మనం సూపర్ పవర్ కావాలంటే.. వ్యవసాయం పరిశ్రమ స్థాయికి ఎదగాలి

ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు రెండు విషయాలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) విధానానికి స్వస్తి చెప్పే అవకాశం ఉందనే ఆందోళన ఒకటైతే.. కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలకు ప్రైవేట్ కంపెనీలు కట్టుబడి ఉండని పక్షంలో రైతులకు ఎలా రక్షణ ఉంటుందనేది రెండోది. ఎంఎస్​పీకి సంబంధించి ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇస్తున్నారు. రైతు నాయకులతో చర్చల్లో ఈ విషయంపై లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భరోసా ఇస్తున్నారు. అయినా రైతులకు నమ్మకం కుదరడం లేదు. కేంద్రం మాత్రం రైతులను ఒప్పించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

మన దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైనా వాటి ప్రయోజనం గ్రామీణ, వ్యవసాయ రంగానికి చేరడం లేదు. ఈ రంగాల్లోకి ఎలాంటి పెట్టుబడులు రావడం లేదు. అందువల్ల ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందినా, గ్రామీణ ఆర్థిక రంగాలు మాత్రం నీరసించి పోతున్నాయి. రైతుల ఆదాయం పడిపోతున్నది. వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నది. గ్రామాల నుంచి జనం కూలీలుగా పట్టణాలకు తరలి వస్తున్నారు. వ్యవసాయం నుంచి తప్పుకుంటున్న వారికి పట్టణాల్లో వేరే ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోతున్నది. అయినా కరోనా సమయంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా, నిలదొక్కుకొని, వృద్ధి చూపుతున్నది గ్రామీణ, వ్యవసాయ రంగాలే.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

ప్రధాని మోడీ ఆశిస్తున్నట్లు మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్నా, మనం సూపర్ పవర్ కావాలన్నా వ్యవసాయ రంగం లాభదాయకం కావాలి. దేశంలో ఇప్పటికీ అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. ఇంత కీలకమైన వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయాలనే దృఢ సంకల్పాన్ని ప్రధాని మోడీ ప్రకటించడం స్వాగతించాల్సిన విషయం. 1960ల్లో ఇందిరా గాంధీ హరిత విప్లవంతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన అసాధారణ మార్పుల తర్వాత ఈ రంగంపై కేంద్రం పెద్ద ఎత్తున దృష్టి సారించడం ఇదే తొలిసారి. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. వరి, గోధుమల వంటివి శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అందుకే ఆహార ధాన్యాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరను 1966–67లో ప్రారంభించారు. మొదటగా గోధుమలు క్వింటాల్ కు రూ.54 ధర నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పంటల సంఖ్యను 23కు పెంచారు.

ఆరు శాతం మంది రైతులకే ఎంఎస్పీ ప్రయోజనం

కేంద్రం జీవోల ద్వారా ఎప్పటికప్పుడు ఎంఎస్​పీని ప్రకటించడమే గానీ, అందుకు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు. దేశంలో 6% మంది రైతులే ఎంఎస్​పీ ప్రయోజనం పొందుతున్నారని కేంద్రం నియమించిన శాంత కుమార్ కమిటీ నిర్ధారించింది. దేశంలో ఐదారు వందల పంటలు పండుతుండగా 23 పంటలకే ఎంఎస్​పీని ప్రకటిస్తున్నారు. వీటిల్లో వరి, గోధుమ, పత్తి పంటలను ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేసే వ్యవస్థ మాత్రమే ఉంది. మిగిలిన పంటలకు ఎలాంటి వ్యవస్థలు లేవు. వాటి ధరలు పడిపోయినా ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా ఉండదు. మనకు భారీగా ఫారిన్​ కరెన్సీ తీసుకొస్తున్న పొగాకు, పసుపు, మిర్చి వంటి వాటికీ కనీస మద్దతు ధర లేదు. మిగిలిన పంటలకు ఎంఎస్​పీ వ్యవస్థలోకి తీసుకు రావాలని రైతు నాయకులు కూడా అడగడం లేదు. పంటల ధరలు బాగా పడిపోయినప్పుడు మార్క్​ఫెడ్ వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు చేపట్టినా అప్పటి వరకు ఆగలేక రైతులు దళారులకు అయినకాడికి అమ్ముకోవడం చూస్తున్నాం.

ఎక్కడైనా పంటను అమ్ముకునే స్వేచ్ఛ

కొత్త వ్యవసాయ చట్టాల్లో రైతులకు లభించిన పెద్ద అవకాశం ఎక్కడైనా తమ ఉత్పతులను అమ్ముకునే స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా రైతులు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పంటలను తమ సొంత వాడకానికి కూడా తీసుకురాలేని విధంగా నిత్యావసర వస్తువుల చట్టం రైతులను కట్టడి చేస్తున్నది. అందుకే రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందలేకపోతున్నారు. వాస్తవానికి వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. రైతులు ఎక్కువగా దళారీల చేతుల్లో దోపిడీకి గురవుతున్నది ఇక్కడే. ఈ మార్కెట్ వ్యవస్థ ద్వారా రైతులకు గరిష్టంగా ధర లభించేలా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించలేదు. మార్కెట్ కమిటీల్లో సంస్కరణల కోసం యూపీఏ ప్రభుత్వం టైంలోనే ముసాయిదా మార్కెట్ కమిటీ బిల్లును రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్రాలు చెప్పుకోదగిన శ్రద్ధ చూపలేదు. ఇప్పుడు రైతులు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయవలసి ఉంది.

పరిశ్రమగా మార్చే చర్యలు అవసరం

మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి పారిశ్రామిక వాతావరణం మెరుగుపడితే సహజంగానే రైతులకు కూడా ఎక్కువ ధరలు లభిస్తాయి. మౌలికంగా వ్యవసాయ సంస్కరణల లక్ష్యం అదే కావాలి. ఆ దిశలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లో మార్పులు అవసరమైతే పరస్పర సంప్రదింపుల ద్వారా సాధించుకునే అవకాశం ఉంది. కేంద్రం కూడా చట్టాల్లో మార్పులకు సానుకూలత చూపుతున్నది. వ్యవసాయ రంగ సమస్యలపై ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత తొలిసారిగా కేంద్రం దృష్టి సారిస్తున్నది. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి ఇదొక బంగారు అవకాశం. రాజకీయాలకు తావు లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఉద్యమించాలి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనేలా రైతులకు లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి.

ఫుడ్​ ప్రాసెసింగ్​కు మోడీ సర్కారు ప్రాధాన్యత

కేంద్రం వద్ద రెండున్నరేండ్లకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. నిల్వచేసే సామర్థ్యం సరిగ్గా లేకపోవడంతో 30 శాతం వరకూ ధాన్యాలు పనికిరాకుండా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడం అసాధ్యం అవుతోంది. మరోవైపు కాంట్రాక్టు వ్యవసాయం ఇప్పటికే 25% వ్యవసాయ ఉత్పత్తులకు అమలులో ఉంది. ప్రైవేట్ వ్యాపారులను రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చేయడం సులువు కాదు. ఎందుకంటే రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సివిల్ కోర్టులు, ప్రత్యేక ట్రిబ్యునల్స్​కు ఇటువంటి వివాదాలను తీసుకెళ్లినా సుదీర్ఘ న్యాయ పోరాటాలకు సన్న, చిన్నకారు రైతులు తట్టుకోవడం అసాధ్యం. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయడమే ఈ సమస్యలకు పరిష్కారం అవుతుంది. అందుకే మోడీ సర్కార్​ మొదటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోంది. పైగా ప్రతి మండల కేంద్రంలో కోల్డ్​ స్టోరేజ్​లు నెలకొల్పేలా ప్రోత్సహించడం ద్వారా రైతులు చౌకగా తన ఉత్పత్తులను అమ్ముకోనీయకుండా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది. – చలసాని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్.