నీటిని నిర్లక్ష్యం చేస్తే..  నిర్జీవ గ్రహమే!

సృష్టిలో సకల చరాచర జీవరాశుల మనుగడ నీటిపై ఆధారపడి ఉన్నది. ప్రాణికోటికి జలం అత్యంత ఆవశ్యకం. మనుషుల చర్యల వల్ల నీటి కాలుష్యం, వృథా పెరుగుతున్నాయి. దీన్ని నివారించకపోతే.. సమీప భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఆయా దేశాల్లో లక్షల మందికి పరిశుభ్రమైన నీరు దొరకడం లేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయ రంగంలోనూ ఇంకా పాత కాలపు పద్ధతులను అనుసరించడం వల్ల నీటి వృథా జరుగుతూనే ఉంది. బిందుసేద్యం లాంటి ఆధునిక విధానాలు అవలంబించాలి. తాగునీరు, సాగు నీటి వినియోగం విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. నీటి వాడకం పట్ల ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే అనతి కాలంలోనే నీరులేక అత్యంత దారుణమైన పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. 

నీళ్ల కోసం పోరాటాలు..
ఇప్పటికే మానవ తప్పిదాలతో ఏకైక సజీవ గ్రహమైన భూమి విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. 
వాతావరణ మార్పులతో, కాలుష్య కారకాలతో మానవ జీవనం ఆందోళనకరంగా మారింది. 
యుద్ధాలతో, అశాంతితో, ఆకలితో, అధిక జనాభాతో, రోగాలతో, ప్రకృతి బీభత్సాలతో మానవ మనుగడ అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రాణాధారమైన నీరు కూడా కలుషితం, వృథా అవుతుండటం మానవాళి ఉనికికే ప్రమాదం. 7.8 బిలియన్ల ప్రస్తుత ప్రపంచ జనాభా భవిష్యత్తులో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.పెరిగిన జనాభాతో పాటు వారి అవసరాలకు సరిపడా వనరులను పెంచలేం. జనాభా పెరుగుదల ఫలితంగా ప్రకృతిని విధ్వంసం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సహజ వనరులు తరిగిపోతున్నాయి. నీటి అవసరాలు పెరిగి.. లభ్యత తగ్గుతోంది. 2040–-50 మధ్యకాలంలో నీటికోసం దారుణమైన పోరాటాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నీటి లభ్యత తగ్గి మరికొద్ది దశాబ్దాల్లో మానవ మనుగడ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. భూమిపై మనకు దొరికే 2.5 శాతం  నీటివనరులతోనే అన్ని అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మేలు. మన దేశంలో 6 కోట్ల మందికి పైగా ప్రజలు సరైన నీరు లేక బాధపడుతున్నారు. కొన్ని చోట్ల అందుబాటులో నీరు ఉన్నా.. కలుషితం అవుతుండటంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికీ భారతదేశంలో ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు లేకుంటే పంటల ఉత్పత్తి తగ్గి దేశ ఆర్థికపరిస్థితి, ఆహార భద్రతపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణుల హెచ్చరిక.
పరిశుభ్రమైన నీరు కావాలి
 నాణ్యతా పరమైన తాగు నీటి వినియోగంలో నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. అంతర్జాతీయ సంస్థలు జరిపిన సర్వే గణాంకాలను బట్టి నీటి నాణ్యతా ప్రమాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 3.1శాతం మరణాలకు నీటి నాణ్యతా లోపమే కారణం. పురుగు మందుల అవశేషాలతో, భార లోహాలతో తాగునీరు ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళనకరం. పరిమితమైన జల వనరుల వల్ల ప్రపంచంలోని పేద దేశాలు భవిష్యత్తులో తీవ్ర నీటి సమస్య ఎదుర్కోబోతున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న దృష్ట్యా, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.1992లో బ్రెజిల్ లోని రియో డిజెనీరో"లో నిర్వహించిన ఓ సదస్సులో యూఎన్​వో నీటి ఆవశ్యకతను గుర్తించి ఓ తీర్మానం ఆమోదించింది. 
పొదుపుపై దృష్టి పెట్టాలి..
పరిశుభ్రమైన నీటి కోసం ప్రపంచ దేశాలన్నీ పని చేయాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం, నీటి వృథాను అరికట్టడంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వ్యవసాయంలో శాస్త్రీయ దృక్పథం పెంచుకుని, బిందుసేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆధునిక ప్రపంచంలో కలుషిత నీటి వాడకం మానవ విజ్ఞానానికే తలవంపులు. ఇకనైనా ఈ దుస్థితి మారాలి. ప్రతి నీటిబొట్టు విలువైనదే. దాన్ని ఒడిసి పట్టాలి.
 

    భారతదేశంలోని మొత్తం దీవులు 247
    వీటిలో బంగాళాఖాతంలో 204 దీవులు, అరేబియా సముద్రం, మన్నార్​ సింధుశాఖలో 43 దీవులు ఉన్నాయి.
    ఈ దీవులను అగ్నిపర్వత దీవులు, ప్రవాళభిత్తిక దీవులుగా విభజించారు. 
    అండమాన్​ నికోబార్​ దీవులు అగ్నిపర్వత సంబంధిత దీవులు
    ఈ దీవులు సరళాకృతిని కలిగి ఉండి వీటి ఉపరితలం ఎగుడు దిగుడు భూ స్వరూపాన్ని కలిగి ఉంటాయి.
    అండమాన్ నికోబార్​ దీవులు నైరుతి, ఈశాన్య రుతుపవనాల మార్గంలో ఉండటం వల్ల జూన్ నుంచి సెప్టెంబర్​ వరకు అధిక వర్షపాతం సంభవిస్తుంది. 
    ఈ దీవుల్లో సుమారు 90శాతం భూభాగం దట్టమైన అడవులతో కూడుకొని ఉంటుంది. 
    ఈ దీవుల మొత్తం వైశాల్యం 8249 చ.కి.మీ. ఇందులో అండమాన్ దీవుల వైశాల్యం 6596 చ.కి.మీ.
    అండమాన్​ దీవులను గ్రేట్​ అండమాన్​, లిటిల్ అండమాన్ గా విభజించవచ్చు. 
    గ్రేట్​ అండమాన్​ను ఉత్తర అండమాన్​, మధ్య అండమాన్​, దక్షిణ అండమాన్​ దీవులుగా విభజించవచ్చు. 
    ఉత్తర అండమాన్​లో ఉన్న అగ్ని పర్వతం – నార్కొండం (విలుప్త అగ్నిపర్వతం)
    దక్షిణ అండమాన్​లో ఉన్న అగ్ని పర్వతం – బారెన్​ (క్రియాశీల అగ్నిపర్వతం)
    ఉత్తర అండమాన్​లో హురియత్​ పర్వతాల్లో గల అతి ఎత్తయిన పర్వతం సాడిల్​ పీక్​ (732 మీటర్లు)
    అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్​ (దక్షిణ అండమాన్​) 
    అండమాన్​ దీవుల్లో పెద్ద దీవి మధ్య అండమాన్​ (1536 చ.కి.మీ.)
    అండమాన్​లో చిన్న దీవి కర్ల్​ ఐలాండ్​ (0.3 చ.కి.మీ.)
    దక్షిణ అండమాన్​కు, లిటిల్​ అండమాన్​కు మధ్య డంకన పాసేజ్​ కలదు. 
    నికోబార్​ దీవుల వైశాల్యం 1653 చ.కి.మీ.
    మొత్తం దీవుల సంఖ్య 19 ( 7 పెద్ద + 12 చిన్నవి) 
    నికోబార్ దీవులను గ్రేట్​ నికోబార్​, కార్​ నికోబార్​ దీవులుగా విభజించవచ్చు. 
    గ్రేట్​ నికోబార్ దీవులను లాహెన్​చింగ్​ దీవులు అని కూడా అంటారు. ఇక్కడే పిగ్మోలియన్​/ ఇందిరా పాయింట్​ కలదు.
    కార్​ నికోబార్​ దీవుల్లో చిన్న దీవులు కచ్ఛల్​, కమౌటా, నన్​కౌరి, ట్రింకట్​
    భారతదేశంలో మొట్టమొదట సూర్యకిరణాలు పడే ప్రాంతం కచ్ఛల్​
    భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి గ్రేట్​ నికోబార్ 
    నికోబార్ దీవుల్లో పెద్దది గ్రేట్​ నికోబార్ (1045 చ.కి.మీ.), నికోబార్ దీవుల్లో చిన్న పిల్లోమిల్లో (1.3 చ.కి.మీ.) 
    అండమాన్​ నికోబార్ దీవులు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. కానీ, ఈ దీవుల్లో సున్నపురాయితో ఏర్పడిన దీవులు ఇంటర్​వ్యూ, అండమాన్
​    భారతదేశంలో అతిపెద్ద దీవి మధ్య అండమాన్

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం    ఫిబ్రవరి 2
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం    మార్చి 3
ప్రపంచ జల దినోత్సవం    మార్చి 22
ధరిత్రీ దినోత్సవం    ఏప్రిల్​ 22
ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం    మే 22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం    జూన్​ 5
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం    జూన్​ 8
ప్రపంచ జనాభా దినోత్సవం    జూన్ 11
అంతర్జాతీయ పులుల దినోత్సవం    జూన్​ 29
ప్రపంచ ఏనుగుల దినోత్సవం    ఆగస్టు 12
అంతర్జాతీయ ఓజోన్​ పొర సంరక్షణ దినోత్సవం    సెప్టెంబర్​ 16
ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం    సెప్టెంబర్​ 18
ప్రపంచ నదులు దినోత్సవం    సెప్టెంబర్​ చివరి వారం
ప్రపంచ ఆవాస దినోత్సవం    అక్టోబర్​ మొదటివారం
ప్రపంచ నేలల దినోత్సవం    డిసెంబర్​ 5