కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలపై సరైన వివరణ ఇస్తూ ఒక వైట్పేపర్ద్వారా ప్రజలకు అన్ని వివరాలు తెలపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా దానికి వీలు పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. చివరకు లోకాయుక్తను ఆశ్రయించగా, ఇంజనీర్- ఇన్- ఛీఫ్ కూడా వైట్పేపర్రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. అవినీతి జరగనప్పుడు ప్రజలకు వివరాలు చెప్పడానికి భయమెందుకు?
తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సాగు నీరు అందించేందుకు జలయజ్ఙంలో భాగంగా అప్పటి ప్రభుత్వం 2005 డిసెంబర్14న జీవో నెం.229 జారీ చేస్తూ సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా వ్యాప్‌కోస్ సంస్థను కోరింది. ఈ ప్రాజెక్టుకు అంబేద్కర్ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేశారు. వ్యాప్‌కోస్ సంస్థ రెండేండ్లలో ఏడు జిల్లాల పరిస్థితి, నీటి లభ్యత తదితర విషయాలను కూలంకషంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాంతం నుంచి160 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవచ్చు. ఇందుకు నదిపై ఎలాంటి ఆనకట్ట అవసరం లేదు. ఈ ప్రాజెక్టు “రన్ అప్ ది రివర్”(పారుతున్న నదిలో నుంచి ఎత్తిపోతల ద్వారా నీటి సేకరణ) అని తెలుపుతూ,160 టీఎంసీల నీటితో12.2 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించవచ్చని, దీనికి మొత్తం రూ.17,875 కోట్ల మేర ఖర్చు వస్తుందని సంస్థ పేర్కొన్నది. వ్యాప్కోస్ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టుపై ప్రభుత్వం చీఫ్ఇంజనీర్ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి క్షుణ్నంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. అప్పటి చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలోని కమిటీ మొత్తం ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి అది బాగుందని, దాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పుడు ప్రభుత్వం 2007 మే 16న జీవో నెం 124 ద్వారా డా.బీఆర్అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి తట్టెడు మట్టి కూడా తీయక ముందే 2008లో మళ్లీ ఆ ఇంజనీర్లే వ్యాప్ కోస్ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదని తెలిపింది. తుమ్మిడిహెట్టి వద్ద ఒక బ్యారేజి నిర్మించి, ఇంకో 4 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించవచ్చని, దానికి రూ. 38,500 కోట్లు అవుతుందని చెప్పారు. ఇలా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 17,875 కోట్ల నుంచి రూ. 38, 500 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత మరిన్ని కారణాలు చెబుతూ ఆ మొత్తాన్ని రూ. 40, 300 కోట్లకు పెంచారు. ఈ మేరకు 2008 డిసెంబర్17న జీవో నెం 238 ద్వారా ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను 28 భాగాలుగా విభజించి పనులు మొదలుపెట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా, చివర నుంచి అంటే చేవెళ్ల నుంచి పంట కాలువల తవ్వకం మొదలు పెట్టి 2014 నాటికి సుమారు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పనులు మొదలు కాకుండా కాలువలు తవ్వడమేంటని విమర్శలు రాగా, నాగార్జున సాగర్ డ్యాం కట్టి చాలా ఏండ్లుగా నీటిని నిల్వ చేసినా పంట కాలువలు లేక నీటిని వాడుకోలేకపోయామని, అందుకే డా. బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టులో పంట కాలువల తవ్వకం మొదలు పెట్టామని అప్పటి ప్రభుత్వం విడ్డూరమైన వివరణ ఇచ్చింది.
స్వరాష్ట్రంలో ప్రాజెక్టు పేరు మార్చి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తుమ్మిడిహెట్టిపై నిర్మించే బ్యారేజీపై వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మారుస్తూ, రీ ఇంజనీరింగ్ పద్ధతిలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే కేంద్రం అనుమతుల కోసం పంపినప్పుడు మాత్రం ప్రభుత్వం ఎలాంటి డీపీఆర్ లేకుండా పాత ప్రాజెక్టుకు కొద్ది మార్పులు చేర్పులు చేశామని కేంద్రానికి తెలిపింది. రాష్ట్రంలో మాత్రం ఇది కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టు అని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి రకరకాల విమర్శలకు గురైంది. వాటిలో ముఖ్యమైనవి పారదర్శకత లోపించడం, అంచనాలకు మించి ఖర్చు జరగడం, అవినీతి ఆరోపణలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టు పేరు మార్చిన ప్రభుత్వం, వివిధ చోట్ల రిజర్వాయర్లు పంపు హౌజ్‌ల నిర్మాణం చేపట్టి ఎత్తిపోతల ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతున్నది. అయితే ఈ మొత్తం ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత లోపించడంతో కాళేశ్వరంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరగా వీలుపడదని చెప్పింది. చివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఐ) కూడా వైట్‌పేపర్ రిలీజ్ చేయడానికి అంగీకరించ లేదు. పైగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాళేశ్వరంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనవసర పేచి పెడుతున్నదని లోకాయుక్త ముందు సన్నాయి నొక్కులు నొక్కింది. సమాచారహక్కు చట్టం ద్వారా ప్రాజెక్టు నిర్మాణ సమాచారం కోరగా.. ప్రాజెక్టు అంచనా రూ.80,200 కోట్ల అని, అందులో ఇప్పటి వరకు రూ.62 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు పూర్తయితే 18.25 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొంది. అయితే జరిగిన ఖర్చు లక్ష కోట్ల పైనే ఉందని ఇంకా 30 నుంచి 40 వేల కోట్ల వరకు ఖర్చు జరిగే అవకాశముందని అందులో పనిచేస్తున్న కొందరు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
- ఏదైనా ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు దాని కాస్ట్, బెనిఫిట్ అనాలసిస్ (ఖర్చు, లాభాల ఉజ్జాయింపు) చేస్తారు. అంటే ఒక రూపాయి ఖర్చు చేస్తే, రూపాయి యాభై పైసల లాభం రావాలి. ఇది కేంద్ర జల సంఘం వారి కొలమానం. కాళేశ్వరంపై ఇంతవరకు ఇటువంటి పరిశీలన జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక ఎకరానికి సాగు నీరు అందించడానికి సుమారు 6 లక్షలు(ప్రాజెక్టు నిర్మాణ) ఖర్చు చేస్తున్నట్లు ప్రాథమిక అంచనా.
- ఏటా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ల కింద ఎకరాకు నీరు అందించేందుకు నామ మాత్రం ఖర్చు అవుతున్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకొని సాలీన ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేల(నిర్వహణ వ్యయం) వరకు ఉంటుంది.
- కాళేశ్వరం ఖర్చు ఎంత?, ఇంకా ఎంత కావాల్సి ఉన్నదనేది ప్రజలకు తెలియాలి.
- కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, దానిపై సాలీన చెల్లించాల్సిన వడ్డీ వివరాలు చెప్పాలి.
- 2007లో రూ.17,875 కోట్లతో తయారు చేసిన నివేదిక తొలుత బాగుందన్న ఇంజనీర్లు ఏడాది తిరుగక ముందే బాగాలేదని దాని ఖర్చును రూ.40,300 కోట్లకు పెంచడంపై వివరణ కావాలి. మళ్లీ ఆ ఇంజనీర్లే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లకు పైబడి ఖర్చు చేయడం ఎందుకు ?
- కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఇంజనీర్ల పాత్ర ఎంత ఉన్నదనేది తేలాలి.
- కొందరు ఇంజనీర్లు ఉద్యోగ విరమణ చేసినా, ఇంకా ప్రాజెక్టు పనులకు సలహాదారులుగా అజమాయిషీ చేయడంలో మతలబు ఏమిటి ?
- రెండు మూడేండ్లుగా బాగా వర్షాలు పడుతున్నాయి. చెరువులు, కుంటలన్నీ నిండాయి. వాటి కింద ఉన్న పొలాల్లో నీరు ఉబికి వస్తున్నదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మూడో పంపు బిగించే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నం నిధులు ఖర్చు చేసేందుకేనా?
- కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంపై గుదిబండగా తయారుకాకుండా ఉండాలంటే అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగాలి.
- ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టులో కాలువలు తవ్వడానికి అయిన రూ.8 వేల కోట్లు వృథా అయినట్లేనా? దీనికి బాధ్యులెవరు ?
- మొన్న గోదావరి వరదలో పంపు హౌజ్‌లు నీటిలో మునిగి మోటార్లు పాడయ్యాయి. ఆ నష్టమెంత? దానికి బాధ్యులెవరు అన్న విషయాలు ప్రజలకు తెలియాలి.
- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకు విరుద్ధం కాదు. అయితే ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత, జవాబుదారీపై ప్రజలకు అవగాహన కోసం ఒక వైట్‌పేపర్ రిలీజ్ చేయాలని కోరుతున్నది.
- ఎం. పద్మనాభరెడ్డి,కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్