఓట్లకు ‘ఎర’లు అయితే.. పేదరికం ఎట్ల పోతది?: చిట్టెడ్డి కృష్ణా రెడ్డి

పేదల ఆకలి తీర్చే కార్యక్రమాలు నేటికీ అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూనే ఉన్నాయి. అయినా పేదరికం పోవడం లేదు. పేదలు పేదలుగానే  ఉంటుంటే, ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోతున్నారు. అసమానతలు తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. 

నేడు అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చేవే కానీ స్వయం శక్తితో నిలదొక్కుకునే ఆర్థిక పుష్టిని అంది ఇవ్వలేకపోతున్నాయి.  ఆర్థిక సమానత్వాన్ని, సమర్థతను పెంచలేని సంక్షేమ పథకాల వల్ల ప్రజలు శాశ్వత పేదరికంలోనే మగ్గిపోతూ ఉన్నారు. పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీ పేదరికాన్ని రూపుమాపలేకపోతున్నది. కాబట్టి, ఆ సహాయాన్ని నగదు రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు, నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్నాయి. నగదు పొందిన వారు ఉద్దేశించిన అవసరాలకు కాకుండా, తమ అనుత్పాదక అవసరాలకు కూడా ఆ నగదును ఖర్చు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. తద్వారా ఆశించిన, మెరుగైన ఫలితాలను సాధించలేం. నగదు పొందిన లబ్ధిదారుల నుంచి  వివిధ స్థాయిలో ఉండే నాయకులు, అధికారులు, తమ వాటా  ఇవ్వాలంటూ అవినీతికి పాల్పడుతున్న అనేక సంఘటనలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలా సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పట్టడం వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా రుణ భారం పెరగడం, చివరకు పన్ను చెల్లింపుదారులపై భారం పడటం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే రుణ భారం భారీగా పెరుగుతుందో అది మళ్లీ సామాన్య ప్రజలపైన వస్తుసేవల ధరల పెరుగుదల, కొత్త పన్నుల రూపంలో భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు గతంలో ప్రభుత్వాలే రోడ్డు రవాణా చూసుకునేవి.  కానీ నేడు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అనే పేరుతో పూర్తిగా ప్రైవేటు సంస్థలు రోడ్లు వేసి, వాహనాల నుంచి ఏండ్ల తరబడి టోల్ వసూలు చేస్తున్నాయి. 

చక్రబంధంలో సంక్షేమం 

ప్రజలందరి సంక్షేమమే శ్రేయస్కరం. సమాజ సర్వతోముఖాభివృద్ధి విరివిగా సంక్షేమ పథకాలు అవసరం. కానీ ఈ పథకాల రూపకల్పనలో, వాటి అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ఆశించిన మేరకు ఫలితాలను రాబట్టలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కన్నా పాలకుల సంక్షేమమే చాలా ముఖ్యంగా మారుతున్నది. ప్రజల బలహీనతల ఆధారంగా పథకాల రూపకల్పన చేసి, దాన్ని పాలకుల బలంగా మార్చుకోవడంలో సఫలీకృతం అవుతూ ఉన్నారు. సంక్షేమం అంటే తక్షణ ఉపశమనం కాదు. దీర్ఘకాలంలో స్వశక్తితో ఎదిగే విధంగా పథకాలు ఉండాలి. కానీ పేదరికం సమస్య ఒక చక్రబంధంలో బందీ అయిపోతున్నది. 

జవాబుతారీతనం లేని సంక్షేమం ఎవరి కోసం ?

ప్రభుత్వాలు పోటీపడి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే అనేక తాత్కాలిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సంక్షేమ పథకాల రూపకల్పనపై చూపించిన శ్రద్ధ వాటి అమలులో కనపడదు. లబ్ధి పొందిన వారు ఎంత మేరకు ప్రయోజనం పొందారు లేదా ఎందుకు ఆర్థికంగా పరిపుష్టిని సాధించలేకపోయారనే లోతైన అధ్యయనాలు లేవు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయ రూపంలో అందుతున్న వివరాలను పొందుపరుస్తూ, దశాబ్దానికి ఒక్కసారైనా పూర్తిస్థాయిలో ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో, ఇంకా ఎందుకు పేదరికం నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు? అనే కారణాలను పాలకులు తెలుసుకుంటున్నారా? అంటే లేదు. సంక్షేమ పథకాల ఉద్దేశాలపై పాలకుల వద్దనే జవాబుదారీతనం లేకపోతే, లబ్ధిదారులు ఆర్థిక పరిపుష్టి  చెందేది ఏముంటుంది? దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అనేక వేదికలపై చెబుతున్నది. అయితే రాష్ట్రంలో పేదరికం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ఏపీలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందని ఆ మధ్య నీతి ఆయోగ్‌‌ ప్రకటించింది. భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి అయోగ్‌‌ మొదటిసారిగా రూపొందించిన జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక(ఎన్‌‌ఎంపీఐ)లో  ఈ విషయాన్ని పేర్కొంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌‌ 20 స్థానంలో నిలిచినట్లు తెలిపింది. అయితే 2015-–16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌‌ఎఫ్​హెచ్‌‌ఎస్‌‌)’ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. వేల కోట్లు వెచ్చిస్తూ, పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తుంటే, పేదరికం తగ్గడం లేదన్న నివేదికను ప్రభుత్వం ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకొని సరైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

విద్య,  వైద్యం సంక్షేమం కాదా?

సమాజ అసమానతలను రూపుమాపటంలో, ఆర్థిక పరిపుష్టిని పెంపొందించడంలో విద్య, వైద్యం చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. పేదవాడి పేదరికం శాశ్వతంగా దూరం కావాలంటే నాణ్యమైన విద్య పూర్తి స్థాయిలో అందించాలి. నేడు ప్రభుత్వ రంగంలో విద్య ఉన్నప్పటికీ, నాణ్యమైన నూతన విజ్ఞానాన్ని అందించడంలో మనం ఇంకా ఎంతో వెనకబడే ఉన్నాం. దీంతో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బులు ఉన్నవాడికే మార్కెట్​లో నాణ్యమైన విద్య దొరికే పరిస్థితి సృష్టించబడింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మానవ వనరుల అభివృద్ధి జరిగి, ప్రపంచ దేశాలతో పోటీపడే ఆస్కారం మరింత పెరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ప్రజలు కూడా తమ కష్టార్జితంలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికే ఖర్చు పెడుతున్నారు. విద్య, వైద్యం విషయంలో భారీగా ఖర్చులు పెరగడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చతికిలపడుతున్నాయి. దీంతో అట్టడుగు వర్గాల ప్రజలు పేదరిక విషవలయం నుంచి బయటపడలేకపోతున్నారు. ఓట్లు రాల్చుకోవడానికి మాత్రమే పాలకులు తాత్కాలిక పథకాలను ఎరలుగా వాడుతున్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాత్రమే పథకాలు ప్రకటించి పబ్బం గడుపుకుంటున్నాయి. అవి ప్రజల ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడుతున్నాయా? ఓటు కోసం మాత్రమే ఉద్దేశించినవా ? అందరికీ తెలియని విషయం కాదు. ఓట్ల సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఉచిత విద్య,  వైద్య సౌకర్యాలకు మళ్లించినట్లయితే వారు ఆర్థికంగా పరిపుష్టి సాధించి, ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం  తగ్గుతుంది. 

- చిట్టెడ్డి కృష్ణా రెడ్డి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
హెచ్​సీయూ