గ్రేటర్ ఓటర్లకు ఆఫర్లు.. ఆధార్ కార్డ్ కు రూ.10 వేలు

గ్రేటర్ ఓటర్లకు ఆఫర్లు.. ఆధార్ కార్డ్ కు రూ.10 వేలు
  • ఫోన్​ నంబర్లు తీసుకుని పైసలిస్తున్న లీడర్లు
  • పుట్టినరోజులు, పెండ్లిరోజుల పేర్లతో దావతులు, రిటర్న్​ గిఫ్టులు
  • కాలనీలకు, అపార్ట్​మెంట్లకు స్పెషల్​ ప్యాకేజీలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ ఎలక్షన్లలో ఓటు కోసం నోట్ల పంపిణీ జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు గట్టిగా పోటీ నెలకొనడంతో కొందరు క్యాండిడేట్లు భారీగా డబ్బుల పంపిణీ మొదలుపెట్టిన్రు. రెండు వేలు, మూడు వేలు కాదు.. ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నరు. బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ ఓటర్ల ఆధార్​కార్డులు, ఫోన్​ నంబర్లు తీసుకుంటున్నరు. వరద సాయం అందలేదని నిలదీస్తున్న వాళ్లందరికీ ‘ఇప్పటికి ఇదే వరద సాయం అనుకోండ్రి, ఓట్లు మాత్రం మాకే వేయండి’ అంటూ పది వేలు చేతిల పెడుతున్నరు.  కొందరైతే గూగుల్​పే, పేటీఎం వంటి ద్వారా ఆన్​లైన్​లో పైసలు పంపుతున్నరు. ఇంకొన్నిచోట్ల పుట్టినరోజులు, పెళ్లిరోజులు అనుకుంట దావతులు పెట్టి.. ఓటర్లకు పెద్ద పెద్ద రిటర్ను గిఫ్టులు పంచుతున్నరు. ఏమైనా మాకే ఓటేయాలనుకుంట మాట తీసుకుంటున్నరు. ఎట్లయిన గెలవాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నరు.

ఎలక్షన్​ గరమెక్కడంతో..

గ్రేటర్​ హైదరాబాద్​ ఎలక్షన్లను అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం గరం గరంగా మారింది. ఇటీవల హైదరాబాద్​లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందిపడ్డ జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓట్ల కోసం వెళ్తున్న నేతలను గట్టిగా నిలదీస్తున్నారు. వరద బాధితులకు సాయంగా సర్కారు మొదలుపెట్టిన రూ.10 వేల పంపిణీలో అక్రమాలు జరగడం, అసలైన బాధితులు తమకు సాయం అందలేదంటూ ఆందోళనలకు దిగడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. ఇలాంటి పరిస్థితిలో ఓట్లు అడగడానికి బస్తీల్లోకి వెళ్తున్న నేతలు.. వరద సాయం పేరిట ఓట్ల కొనుగోళ్లకు తెరలేపుతున్నారు. క్యాండిడేట్ల అనుచరులు ఓటర్లకు పదివేల రూపాయల చొప్పున పంచుతున్నారు. ఎవిడెన్స్​ కింద ఆధార్​ కార్డు, ఇతర డీటైల్స్​ తీసుకుని.. తమకే ఓటేయాలని ఒట్టేయించుకుంటున్నారు.

సిటీ అంతటా ఇట్లనే..

రామంతాపూర్  ఏరియాలో వరద సాయం అందని వారికి తామే పరిహారం సొమ్ము ఇస్తామని.. తమకే ఓటేయాలని కొందరు ఓటర్లకు గాలం వేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని నీట మునిగిన ప్రాంతాల్లో క్యాండిడేట్ల అనుచరులు ఇంటికి రూ.10వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. తపోవన్‌‌ కాలనీ, వికాస్‌‌ నగర్‌‌, బాగ్‌‌ అంబర్‌‌ పేట, బతుకమ్మ కుంట ప్రాంతాల్లోనూ ఇలాగే డబ్బులు పంచినట్టు చెప్తున్నారు. కొందరు క్యాండిడేట్లు మాత్రం పదివేలు ఇస్తామని ఒప్పుకొంటున్నా ఒకేసారి డబ్బులివ్వట్లేదు. ఓటర్ల దగ్గర ఆధార్‌‌ కార్డులు తీసుకుని.. నాలుగైదు వేలు చేతిలో పెడ్తున్నారు.  గెలిచాక మిగతా సొమ్ము ఇస్తామని, సర్కారు నుంచి వరద సాయం డబ్బులు కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. అమీర్‌‌పేట, రామంతాపూర్‌‌, అంబర్‌‌పేట, ఉప్పల్‌‌, సరూర్‌‌నగర్‌‌, బైరామల్‌‌గూడ, చంపాపేట ప్రాంతాల్లో క్యాండిడేట్ల అనుచరులు తమ దగ్గర ఆధార్‌‌ కార్డులు తీసుకొని వెళ్లారని.. 4 రోజుల తర్వాత పైసలు ముట్టజెప్తామని చెప్పారని అక్కడి వారు చెప్తున్నారు. మరికొన్ని చోట్ల ఆధార్​కార్డు, బ్యాంకు అకౌంట్​ డీటైల్స్, ఫోన్​ నంబర్లు తీసుకుంటున్న క్యాండిడేట్లు.. నేరుగా బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయిస్తామని చెప్తున్నారు.

మాకు ఓటెయ్యకుంటే వరద సాయం రాదు!

కొన్ని డివిజన్లలో క్యాండిడేట్లు డబ్బుల పంపిణీతోపాటు ఓటర్లపై మరికొన్ని రకాలుగా కూడా ఒత్తిడి తెస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. తమకు ఓటేయకుంటే వరద సాయం అందకుండా చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయని అంటున్నారు. మీసేవలో అప్లై చేసుకున్నా కూడా తమకు ఓటేయకుంటే బ్యాంకు అకౌంట్లలో పైసలు పడవని కొందరు క్యాండిడేట్లు అంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది.