బైడెన్కు పుతిన్ వార్నింగ్..మిసైల్ దాడులుచేస్తే..అణుబాంబు వేస్తాం

బైడెన్కు పుతిన్ వార్నింగ్..మిసైల్ దాడులుచేస్తే..అణుబాంబు వేస్తాం
  • అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 
  • రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్​కు బైడెన్ అనుమతి 
  • అమెరికా నిర్ణయానికి కౌంటర్​గా నిబంధనలు మార్చిన రష్యా 
  • అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసినా ఉమ్మడి దాడిగానే లెక్క 
  • మిత్రదేశం బెలారస్​పై దాడి చేసినా అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్  
  • రష్యాపైకి ఆరు అమెరికా క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్

మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో యురేసియా ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అందజేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్​ను  రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్​కు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతివ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 

బైడెన్ నిర్ణయానికి కౌంటర్​గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని సవరిస్తూ మంగళవారం సంతకం చేశారు. మార్చిన నిబంధనల ప్రకారం.. తమపై భారీ మిసైల్ దాడులు చేస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా ప్రకటించింది. 

‘‘అణ్వాయుధాలు లేని దేశాలైనా సరే.. అణ్వస్త్రాలు ఉన్న దేశాల సాయంతో మాపై భారీ గగనతల దాడులు చేసినా.. లేదంటే ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా.. వాటిని రష్యన్ ఫెడరేషన్​పై జరిగిన ఉమ్మడి దాడిగానే పరిగణిస్తాం. 

ఆ దాడికి కారణమైన దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తాం” అని తమ న్యూక్లియర్ పాలసీని సవరించినట్లు రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ అధికార ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ ప్రకటించారు. అలాగే తమ మిత్ర దేశం బెలారస్​పై భారీ దాడులు చేసినా.. తమపై డాడి చేసినట్టుగానే భావిస్తామని హెచ్చరించారు. 

బైడెన్ నిర్ణయానికి, తమ పాలసీ మార్పుకు సంబంధం లేదని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పాలసీని మార్చుకుంటున్నామని తెలిపారు. అయితే, బైడెన్ అనుమతి నేపథ్యంలో అమెరికా నుంచి ఇదివరకే అందిన లాంగ్ రేంజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై దాడులు చేసింది. 

దీంతో రష్యా తాజా పాలసీ ప్రకారం అణుబాంబులు ప్రయోగిస్తే.. మూడో ప్రపంచయుద్ధానికి దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.    

గగనతల దాడులన్నింటికీ వర్తింపు.. 

రష్యా న్యూక్లియర్ పాలసీని మార్చేందుకు సెప్టెంబర్ లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనే పుతిన్ పలు ప్రతిపాదనలు చేశారు. తాజాగా న్యూక్లియర్ పాలసీని మరింత సరళతరం చేస్తూ రూపొందించిన డాక్యుమెంట్లపై పుతిన్ సంతకాలు చేశారు. 

బాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతర ఎగిరే వాహనాలతో తమ దేశంపై దాడులు చేస్తే.. ప్రతీకారంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తామని తాజా పాలసీలో పేర్కొన్నారు. రష్యన్ భూభాగం లేదా మిత్ర దేశాలపై బాలిస్టిక్ మిసైల్స్ వంటివి ప్రయోగిస్తే అణుబాంబులు వేసేందుకు వీలుగా పాలసీలో కొత్త నిబంధనలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్ అందించిన మిసైల్స్ తోపాటు అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ ను కూడా ఉక్రెయిన్ ప్రయోగించడంతో పశ్చిమ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేలా రష్యా న్యూక్లియర్ పాలసీని పుతిన్ సవరించారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 

అయితే, మరో రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోయి.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ కు అధికారాన్ని అప్పగించాల్సిన తరుణంలో బైడెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యప్తంగా సంచలనం సృష్టించింది.  

రష్యాపై అమెరికన్ మిసైళ్లతో దాడి.. 

అమెరికాలో తయారైన 6 ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్ సిస్టం(ఏటీఏసీఎం) క్షిపణులతో ఉక్రెయిన్ మంగళవారం తమ భూభాగంపై దాడి చేసిందని రష్యా వెల్లడించింది. వాటిలో ఐదు మిసైళ్లను కూల్చివేశామని, మరో మిసైల్ ధ్వంసమైనప్పటికీ.. దాని శకలాలు ఓ మిలిటరీ సైట్ పై పడి మంటలు చెలరేగాయని తెలిపింది. 

ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ఉక్రెయిన్ కు అమెరికా ఇదివరకే ఏటీఏసీఎం లాంగ్ రేంజ్ మిసైల్స్ ను సరఫరా చేసినా.. వాటిని రష్యాపై ప్రయోగించడానికి ఇన్నాళ్లూ అనుమతివ్వలేదు. 

కానీ తాజాగా బైడెన్ ఆ మిసైళ్ల ప్రయోగానికి ఓకే చెప్పడంతో మంగళవారం ఉక్రెయిన్ వాటితో తొలిసారి రష్యాపై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుకు 75 మైళ్ల దూరంలో రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంపై ఈ మిసైళ్లు పడ్డాయి. అయితే, రష్యాపై తమ ఆర్మీ దాడులు చేసిందని, పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. 

కానీ ఆ దాడిలో ఏ మిసైళ్లను ఉపయోగించామన్నది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా వరుసగా మూడో రోజు మంగళవారం కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. హలుఖీవ్ ప్రాంతంపై జరిగిన దాడిలో 12 మంది పౌరులు చనిపోయారని, సుమీ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

యుద్ధానికి వెయ్యి రోజులు..

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి మంగళవారం నాటికి 1000 రోజులు పూర్తయ్యాయి. అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడానికి వ్యతిరేకంగా రష్యా 2022, ఫిబ్రవరి 24వ తేదీన సుమారు 2 లక్షల మంది సైనికులతో దండయాత్ర మొదలుపెట్టింది. 

దీంతో ఆ రోజు నుంచే రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. ఇప్పటివరకూ యుద్ధంలో రెండు వైపులా కలిసి సుమారు 10 లక్షల మంది చనిపోగా, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా.  అలాగే ఉక్రెయిన్ లోని సరిహద్దు పట్టణాలు, సిటీలన్నీ దాదాపుగా నేలమట్టం కావడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.