- కవిత వచ్చే ఏడాది తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతుంది
చండూరు (మర్రిగూడ), వెలుగు: ‘నేను రాజీనామా చేశాను కాబట్టే మునుగోడు గురించి మాట్లాడుతున్నరు.. ఊరుకు ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి తిరుగుతున్నరు’ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ‘మీ కోసమే రాజీనామా చేశాను, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి’ అని కోరారు. అనంతరం జరిగిన రోడ్‌షోలో మాట్లాడారు. మునుగోడులో తనను గెలిపిస్తే ప్రభుత్వానికి ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సంతలో పశువుల్లా 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఓపెన్ చేస్తూ మహిళల పుస్తెల తాళ్లు తెంపుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ లీడర్లు ఇతర కార్యకర్తల ఇండ్లలోకి వెళ్లి కేసులు పెడుతామని బెదిరించి కండువాలు కప్పుతున్నారన్నారు.
తనను ఓడించేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అవే డబ్బులను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుండేదన్నారు. మునుగోడులో గెలిచాక కేసీఆర్ కుటుంబం సొంత విమానంలో పారిపోవాల్సిందేనని, ఇప్పటివరకు తెలంగాణలో బతుకమ్మ ఆడిన కవిత వచ్చే ఏడాది తీహార్ జైల్లో ఆడుతుందన్నారు. కేంద్రం నుంచి రూ. వెయ్యి కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఒక్కో మహిళకు రూ. 2 లక్షల చొప్పున ముద్ర లోన్స్ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు.