సీటివ్వకుంటే రెబల్​గా దిగుడే! .. సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు

  • సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు
  • ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక ఊరుకోబోమని హెచ్చరిక
  • ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇచ్చుడేందని ఆగ్రహం


హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ బీసీ లీడర్లు ఇక ఫైటింగ్​కే సిద్ధమయ్యారు. సీటివ్వకుంటే రెబల్​గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. బీసీలకు సీట్ల విషయంపై హైకమాండ్ వద్ద తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన బీసీ లీడర్లు.. శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో సమావేశమయ్యారు. భేటీ అయిన వారిలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్, చెరుకు సుధాకర్ తదితర సీనియర్​ నేతలు ఉన్నారు. వీరు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావ్ ఠాక్రే, రోహిత్​ చౌదరితో భేటీ అయ్యారు.

 జనాభా సంఖ్యకు అనుగుణంగా బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే, సర్వేలనే నమ్ముకున్న హైకమాండ్.. బీసీలకు 25 స్థానాలకు మించి ఇచ్చేందుకు ఆసక్తి చూపించట్లేదని తెలుస్తున్నది. రాహుల్ గాంధీ హామీ మేరకు సీట్లు, ఉదయ్​పూర్ డిక్లరేషన్ అమలు వంటి వాటిని పట్టించుకోకుంటే రెబల్స్​గా మారే యోచనలో పలువురు లీడర్లు ఉన్నట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ లీడర్లు భేటీ కావాలనుకున్నా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో సాధ్యపడలేదు.

 
పదేండ్లుగా కష్టపడుతున్నం

పదేండ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు బీసీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసినా తమను పట్టించుకోవడం లేదని, చివర్లో వచ్చిన పారాచూట్ నేతలకు టికెట్లను ఆఫర్ చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఇలాంటప్పుడు టికెట్లు ఇవ్వకుంటే రెబల్స్​గా బరిలో దిగడం కన్నా ఆల్టర్నేటివ్​ తమకేం ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం ఎంత విధేయంగా పనిచేస్తున్నా ఎప్పుడూ టికెట్​ నిరాకరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

ALSO READ: స్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్నెట్!

మైనంపల్లి.. కేసీఆర్​పై పోటీ చేయాలి

ఓడిపోయే సీట్లలోనే బీసీలకు టికెట్లు ఇస్తూ.. సమన్యాయం చేస్తున్నామంటూ స్పీచులు ఇస్తున్నారని పలువురు బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పోటీ చేసే నియోజకవర్గాల్లో వెలమలు, రెడ్లు పోటీ చేయాలని సవాల్ విసరుతున్నారు. అంతేకాదు.. రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావును మల్కాజిగిరి నుంచి కాకుండా గజ్వేల్​లో కేసీఆర్ మీద పోటీ చేయించాలని, ఆయన మీద గెలిచి మాట్లాడాలని చెరుకు సుధాకర్ శుక్రవారం సవాల్ విసిరారు. కీలక స్థానాల్లో వెలమల మీద వెలమలు, రెడ్ల మీద రెడ్లు పోటీ చేస్తే బీసీల తరఫున ఓట్లేయిస్తామని చెప్పారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీసీలు గెలిచేందుకు రెడ్లు, వెలమ నేతలు సపోర్ట్ చేయాలన్నారు.


బీసీ నేతలపై వేణుగోపాల్​ సీరియస్! 

కేసీ వేణుగోపాల్ తో అరగంటకు పైగా సాగిన భేటీలో.. ప్రతి పార్లమెంట్ స్థానంలో ఇద్దరికి చొప్పున.. మొత్తం 34 సీట్లు బీసీలకు కేటాయించాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల రాష్ట్రంలో బీసీల మద్దతు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే వేణుగోపాల్ మాత్రం బీసీ నేతలపై సీరియస్ అయినట్టు తెలిసింది. సీనియర్ లీడర్లు అనేది కూడా చూడకుండా అవమానించారని, నిలబెట్టే ఇష్టమొచ్చినట్టు మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, ఈ టైంలో బీజేపీ, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చేలా వ్యవహరించొద్దని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైకమాండ్ సర్వేలు, సామాజిక న్యాయం రెండింటికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పిట్లు సమాచారం.