'వన్ నేషన్.. వన్ ఎలక్షన్..' జమిలి ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి.. 2027లోనే జమిలి ఎన్నికలు రావొచ్చనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాయింట్ పార్లమెంటరీకి ఈ బిల్లు పంపింది. అంతేనా.. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యింది కేంద్రం.
ఇక్కడే ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు అమల్లోకి రావాలంటే.. అంతకంటే ముందే ఆరు అంశాలపై రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం సమయంలోనే.. ఆ ఆరు అంశాలకు సంబంధించి.. రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఓకే చెప్పాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అంశాలు:
>>> లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.
>>> ఎమర్జన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరణ చేయడం.
>>> లోక్‌సభను రద్దు చేసే.. రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి)ని సవరణ చేయాలి.
>>> రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు ఉండే ఆర్టికల్ 174 (2) (బి)కి సవరణ చేయాలి.
>>> రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ చేయాలి.
>>> ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1957, 1962, 1967లో జరిగినవి జమిలి ఎన్నికలే. దేశం మొత్తం ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. 1980లోనే జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ సైతం జమిలికి జై కొట్టింది. అయినా అమలు సాధ్యం కాలేదు. ఆ తర్వాత మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతోంది, 2014 బీజేపీ మేనిఫెస్టోలో జమిలి హామీ ఉంది. ఇప్పుడు ఆ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. సో.. దీనికి పెద్దగా సమస్య ఉండదు.
ALSO READ | వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ అమోదం
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే.. 2027లోనే జమిలి ఎన్నికలు పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు.