పది నెలల్లో చేసింది చెప్పుకుంటే.. పదేండ్లు అధికారం మాదే: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

పది నెలల్లో చేసింది చెప్పుకుంటే.. పదేండ్లు అధికారం మాదే: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ ప్రభుత్వం పది నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జనాలకు సరిగ్గా చెప్పుకుంటే చాలు..పదేండ్ల పాటు అధికారం తమదేనని పీసీసీ చీఫ్ మహశ్ కుమార్ గౌడ్ అన్నారు. వాస్తవానికి తాము చేసిన అభివృద్ధిని అనుకున్న రీతిలో జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ వైఫల్యం కూడా ఉన్నదని, ఇదే సమయంలో తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా సాగిస్తున్న తప్పుడు ప్రచారం కూడా మరో కారణమని పేర్కొన్నారు. 

శనివారం మహేశ్​కుమార్​గౌడ్ ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.  పదేండ్లలో కేసీఆర్​ఇచ్చినన్ని ఉద్యోగాలను తాము 10 నెలల్లోనే భర్తీ చేశామని చెప్పారు.  కేవలం పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,  ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని  స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఈ 10 నెలల్లో కేసీఆర్ ఒక్కనాడైనా ఎక్కడైనా కనిపించారా? అని ప్రశ్నించారు. ప్రజలు 39 సీట్లు ఇస్తే ఆయన ఫాంహౌస్ లో ఉండడం ఏమిటని నిలదీశారు. అసలు ఆయనే ఇంటికి పరిమితమయ్యారా?లేక కేటీఆర్, హరీశ్​ కుమ్మక్కై బలవంతంగా కేసీఆర్ ను బయటకు రానీయకుండా ఇంట్లోనే ఉంచారా? అనేది  చెప్పాలని డిమాండ్ చేశారు. 

లగచర్ల ఘటనలో రాజకీయ కుట్ర

బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయడంతోనే తాము అప్రమత్తమయ్యామని, ఈలోపే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని మహేశ్​గౌడ్​ చెప్పారు. కేవలం 64  సీట్లు మాత్రమే ఉండడంతో తమకు కూడా కొంత ఆందోళన ఉండేదని, పదే పదే ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ చెప్పడంతోనే తమ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే అండగా నిలి చారన్నారు. లగచర్ల ఘటనలో రాజకీయ కుట్ర ఉందని తెలిపారు. భూములు లేనివారు కలెక్టర్​పై దాడులు చేయడం ఏమిటని అన్నారు. ఈ కుట్రలో కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. 

తమ వెనకాల కేసీ ఆర్, కేటీఆర్, హరీశ్​ ఉన్నారని నిందితులే చెప్పారని తెలి పారు. ‘‘ఫార్ములా ఈ– రేస్​లో ప్రజల సొమ్మును కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారు? కేటీఆర్​ను అరెస్టు చేయాల్సిందే’’అని అన్నారు. ఎలాగో అరెస్టు అవుతానని కేటీఆర్​కు తెలియడంతోనే ఆయన డైవర్షన్ పాలిటిక్స్​కు తెరలేపారని చెప్పారు. అందుకే  జైలుకు పోవడానికి సిద్ధమని పదే పదే అంటున్నాడని తెలిపారు. ఈ కేసులో గవర్నర్ అనుమతి రావాల్సి ఉం దని, తాము ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతామని చెప్పారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, తాము రాజకీయ కక్షలతో ఎవరినీ జైలుకు పంపబోమని అన్నారు. కేటీఆర్ అరెస్టులో కొంత జాప్యం జరగడంతో జనం కూడా తమ ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉందని అనుకుంటున్న మాట వాస్తవమే అని, అయినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుందని చెప్పారు. అవినీతికి పాల్పడిన, ప్రజా ధనాన్ని దోచుకున్న వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.  

రేవంత్, నేను జోడెద్దుల్లా పనిచేస్తున్నం

త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని వేస్తామని, ఈ నెలాఖరులోగా చిన్నపాటి కార్యవర్గాన్ని ప్రకటించి, ఆ తర్వాత విస్తరిస్తామని మహేశ్​ గౌడ్​ చెప్పారు. త్వరలోనే మంత్రి మండలి విస్తరణ కూడా ఉంటుందని, ఆ తర్వాత మిగిలి న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్..తాను జోడెద్దుల్లా కలిసి పనిచేస్తున్నామని, పవర్ పాయింట్స్​ అంటూ ఏమీ లేవని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. తాను అందరి వాడిని కాబట్టే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని చెప్పారు.

కార్యకర్తలకు ఇంకా పదవులు దక్కకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనన్నారు.  హైడ్రా, మూసీ, కుల గణన విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  చెప్పారు. కుల గణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని స్వయంగా రాహుల్ గాంధీయే చెప్పారన్నారు. మూసీపై త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ పెడ్తామని చెప్పారు.  విద్య,వైద్యానికిమా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఆ తర్వాత వ్యవసాయానికి ప్రయారిటీ ఇస్తున్నం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఈ రంగాలను పూర్తిగా విస్మరించారు.