
గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. వీలైనంత వేగంగా ప్రాజెక్ట్‌ను గ్రౌండ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నది. ఒకట్రెండు నెలల్లో ప్రాజెక్టును పట్టాలెక్కించే కుట్రలకు పాల్పడుతున్నది. జూన్ 1 నాటికి టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.
ఏపీ జీబీ లింక్ ప్రాజెక్ట్‌పై రాష్ట్ర సర్కారు మరింత వేగంగా ముందుకు వెళ్లకుంటే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసినా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కూడా దానిపై స్పందించడం లేదు.
ALSO READ : ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
జీబీ లింక్ ప్రాజెక్టుకు ఏపీ కేంద్రం నుంచి దొంగచాటుగా పర్మిషన్లను తెచ్చుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ అధికార పార్టీ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఇసుమంతైనా స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు కేంద్ర జలవనరుల సంఘానికీ ఏపీ ఎలాంటి డీపీఆర్‌లను సమర్పించకుండానే ప్రాజెక్టు పనులపై ముందుకు వెళ్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దీనిపై సీడబ్ల్యూసీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ఏపీకి సీడబ్ల్యూసీ నుంచిగానీ, కేంద్ర జలశక్తి శాఖ నుంచిగానీ ఎలాంటి లేఖలు పంపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనువెంటనే స్పందించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. మరోసారి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏపీ వేస్తున్న ఎత్తులకు కృష్ణా జలాల్లో మరింత గండి పడే ప్రమాదం పొంచి ఉంది.