- వ్యాపారాలు దెబ్బతింటయ్.. ఉపాధి అవకాశాలు పోతయ్
- బీపాస్ కావాల్నా..? కర్ఫ్యూ పాస్ కావాల్నా.. ?
- వరద సాయం మీద కిరికిరి పెట్టిన్రు నా కొడుకులు
- దేశ గతిని నేను మార్చుతానంటే ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు
- నన్ను అడ్డుకోవడానికే వరదలా వస్తున్నరు.. ఫ్రంట్ పెడ్తానని చెప్పిన్నా
- నన్ను పుబ్బలో పోతవన్నోడే మాయమైపోయిండని కామెంట్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవకపోతే హైదరాబాద్ ఆగమైతదని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోతుందని, భూముల ధరలు తగ్గిపోతాయని, వ్యాపారాలు నిలిచిపోతాయని నగర ప్రజలను భయపెట్టారు. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, నగర భవిష్యత్ దెబ్బతింటుందని హెచ్చరించారు. ‘‘భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసే బీపాస్ కావాల్నా..? నగరంలో కల్లోలం చెలరేగే కర్ఫ్యూ పాస్ కావాల్నా.. ?’’ అని బిల్డర్లను ప్రశ్నించారు.
శనివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు. గంటసేపు సాగిన తన ప్రసంగంలో ఇప్పటికే ఉన్న పథకాలను చెప్పుకోవటంతో పాటు తమకు ఓటెయ్యకపోతే సిటీ ఆగమైపోతుందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గంటగంటకూ పరిస్థితి మారుతోందని, టీఆర్‌ఎస్ బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నదని చెప్పారు. నగరం శాంతియుతంగా ఉంటేనే వ్యాపారాలు సజావుగా సాగుతాయని, ఉద్యోగాలు వస్తాయన్నారు. ‘‘మనం ఇల్లు కట్టుకోవాలంటే ప్రశాంతమైన కాలనీ చూసుకుంటం.. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది కాబట్టే వెల్లువలా పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు వస్తున్నయ్. నూరు శాతం శాంతి సామరస్యం పరిరక్షణ చేసుకోవాలె.. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలె. పూలబొకేలాంటి హైదరాబాద్ ఉండాలె.. ఇంట్ల ఉడుములు సొచ్చినట్టు పక్కరాష్ట్రపోడు వచ్చి తియ్యగ పుల్లగ మాట్లాడుతడు.. వానిది నెత్తా కత్తా! వానిది ఏం పోతది? ఇక్కడ ఎవ్వలు ఉంటరు? వంచకులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దు. జిమ్మిదార్ ఉన్న మంత్రులు ఇక్కడ ఉన్నరు. నేనూ ఉంట. మహారాష్ట్రోడు, ఉత్తరప్రదేశోడు చెప్పిన మాటలతో పిచ్చి ఆవేశానికి, ప్రేలాపనలకు ఆకర్షితులైతే హైదరాబాద్ ఆగమైతది. పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతయ్. నగర భవిష్యత్ పోతది’’ అని హెచ్చరించారు.
వరదలా తరలి వస్తున్నరు
దేశం గతిని మార్చేందుకు తాను బయల్దేరుతా ఉంటే ఢిల్లీలో గజగజ వణుకుతున్నారని, తనను అడ్డుకోవాడనికే వరదలా బీజేపీ నాయకులు తరలివస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. దేశానికి సరైన పాలన అందించడంలో కాంగ్రెస్, బీజేపీ ఫెయిలయ్యాయనే నిజాలను ప్రజలకు చెప్పినందుకే ఢిల్లీ పాలకులు తనపై కత్తి కట్టారని అన్నారు. దేశంలో కొత్త ఆవిష్కరణ జరగాలని, ఈ రాజకీయాలు పోవాలని కోరుకున్నానని చెప్పారు. ‘‘ఇది మున్సిపల్ ఎలక్షనా.. నేషనల్ ఎలక్షనా..? ఒక్క బక్క కేసీఆర్‌ను కొట్టేటానికి ఇంతమందా? జోగడు.. బాగడు.. జోకేటోడు.. ఎంత మంది వస్తరు? ఎందుకు గజగజ వణుకుతున్నరు? ఎందుకు మంత్రాంగం చేస్తున్నరు?” అని ప్రశ్నించారు.
నేను ఫ్రంటు పెడ్తానని చెప్పిన్నా?
‘‘దేశంలో కొత్త పంథా రావాలె. ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు? ఈ రాజకీయాలు పోవాలె అని నేను ఒక నినాదం చెప్పిన. కొందరు… ‘నీకు ఫ్రంటు లేదు, స్టంటు లేదు’ అన్నరు. ఎవడు చెప్పిండు.. ఫ్రంటు పెడుతా అని నేను చెప్పిన్నా?” అని కేసీఆర్ అన్నారు. తాను దేశంకోసం బయల్దేరితే ఎట్ల వెళ్తనో ఈ రాష్ట్రానికి తెలుసు, దేశానికి తెలుసని చెప్పారు.
నన్ను అట్ల అన్నోడే మాయమైపోయిండు
‘‘నేను తెలంగాణ తెస్తానని బయల్దేరినప్పుడు కూడా ఇట్లనే అన్నరు. నన్ను మాయమైపోతవ్, మఖలో పుట్టి పుబ్బలో పోతవన్నోడు మాయమైపోయిండు.. నేను పోలె” అని కేసీఆర్ చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశం గతిని మార్చే ఎన్నికలు కావాలన్నారు. 40 కోట్ల మంది పాలసీదారులు, 30 లక్షల కోట్ల ఆదాయం, ఆస్తులున్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీ సీఎం యోగీకే ఠీకాణా సక్కగ లేదు. గ్రోత్‌లో 28వ స్థానంలో ఉన్న ఆయన మనకు నీతులు చెప్తున్నడు. తెలంగాణ వచ్చినప్పుడు 13వ స్థానంలో మన గ్రోత్ ఉంటే.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర దస్ నంబర్‌లో ఉంది” అని కేసీఆర్ అన్నారు.
డిసెంబర్ 7 నుంచి వరద సాయం
వరద సాయం అందని వారికి డిసెంబర్ ఏడో తేదీ నుంచి పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు. ఇప్పటికే 6.5 లక్షల మందికి రూ.650 కోట్లు పంపిణీ చేశామని, ఇంకో 2, 3 లక్షల మందికైనా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సాయం చేయడానికి ప్రభుత్వం వెనక్కిపోదని చెప్పారు. ప్రధానిని రూ.1,350 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇయ్యలేదన్నారు.
తొడగొట్టి భగీరథ ప్రారంభించినం
మిషన్ భగీరథ అద్భుతమైన, అనన్య సామాన్యమైన పథకమని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తొడగొట్టి ప్రారంభించిన పథకమిది.. ఐదేండ్లలో పూర్తి చేయకపోతే ఓట్లడగమని చెప్పిన మగతనం ఉన్న పార్టీ టీఆర్‌ఎస్. ఇప్పుడు ట్యాంకర్ల కాడ నీళ్ల పోరాటాలు.. వీధి పంచాయితీలు లేవు. నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీళ్లు తేవాలనేది కేసీఆర్ కల. ఫ్రీగా వాటర్ సప్లయ్ చేసేది దేశంలో ఎక్కడా లేదు.. ఒక్క ఢిల్లీలో ఉన్నది, సెకండ్ మన హైదరాబాద్లనే. 90 శాతం మంది ప్రజలకు ఇది వర్తిస్తది.. అపార్ట్‌మెంట్లకు కూడా ఫ్రీగా 20 వేల లీటర్ల నీళ్లిస్తం’’ అని అన్నారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేశామని, ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు అందించే బాధ్యత తనదని చెప్పారు. ‘‘కరోనాతో రాష్ట్రానికి రూ.52 వేల కోట్ల నష్టం వచ్చింది. కానీ సంక్షేమం ఆపలె. ఏటా రూ. 40 వేల కోట్లతో సంక్షేమం చేస్తున్నం. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నరు. ధాన్యం రాశులతో తెలంగాణ కళకళలాడుతున్నది. ప్రభుత్వం ఏం చేస్తున్నది పండుకున్నదా.. నిద్రపోయిందా.. ఎవరికోసం తపన పడుతున్నది. ఆలోచించాలె. అలవోకగా.. గాలి వాటంగా ఓటు వేయకూడదు. ఎవలకు ఎలాంటి కర్రు కాల్చివాతపెట్టాల్నో , ఎవలకు బుద్ధి చెప్పాల్నో చెప్పాలె’’ అని అన్నారు.
చేయాల్సిన పనులు చాలా ఉన్నయ్
హైదరాబాద్ అశాస్త్రీయంగా పెరిగిందని.. బస్తీలు, వాడలు, కాలనీలు వెలిశాయి గానీ సౌకర్యాలు లేవని కేసీఆర్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి 60, 70 వేల కోట్లు పెట్టినం. హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నయ్. కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలె.. జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ను భారీగా గెలిపించండి.. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తుంది’’ అని అన్నారు. మురికిగా మారిన మూసీని గోదావరితో అనుసంధానం చేసి అందమైన మూసీని తయారు చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ మంచివారికి, సేవాగుణం ఉన్నవారికి టికెట్లు ఇచ్చిందన్నారు. గత ఎన్నికల్లోకంటే ఇంకో ఐదారు సీట్లు ఎక్కువిచ్చి దీవించాలని కోరారు.
వరద సాయం మీద కిరికిరి పెట్టిన్రు నా కొడుకులు
హైదరాబాద్‌లో వరద టైంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాళ్లలోతు నీళ్లలో తిరుగుతుంటే తాను కండ్లారా చూశానని, సర్టిఫికెట్లు తడిసిన బిడ్డలను చూసి, నీళ్లల్లో తేలుతున్న మంచాలను చూసి తన కండ్లల్లో నీళ్లు తిరిగాయని కేసీఆర్ చెప్పారు. ‘‘ఎవడూ ధర్నా చేయలె.. దరఖాస్తు చేయలె.. నా అంతట నేను పేదలకు సాయం చేయాల్నని ఇంటికి పదివేలు పంపించిన. ఇట్ల ఎక్కడన్నా ఇచ్చిండ్రా..? ఢిల్లీల, బొంబైలో ఇయ్యలే. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలించే కాడా ఇయ్యలె. ఈడమాత్రం కిరికిరి పెట్టిన్రు నా కొడుకులు. ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా రూ. 650 కోట్లు ఇచ్చినమా లేదా? ఇదివరకు వరదలు రాలేదా.. ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రయినా ఇచ్చిండా.. ఇట్ల? ఒకడు పత్రం రాస్తడు.. ఒకడు ఉత్తరం రాస్తడు.. నేను రాయలేదు అంటడు.. ఈసీని ఇబ్బంది పెట్టి వరద సాయం బంజేపిచ్చిండ్రు’’ అంటూ మండిపడ్డారు.