ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితులు విద్య, వైద్యం ప్రాధాన్యతను తెలియచెప్పింది. దీన్ని ఒక అనుభవంగా, గుణపాఠంగా తీసుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి ఉన్నత విద్యను చదువుతున్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 7.5 లక్షల మంది విద్యార్థులు రెన్యువల్ చేసుకుంటూ ఉండగా మరో 5 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకొంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన రూ.3,816 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి పెంచాయి.
ఒకవైపు కరోనా ప్రభావంతో ఉపాధి కరువై బతుకీడుస్తున్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలుద్దామని సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులకు చుక్కెదురవుతోంది. ఇటు తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, అటు యాజమాన్యాలు అడిగే ఫీజులు చెల్లించలేక రీయింబర్స్మెంట్పై ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకు సాక్ష్యమే మొన్న జరిగిన లావణ్య ఆత్మహత్య. ఉప ఎన్నిక వస్తే తప్ప సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తురావడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం విచ్చలవిడిగా హామీల వర్షం కురిపించి.. గెలిచిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టడం నిత్యకృత్యంగా మారింది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక రావడంతో దళితులపై కేసీఆర్ కు ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే దళితుల సాధికారత అంటూ మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలో దళిత బంధు ఒక ఎర మాత్రమే. నిజంగా దళితులు సాధికారత సాధించాలంటే డబ్బులు పంచి పెట్టడం వల్ల కాదు. డబ్బులు సంపాదించుకునేలా వారిని తయారు చేయాలి. గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాలి. అందుకు విద్య, ఉద్యోగాలే కీలకం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో విద్యా రంగానికి నిధులను తగ్గిస్తోంది. దళితులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టింది. ఉద్యోగ ప్రకటనలే తప్ప.. ఖాళీగా ఉన్న 1.91 లక్షల పోస్టుల భర్తీ మాత్రం ప్రభుత్వం చేపట్టడం లేదు. విద్యారంగానికి నిధులు పెంచి, తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి దళితుల సాధికారత లక్ష్యశుద్ధిని సర్కారు నిరూపించుకోవాలి. - గడ్డం శ్యామ్, హైదరాబాద్