రైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని? బండి సంజయ్

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని ఎల్లారెడ్డిపేటలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. రైతులను కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయన్నారు. పిడికెడు వడ్లు మిగిలే పరిస్థితి లేదన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపుతున్నారన్నారు. కర్షకులను ఆదుకోవడానికి రూ.150 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన  ఇంతవరకు దాని ఊసే లేదని విమర్శించారు. 

రైతుల ఆత్మహత్యల్లో ప్రథమ స్థానంలో తెలంగాణ...

ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బంది కలుగుతోందన్న ఆయన.. కౌలు రైతులు ఏడుస్తున్నారని, వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. 8ఏళ్లలో ఒక్క రైతును ఆదుకోలేదని అన్నారు. కర్షకులు పడుతున్న కష్టాలను డైవర్ట్ చేయడానికి సచివాలయం ప్రారంభోత్సవం అని హాడావుడి చేస్తున్నారని  ఆరోపించారు. 

రుణమాఫీ చేస్తామని మాట తప్పారు...

ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని  బండి సంజయ్ ప్రశ్నించారు. సబ్సిడీ, ఫ్రీ యూరియా, రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మరిచారని అన్నారు. తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన రూ.3వేల కోట్లు ఏం చేశారో చెప్పాలని కోరారు. కర్నాటకలో ఎన్నికలు జరిగితే... మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తే పాకిస్తాన్ లో ప్రచారం చేస్తారా? అంటూ బండి  వ్యంగ్యస్త్రాలు సంధించారు.