నిర్బంధ జైళ్లుగా కాలేజీలు?

వరంగల్ లో డాక్టర్ ప్రీతి మరణం ఉన్నత విద్యలో వివక్షలపై తెర లేపితే,  చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ కార్పొరేట్ విద్య డొల్లతనాన్ని బయట పెట్టింది. ఈ చావులకు  ప్రభుత్వం బాధ్యత వహించక పోతే ఇవి ఇలాగే కొనసాగుతాయి. కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో మార్కుల  చుట్టూ బోధన సాగుతుంది. మార్కులు సాధించి ఈ సంస్థలకు వాటి యాజమాన్యాలకు మార్కెట్లో మంచి పేరు తేవాలని, ఆ పేరుతో మరింత మంది విద్యార్థులు తమ సంస్థల్లో  చేరాలన్న తపనే తప్ప, విద్యార్థుల మానసిక స్థితికి అనుకూలంగా అక్కడ విద్య ఉండదు. ఈ కాలేజీలు అన్నీ జైళ్ళ కన్నా అధ్వానంగా విద్యార్థులపై నియంతృత్వం చలాయిస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. అందుకే ఇవి జైళ్ల ను మరిపించే నిర్బంధ శిబిరాలు గానే అనిపిస్తాయి. రోజుకు 15 గంటలు నిర్బంధంగా తరగతులు నిర్వహిస్తుంటారు. ఆదివారాలు, సెలవుల్లో  కూడా చదువే చదువు.  మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రుల ముందే అవమానించడం లాంటివి ప్రతి నిత్యం ఈ కాలేజీల్లో  జరుగుతున్న తంతు. ఆత్మహత్యలు జరిగినప్పుడే పౌర సమాజం స్పందించడం, ప్రభుత్వాలు కమిటీలు వేసి విచారణ చేయడం నివేదిక పూర్తి చేసి తంతు ముగించడం పరిపాటి అయ్యింది. వాస్తవానికి చైతన్య, నారాయణ  ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల మీద వత్తిడి ప్రతి నిత్యం ఉంటుంది.  తక్కువ మార్కులు వచ్చిన పిల్లలతో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు స్నేహం చేయవద్దని ఒక విద్యార్థిని తన బాధను ఈ మధ్యనే పంచుకుంది. తినే తిండి మీద, విద్యార్థులు వచ్చిన సామాజిక నేపథ్యం మీద ఇలా చాలా అంశాల్లో వివక్షకు గురి చేస్తున్నారని విద్యార్థులతో మాట్లాడితే తెలుస్తుంది. ప్రభుత్వం విద్యా సదుపాయాలు కల్పించకుండా ఇంటర్ ఆ పైన విద్యను ప్రైవేటు కార్పొరేట్లుకు ధారాదత్తం చేసి వాటి పర్యవేక్షణను గాలికి వదిలిన పర్యవసానమే ఈ సంఘటనలకు కారణం. నవోదయ, కేజీబీవీ వంటి ప్రభుత్వ  విద్యాలయలపైనా ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. చిన్న పాటి కారణానికి కూడా బ్యాడ్​ క్యారెక్టర్​ పేరిట విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న సంఘటనలూ ఉన్నాయి.  పర్యవేక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఓ అమ్మాయి ఊరికి వెళ్లి వస్తే, ఆమె పెళ్లి చేసుకుంటుందనే గాలి వార్తతో ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి కేజీవీబీలోనే చేర్చగలిగారు. 

బాలల న్యాయ చట్టం ఏం చెబుతున్నది?

18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఎటువంటి విద్యా సంస్థలలో ఉన్నా కానీ, ఆయా సంస్థలు బాలల హక్కుల విధానాన్ని అనుసరించాలని బాలల న్యాయ చట్టం చెపుతున్నది. ఈ చట్టాన్ని పకడ్బందీగా  పర్యవేక్షించే విధానాన్ని రూపొందించాలి.  జిల్లా బాలల సంక్షేమ కమిటీలు, బోర్డులు ప్రతి జిల్లాలో నెలకొల్పాలి. జిల్లాల్లో ఉన్న ప్రతి సంస్థను తనిఖీ చేయాలి. సంఘటన జరిగినప్పుడే హడావిడి చేసి ఏమి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర స్థాయిలో ఉన్న బాలల హక్కుల కమిషన్ విద్యా సంస్థ యాజమాన్యాలకు ప్రిన్సిపాల్ లకు, సిబ్బందికి తగు శిక్షణను ఏర్పాటు చేయాలి. ప్రతి విద్యాలయంలో విద్యార్థులకు వారి హక్కులను తెలియచేయాలి. హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణులతో ఒక పర్యవేక్షణ కమిటీని వేసి ప్రతి నెలా సామాజిక తనిఖీ నిర్వహించాలి. వత్తిడులకు గురై కాలేజీలు మానివేసిన విద్యార్థుల జాబితాను సేకరించి వారిని తిరిగి కాలేజీలలో చేర్పించాలి.  ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సి ఎం కేసీఆర్ గారు ఆయన మంత్రి వర్గ సహచరులు ఎవరైనా క్షేత్ర స్థాయి లోపాలను ఎత్తి చూపితే ‘ఆడోడు ఈడోడు మొపైనాడు’ అని ఎగతాళి చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఈ సారి అలా దాట వేయకుండా లక్షలాది మంది విద్యార్థుల సమస్యగా గుర్తించి ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టాలి. చివరగా ప్రభుత్వ విద్య మీద బడ్జెట్ లో 20 శాతం నిధులను కేటాయించి అత్యున్నత స్థాయిలో ఇంటర్ విద్యా వ్యవస్థను పటిష్ట పరచడం ద్వారానే ప్రైవేటు విద్యా దోపిడీని అరికట్టి విద్యార్థులను ఈ నిర్భంధ శిబిరాల నుంచి విముక్తి చేయగలమని  గమనించాలి.

స్టూడెంట్లను కార్పొరేట్​ కాలేజీల వైపు నెడుతున్నదెవరు?

ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా పిల్లలను బాగా చదివించడం పట్ల తల్లిదండ్రుల్లో ఆసక్తి విశేషంగా పెరిగింది. పాలకులు దానిని గ్రహించ లేదు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎన్నో ఒడుదుడుకులను అధిగమించి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఇంటర్ చదవడానికి వచ్చేసరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సరిపడా లేని దుస్థితి. ఉన్న కాలేజీలు కూడా అరకొర వసతులు, బోధనా సిబ్బంది సరిపడా లేకపోవడం లాంటి సమస్యలు ఈ పిల్లలకు దర్శనమిస్తున్నాయి. కేవలం వందల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లక్షల సంఖ్యలో పదవ తరగతి పాసై వస్తున్న విద్యార్థులకు సరైన ఇంటర్​ విద్యను అందించలేకపోతున్నాయి. వేల సంఖ్యలో పుట్టు కొచ్చిన ప్రైవేట్ కాలేజీల పైనే అనివార్యంగా ఆధారపడే పరిస్థితికి తల్లిదండ్రులు నెట్టివేయ బడ్డారనేది వాస్తవం.  ప్రభుత్వ కాలేజీలకు రాకుండా,  ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు అని తల్లిదండ్రులను విమర్శించే వాళ్ళు పై విషయం గుర్తించాలి. విద్యార్థుల ఆత్మహత్యల సంఘటన జరిగినప్పుడల్లా ప్రభుత్వ యంత్రాంగం, మేధావి వర్గం తల్లిదండ్రులను తప్పుపట్టడం మనం గమనిస్తుంటాం. ఏ తల్లి దండ్రులూ తమ పిల్లలను నిర్బంధ శిబిరాల్లో చదివించాలను కోరు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పైసా, పైసా కూడ బెడతారు. పస్తులుండైనా సరే వ్యక్తిగత అవసరాలను పక్కకు పెట్టి అయినా సరే నెల నెల చిట్టీలు వేసి చిన్న చిన్న మొత్తాలతో పొదుపులు చేసి ఫీజులకు ఇతర ఖర్చులకు వేలాది రూపాయలు భరిస్తున్నారు.  ఇలా పంపిస్తున్న చిన్న వ్యవసాయ కుటుంబాలు మొదలుకొని చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు, వృతి పనివారు మొదలుకొని మధ్యతరగతి ఆదాయ వర్గాలు  ఉపాధ్యాయులు సహా అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ఈ కళాశాలల్లో చేరుతున్నారు.  ప్రభుత్వ వైఫల్యానికి తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సమంజసం కాదు. ఈ అనర్ధాలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

– ఆర్. వెంకట్ రెడ్డి, జాతీయ కన్వీనర్​ఎం. వి. ఫౌండేషన్