- పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తే .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎవరడ్డుకుంటారనే అనే ధీమాతో పెట్రోలు, సిలిండర్లతోపాటు అన్ని రకాల ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, పలువురు గ్రాడ్యుయేట ఓటర్లతో మాట్లాడారు. బీజేపీ సర్కార్ సిలిండర్ ధరను .. పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారం పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. 2004లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కు 110 డాలర్లు ఉంటే అప్పట్లో పెట్రోలు ధర లీటర్ 70 రూపాయలు ఉండేదని.. కానీ అదే అంతర్జాతీయ ముడి చమురు ధర 56 డాలర్లు ఉంటే పెట్రోలు, డీజిల్, సిలిండర్ ధరలన్నీ తగ్గించాల్సిందిపోయి అన్ని ధరలు పెంచేశారని, ఇప్పుడు పెట్రోలు ధర లీటర్ 100 రూపాయలకు పెంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సి ఉండగా.. ధరలు బాగా పెంచేశారని, పెట్రోల్ లో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఒక్క పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల సమాజంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా మోదీ ధరలను పెంచుకుంటూనే పోతున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ ల వల్లనే ఇలా ధరలు పెరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఏ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు సీటు ఇవ్వలేదు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఏ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు సీటు ఇవ్వలేదు, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈసారి ఓ గిరిజనుడికి అవకాశం కల్పించిందని, రాములు నాయక్ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో రాములు నాయక్ చిత్తశుద్ది తో పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశ ధోరణి నచ్చక టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. అన్ని పార్టీలు రెడ్లకే సీట్లు ఇచ్చాయని, ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎస్టీ కి టికెట్ ఇచ్చిందనే విషయాన్ని అన్ని వర్గాలు గుర్తించి ఆదరించాలని ఆయన కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతికత లేదని, ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు గ్రాడ్యుయేట్ల కోసం, నిరుద్యోగుల కోసం పని చేయలేదని, కేవలం డబ్బుల సంచులు .. లిక్కర్ బాటిల్స్ తో మళ్లీ ఎమ్మెల్సీ గా గెలవాలని పల్లా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందని, కోదండరాం కు ఓటు వేస్తే అది ఉపయోగం లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని, కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక నిరుద్యోగులను విస్మరించారని, టీఎస్పీఎసి లో 19 లక్షల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు గా ఉండటానికి కేసీఆర్,మోదీ లే కారణమని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ భృతి పై కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, 3016 రూపాయలు 2 ఏళ్ల నుంచి బకాయిలు బ్యాంకులో వేసిన తర్వాతే టిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగాలని, గత రెండేళ్ల బకాయిల తో సహా ఇప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్ కోసం మండలిలో కాంగ్రెస్ పోరాడుతుందని, మోదీ పాలనలో కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు .. ఉన్న ఉద్యోగాల ఉడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేవలం మత పరమైన రాజకీయాలతో నే లబ్ది పొందాలని చూస్తున్నారు, రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడే బీజేపీ భద్రాచలం రాముల వారి భూములు ఆంధ్రాకు పోతుంటే ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ దంపతులను నడి రోడ్డు పై నరికి చంపితే కేసీఆర్ ఇంత వరకు స్పందించలేదు.. ఇంత దారుణం గతంలో ఎన్నడూ జరుగలేదు, వంగ వీటి హత్యతో రాష్ట్ర రాజకీయాలు ఎలా మారాయో .. ఈ అడ్వకేట్ దంపతుల హత్యతో తెలంగాణ లో రాజకీయాలు మారబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, టిఆర్ఎస్ లో అరాచక శక్తులుగా మారిపోయాయన్నారు. పార్టీ బాధ్యతాయుత పదవుల్లో ఉండి పార్టీ కోసం పని చేయకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో పోరాటానికి నేను సిద్ధం.. కేటీఆర్ సిద్ధమా ?