TSPSC : కేటీఆర్.. పబ్బుల్లో తాగి పడుకుంటే నిరుద్యోగుల కష్టాలు పట్టవు : ఆర్ఎస్ ప్రవీణ్

బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ (ఏప్రిల్ 3) హన్మకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేయూలో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కాదని.. ఉద్యోగులు చేసిన తప్పుగా కాకుండా, ఒక మాఫియా చేసిన పనిగా చూడాలని విమర్శించారు. సామాన్య జనం విద్యను నమ్ముకుంటుంటే.. బీఆర్ఎస్ పార్టీ దాన్ని అమ్ముకుంటుందని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్.

తర్వాత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కేయూ వీసీ బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారారని, క్యాంపస్ ని కాపాడటానికి విద్యార్థులు మీటింగ్స్ పెడితే అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. తాను కేయూ క్యాంపస్ కు ఒక పార్టీ అధినేతగా రాలేదని.. ఒక పూర్వ విద్యార్థిగా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా వచ్చానని విద్యార్థులకు తెలియజేశారు. 

సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే పేపర్ లీక్ లు జరుగుతున్నాచయని, ముందు కేసీఆర్, కేటీఆర్, జనార్దన్ రెడ్డిలు వాళ్ల పదవులకు రాజీనామా చేస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయన్నారు ప్రవీణ్. వీళ్లు రాజీనామా చేశాకే రద్దైన పేపర్ల పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్. పబ్బుల్లో తాగి పడుకునే కేటీఆర్‌కు నిరుద్యోగుల కష్టాలు అర్థంకావని, జనాల్లోకి రావాలని ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి ఇంటి దొంగలు ఇప్పటికీ సురక్షితంగా ఉంచుతోందని అన్నారు. చిన్న చేపలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీని తొలగించి, సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు ప్రవీణ్. పేపర్ లీకేజీ ఘటనపై ఈడీ ఎంక్వైరీ జరిపిచాలని, కేయూ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని కోరారు.